logo

గూడు కట్టిస్తారా..? దారే చూపలేదు..

ఇళ్లు కాదు.. ఊళ్లే నిర్మిస్తాం అన్నారు. ఒకటి కాదు.. రెండు కాదు వేలు, లక్షల్లో పేదలకు ఇళ్లు మంజూరు చేసి వారి సొంతింటి కల సాకారం చేస్తామన్నారు.

Published : 21 Apr 2024 05:45 IST

 మూడేళ్లైనా పేదల ఇళ్లకు మోక్షం లేదు

 గృహ లబ్ధిదారులకు తప్పని అవస్థలు

 

మొండిగోడలతో నిలిచిపోయిన నెలిపర్తి కాలనీలో పేదల ఇళ్లు

న్యూస్‌టుడే, సాలూరు: ఇళ్లు కాదు.. ఊళ్లే నిర్మిస్తాం అన్నారు. ఒకటి కాదు.. రెండు కాదు వేలు, లక్షల్లో పేదలకు ఇళ్లు మంజూరు చేసి వారి సొంతింటి కల సాకారం చేస్తామన్నారు.. వైకాపా అయిదేళ్ల పాలనలో జగనన్న కాలనీలకు కనీసం దారి కూడా చూపలేకపోయారు పాలకులు. మంజూరైన ఇళ్లు రద్దవుతాయనే భయంతో అప్పులు చేసి, నానా అవస్థలు పడి లబ్ధిదారులు నిర్మాణాలు చేపట్టారు. నిర్మాణ సామగ్రి ధరలు పెరగడంతో ఇళ్లు పునాదులకే పరిమితమయ్యాయి. సాలూరు పట్టణంలోని గుమడాం, నెలిపర్తి కాలనీల్లో పరిస్థితే ఇందుకు నిదర్శనం.
సాలూరులోని రెండు లేఅవుట్లలో సుమారు 2,676 మందికి ఇళ్లు మంజూరు కాగా, 114 మందే నిర్మించారు. వీటిలో 1,024 వివిధ దశల్లో ఉన్నాయి. మూడేళ్లలో కనీసం పది శాతం కూడా పనులు జరగలేదు. మౌలిక సదుపాయాలు కల్పించక పోవడమే దీనికి కారణం. కాలనీలకు వెళ్లేందుకు అప్రోచ్‌ రోడ్డు లేదు. దీంతో నిర్మాణ సామగ్రి తరలించేందుకు నానా అవస్థలు పడుతున్నారు. నెలిపర్తి-1 లేఅవుట్‌కు అప్రోచ్‌ రోడ్డుకు రూ.45 లక్షలు, నెలిపర్తి-2 లేఅవుట్‌, ఇతర రోడ్ల నిర్మాణానికి రూ.80 లక్షలు మంజూరై, టెండర్లు పూర్తయి రెండేళ్లు కావస్తున్నా నేటికీ పనులు ప్రారంభం కాలేదు. వీటితో పాటు ప్రత్యామ్నాయదారి, గుమడాం, పెదహరిజనపేట సమీపంలో ఉన్న లేఅవుట్లలో రోడ్లు వేసేందుకు ప్రతిపాదనలు చేశారు తప్ప నిధులు మంజూరు కాలేదు. దారే చూపని వారు ఇళ్లేం కట్టిస్తారని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టెండర్లు దక్కించుకున్న గుత్తేదారులను రోడ్డు పనులు చేయాలని కోరామని, పనులు జరిపిస్తామని పుర ఏఈ సూరినాయుడు తెలిపారు.

నెలిపర్తి-2 లేఅవుట్‌లో అధ్వానంగా దారి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని