logo

నేను ఉన్నానన్నావ్‌.. విన్నానన్నావ్‌.. ఐదేళ్లుగా ఏం చేశావ్‌!

‘నేను విన్నాను.. నేను ఉన్నాను’ అంటూ పాదయాత్రలో నమ్మించారు జగన్‌. ఆ మాటలు ఉమ్మడి జిల్లా ప్రజలు నిజమే అనుకున్నారు. ఇక తమ కష్టాలు తీరినట్లేనని ఓట్లు వేసి గద్దెనెక్కించారు.

Updated : 23 Apr 2024 07:47 IST

‘నేను విన్నాను.. నేను ఉన్నాను’ అంటూ పాదయాత్రలో నమ్మించారు జగన్‌. ఆ మాటలు ఉమ్మడి జిల్లా ప్రజలు నిజమే అనుకున్నారు. ఇక తమ కష్టాలు తీరినట్లేనని ఓట్లు వేసి గద్దెనెక్కించారు. తీరా.. నెగ్గిన తర్వాత మళ్లీ కల్లబొల్లి మాటలతో ఊరూవాడా.. తిరిగి నేనొచ్చాను.. మీ బాధలు చూశానని.. హామీలు గుప్పించారు.  ఇక అంతే.. ఇలా అయిదేళ్లు మోసగించి మళ్లీ ఎన్నికలకు సిద్ధమంటూ రాబోతున్నారు.. ప్రజలారా తస్మాత్‌ జాగ్రత్త.

ఈనాడు-విజయనగరం, న్యూస్‌టుడే బృందం

అడుగంటిన ఆశలు

హామీ: గుమ్మిడిగెడ్డ మినీ జలాశయం పూర్తి చేస్తా

ప్రస్తుత పరిస్థితి: గతేడాది జూన్‌ 28న కురుపాంలో నిర్వహించిన అమ్మఒడి కార్యక్రమంలో సీఎం జగన్‌ వేలాది మంది విద్యార్థుల ఎదుట గుమ్మిడిగెడ్డ మినీ జలాశయం పూర్తి చేస్తామని నమ్మబలికారు. అది నిజమనుకున్న అధికారులు మట్టికట్ట, కాంక్రీట్‌ డ్యామ్‌, తూములు, పాత కెనాల్‌, కొత్త కెనాల్‌ నిర్మాణాలు పూర్తి చేసి 4,500 ఎకరాల భూములకు సాగు నీరందిద్దామని హడావుడిగా రూ.44 కోట్ల అంచనాతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. కానీ హామీ ఇచ్చిన జగన్‌ ఇక్కడి నుంచి వెళ్లిన తర్వాత మరిచారు. ప్రతిపాదనల దస్త్రం మూలకు చేరింది. దీంతో ఎప్పటిలాగే రైతులు పంటల సాగుకు వరుణుడిపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది.

ఫెర్రో..మొర్రో

హామీ: ఫెర్రో అల్లాయీస్‌ పరిశ్రమలను ఆదుకుంటాం. విద్యుత్తు ఛార్జీలు తగ్గిస్తాం.

ప్రస్తుత పరిస్థితి: జగన్‌ ఫెర్రో అల్లాయీస్‌ పరిశ్రమలను సంక్షోభంలోకి నెట్టేశారు. తెదేపా ప్రభుత్వం 2016-17లో యూనిట్‌కు రూ.1.50, 2017-18లో 75 పైసల చొప్పున ఇచ్చిన రాయితీలను ఎత్తేశారు. అప్పటి ప్రభుత్వం ఎండీ ఛార్జీలు, విద్యుత్తు సుంకం వసూళ్లను నిలిపివేయగా పునరుద్ధరించారు. అదనంగా ట్రూఅప్‌ ఛార్జీల పేరిట యూనిట్‌కు 7 పైసల చొప్పున ఏపీఈపీడీఎల్‌, 23 పైసల చొప్పున ఎస్‌పీడీసీఎల్‌ విధించాయి. 2023 ఏప్రిల్‌ నుంచి ఈపీపీసీఏ ఛార్జీల పేరుతో యూనిట్‌కు సగటున 52 పైసల చొప్పున 2021-22 నుంచి వినియోగించిన విద్యుత్తుకు నెలసరి వాయిదాలతో వసూలు చేస్తోంది. అన్ని రకాల ఛార్జీలతో కలిపి చూస్తే ఫెర్రో పరిశ్రమలకు యూనిట్‌ విద్యుత్తు ధర రూ.5.01 నుంచి రూ.7.35 పెరిగింది. దీంతో టన్ను ఫెర్రో లోహం తయారీపై రూ.7 వేల చొప్పున అదనపు భారం పడుతోంది. ఫలితంగా జిల్లాలో 17 పరిశ్రమలు కొన్ని నెలల పాటు మూతపడ్డాయి. ప్రస్తుతం మూలుగుతూ నడుస్తున్నాయి. దాదాపు 10 వేల కార్మిక కుటుంబాల జీవనోపాధికి భరోసా లేకుండా పోయింది. 

తీపి మాటలు.. చేదు చేష్టలు

హామీ: అధికారంలోకి వస్తే భీమసింగి చక్కెర కర్మాగారాన్ని తెరిపిస్తాం.

ప్రస్తుత పరిస్థితి: నాలుగేళ్లుగా క్రషింగ్‌ నిలిపివేశారు. సుమారు 350 మంది వరకు కార్మికులు రోడ్డున పడ్డారు. సంకిలి కర్మాగారానికి రైతులు చెరకు తరలిస్తున్నారు. తెదేపా హయాంలో ఆధునికీకరణకు రూ.12 కోట్లు మంజూరు చేశారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక ఆ నిధులు విడుదల చేయలేదు. దీనిపై మంత్రి బొత్స సత్యనారాయణను రైతు సంఘాలు కలిస్తే ‘చెరకు పండించే రైతులే తగ్గిపోయారు. 1,000 మంది వచ్చి అడిగితే కర్మాగారం తెరిపిస్తామా’ అని ఎదురుదాడికి దిగారు. లచ్చయ్యపేటలోని ఎన్‌సీఎస్‌ చక్కెర కర్మాగారం కూడా మూతపడింది.

అరచేతిలో ప్రాణాలతో పయనం

హామీ:  పూర్ణపాడు-లాబేసు మధ్య నాగావళి నదిపై వంతెన నిర్మాణం పూర్తి చేస్తాం.

ప్రస్తుత పరిస్థితి: కొమరాడ మండలంలో గిరిపుత్రులను ప్రధాన రవాణా సమస్య నుంచి గట్టెక్కిస్తానని హామీ ఇచ్చి.. అధికారంలోకి వచ్చి అయిదేళ్లూ గాలికొదిలేశారు. దీంతో నాగావళికి లాబేసు వైపునున్న 33 గ్రామాల ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెదేపా హయాంలోనే 50 శాతానికి పైగా పనులు పూర్తి చేయగా.. వైకాపా అయిదేళ్లలో 10 శాతం మాత్రమే చేసింది. ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి  పీడిక రాజన్నదొర, ఆయనకు ముందు ఉప ముఖ్య మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పుష్పశ్రీవాణి పూర్తి చేయడంలో శ్రద్ధ చూపలేదు. దీంతో ఆయా గ్రామాల్లోని వేల మంది ప్రజలు అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని నాగావళిని దాటాల్సిన పరిస్థితి నెలకొంది.

పారిశ్రామికవాడకు గ్రహణం

హామీ: అధికారంలోకి రాగానే పరిశ్రమలు తీసుకొచ్చి ఉపాధి కల్పిస్తాం

ప్రస్తుత పరిస్థితి: బొబ్బిలిలో అతి పెద్ద పారిశ్రామికవాడ 1104 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఐదేళ్లలో ఒక్క పరిశ్రమా రాలేదు. పది మందికి కూడా ఉపాధి అందలేదు. 77 యూనిట్లు మూతపడినట్లు ఏపీఐఐసీ లెక్కలు చెబుతున్నాయి. కొత్తగా ఔత్సాహికులకు స్థలాల కేటాయింపు లేదు. ఎంతో అభివృద్ధి చేస్తామన్న పారిశ్రామికవాడ ప్రగతి పూర్తిగా కుంటుపడింది. మౌలిక సదుపాయాలు రహదారులు, డ్రెయిన్లు పాడయ్యాయి. విద్యుదీకరణ లేదు. దశల వారీగా ఉన్న పరిశ్రమలు తరలిపోయే పరిస్థితి కనిపిస్తోంది.

కొండల్లోనే గిరిజన విద్య

హామీ: ఇంజినీరింగ్‌ కళాశాలను పూర్తిచేసి, గిరిజన యువతకు మెరుగైన విద్యను అందిస్తా.

ప్రస్తుత పరిస్థితి: కురుపాం మండలం టేకరికండి ప్రాంతంలో 105 ఎకరాల్లో కళాశాల నిర్మాణానికి 2020 అక్టోబరు రెండో తేదీన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. అయిదేళ్లు అవుతున్నా పూర్తి చేయలేకపోయారు. భవన నిర్మాణాలకు రూ.153 కోట్లతో ప్రణాళిక రూపొందించారు. తొలుత ప్రభుత్వ నిధులు విడుదల చేయకపోవడంతో జేఎన్‌టీయూ కాకినాడ విశ్వవిద్యాలయం విడతల వారీగా రూ.23 కోట్లు మంజూరు చేయడంతో పనులు ప్రారంభించారు. ప్రభుత్వానికి ప్రతిపాదన మేరకు 2023-24 బడ్జెట్‌లో రూ.32.99 కోట్లు మంజూరు చేసినట్లు ప్రకటించినా, నిధులు విడుదల చేయలేదని తెలిసింది. అధికారులు చెబుతున్న దానిని బట్టి ఇప్పటివరకు 50 శాతం పనులే జరిగాయి.

శిలాఫలకం వెక్కిరింపు

హామీ: సాలూరు పట్టణంలో తాగునీటి పథకం పనులు పూర్తి చేస్తాం

ప్రస్తుత పరిస్థితి: తెదేపా హయాంలో సాలూరు పట్టణానికి తాగునీటి పథకాన్ని కేంద్రం మంజూరు చేసి ఏఐఐబీ నిధులు రూ.54 కోట్లు ఇచ్చింది. వైకాపా అధికారంలోకి వచ్చిన వెంటనే పనులు చేపడతామని మాటిచ్చి అయిదేళ్లు గడిచింది. 2022 సెప్టెంబరు 10న పురపాలిక దుకాణ సముదాయం వద్ద పనులకు ఉప ముఖ్యమంత్రి రాజన్నదొర శంకుస్థాపన చేసి, శిలాఫలకం ఆవిష్కరించారు. గాంధీ పార్కులో నీటి ట్యాంకు, సిబ్బంది గది నిర్మాణానికి పునాదులు తవ్వారు. ఆ గోతులు పూడుకుపోతున్నాయి తప్ప పనులు జరగలేదు.

మల్టీపర్పస్‌కు సుస్తీ

హామీ: గిరిజనులకు మెరుగైన వైద్యసేవలు అందిస్తాం

ప్రస్తుత పరిస్థితి: పార్వతీపురంలోని జిల్లా ఆసుపత్రి ఎనిమిది గిరిజన మండలాలకు ప్రధాన ఆధారం. ఏ చిన్న రోగం వచ్చినా ఇక్కడికే వస్తారు. గుండె, మూత్రపిండాలు, చర్మ, ఇతర వ్యాధులతో బాధపడే వారిని విశాఖ రిఫర్‌ చేస్తున్నారు. ఈ పరిస్థితిలో మార్పు తెస్తామని, మరింత మంది నిపుణులను నియమిస్తామని నాలుగేళ్ల క్రితం మల్టీపర్పస్‌ ఆసుపత్రిని ప్రభుత్వం మంజూరు చేసింది. త్వరలోనే ఆ సేవలు ప్రజలకు చేరువ చేస్తామని చెప్పింది. భవన నిర్మాణాలకు రూ49.26 కోట్లు మంజూరు చేసింది. మూడేళ్ల క్రితం వర్చువల్‌గా సీఎం జగన్‌ శంకుస్థాపన చేశారు. భవన నిర్మాణ పనులు ఎనిమిది నెలల క్రితం ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం నెమ్మదిగా సాగుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే మరో రెండేళ్లయినా పూర్తికావు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని