logo

తీరంపై ఎందుకింత నిర్లక్ష్యం

సముద్రంలో వేటాడిన మత్స్యసంపదను దళారుల బారిన పడకుండా గిట్టుబాటు ధరకు విక్రయించుకొనేందుకు వీలుగా తీరప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సామాజిక కేంద్రాలు ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురయ్యాయి.

Published : 25 Apr 2024 04:09 IST

రూ.కోట్ల వ్యయం.. నిరుపయోగం
సామాజిక కేంద్రాలు అలంకారప్రాయం
న్యూస్‌టుడే, భోగాపురం/పూసపాటిరేగ

ముక్కాంలో శిథిలావస్థకు చేరిన ఫిష్‌ల్యాండింగ్‌ కేంద్రం

ముద్రంలో వేటాడిన మత్స్యసంపదను దళారుల బారిన పడకుండా గిట్టుబాటు ధరకు విక్రయించుకొనేందుకు వీలుగా తీరప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సామాజిక కేంద్రాలు ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురయ్యాయి. పదేళ్ల కిందట భోగాపురం మండలం ముక్కాంలో, పూసపాటిరేగ మండలం చింతపల్లిలో వలలు, మోటార్లు, పరికరాలతో పాటు చేపలను భద్రపరిచేందుకు భవనాలను కట్టారు. ఒక్కో కేంద్రానికి రూ.80  లక్షలు వెచ్చించారు. అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించారు. అయితే ఇవి ప్రారంభానికి నోచుకోక వినియోగానికి దూరమయ్యాయి. అయిదేళ్ల వైకాపా పాలనలో నిర్వహణ పనులు కొరవడటంతో శిథిలావస్థకు చేరుకున్నాయి.

అనువుగా లేని చోట...

మత్స్యకార జనాభా అధికంగా ఉన్న ముక్కాం, చింతపల్లి గ్రామాల్లో సామాజిక కేంద్రాలు ఏర్పాటు చేయాలన్న అధికారుల ఆలోచన బాగానే ఉంది. అయితే వీటిని ఒడ్డుకు దూరంగా అనువుగా లేని ప్రదేశాల్లో నిర్మించడంతో వృథాగా పడి ఉన్నాయి. ఇక్కడ మత్స్యసంపదను నిలువ చేసేందుకు వీలుగా విద్యుత్తు, మంచినీటి సౌకర్యాలు కల్పించినా.. చేపల ఆరబోతకు ప్లాట్‌ఫాంలు నిర్మించినా.. అందుబాటులో లేకపోవడంతో మత్స్యకారులు ముందుకు రాక నిరుపయోగంగా మారాయి.


వినియోగానికి దూరంగా..

చింతపల్లి తీరంతో పడవల మరమ్మతులకు కట్టిన భవనం ఇలా..

ముక్కాం తీరంలో ఏర్పాటుచేసిన సామాజిక కేంద్రం ప్రారంభానికి నోచుకోలేదు. ఇక్కడ 20 సెంట్ల స్థలంలో నిర్మించిన భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. నిరుపయోగంగా ఉండడంతో అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారాయి. ఒడ్డు నుంచి రహదారి లేనందున మత్స్యకారులు ఆసక్తి చూపక అలాగే వదిలేశారు. వీరికి అవగాహన కల్పించి అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు చొరవ తీసుకోలేదు.

  • చింతపల్లి తీరంలో ఫిష్‌ ల్యాండింగ్‌ కేంద్రం నిరుపయోగంగా ఉండిపోగా... దీని అభివృద్ధి కోసం మత్స్యశాఖ ప్రత్యేకంగా నిధులు రూ.12.50 లక్షలు కేటాయించడం విశేషం. ఒడ్డుకు దూరంగా, అందుబాటులో లేని భవనాలను బాగు చేయడం వల్ల ప్రయోజనం ఉండదని స్థానిక మత్స్యకారులే పెదవి విరుస్తున్నారు.

పరిశీలించి పునరుద్ధరిస్తాం..
- నిర్మలాకుమారి, డిప్యూటీ డైరెక్టర్‌, మత్స్యశాఖ

తీర గ్రామాల్లో సామాజిక కేంద్రాల పరిస్థితిని పరిశీలించి పునరుద్ధరణకు ప్రణాళిక చేపడతాం. మత్స్యకారులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్న ప్రభుత్వ ఉద్దేశం. వీటికి అవసరమైన మరమ్మతులకు చర్యలు తీసుకుంటాం. మత్స్యకారుల్లో అవగాహన కల్పించి వినియోగంలోకి వచ్చేలా చూస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు