logo

మండుటెండలో సమరోత్సాహం

పసుపు, తెలుపు, కాషాయం జెండాల రెపరెపలు.. కేరింతలు, నృత్యాలతో సందడి చేసిన కూటమి శ్రేణులు.. చీపురుపల్లి వీధుల నిండా జనం..

Published : 25 Apr 2024 04:14 IST

కూటమి అభ్యర్థి కళా వెంకటరావు నామపత్రాలు దాఖలు

బహిరంగ సభలో ప్రసంగిస్తున్న కళా వెంకటరావు, పక్కన నాగార్జున, రామ్‌మల్లిక్‌నాయుడు

గరివిడి, చీపురుపల్లి, న్యూస్‌టుడే: పసుపు, తెలుపు, కాషాయం జెండాల రెపరెపలు.. కేరింతలు, నృత్యాలతో సందడి చేసిన కూటమి శ్రేణులు.. చీపురుపల్లి వీధుల నిండా జనం.. నామినేషన్‌ కార్యక్రమమే విజయయాత్ర తరహాలో అట్టహాసంగా ఎన్డీఏ కూటమి బలపరిచిన చీపురుపల్లి తెదేపా అభ్యర్థి, మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావు బుధవారం నామపత్రాలు దాఖలు చేశారు. కనక మహాలక్ష్మీ అమ్మవారికి పూజలు చేసి ఉదయం 11.10 గంటలకు ఆర్డీవో కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిణి బి.శాంతికి నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. కళా వెంట తెదేపా నేతలు మాజీ ఎమ్మెల్యే గద్దెబాబూరావు, నియోజకవర్గ పూర్వపు ఇన్‌ఛార్జి కె.త్రిమూర్తులరాజు, దన్నాన రామచంద్రుడు, రౌతు కామునాయుడు, పార్టీ పరిశీలకుడు వెలగపూడి గోపాల కృష్ణప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

చీపురుపల్లి రోడ్లపై కదంతొక్కిన తెదేపా, జనసేన, భాజపా శ్రేణులు

ఆస్తులు ఇవీ

చీపురుపల్లి ఎమ్మెల్యే కూటమి అభ్యర్థి కిమిడి కళా వెంకటరావు బుధవారం నామినేషన్‌ దాఖలు చేసిన సమయంలో ఆర్వోకు సమర్పించిన అఫిడవిట్‌లో పొందుపరిచిన ఆస్తులు, కేసుల వివరాల ప్రకారం.. చేతిలో, బ్యాంకులో నగదుతో పాటు వాహనాలు, బంగారం తదితర చరాస్తులు తన పేరిట రూ.40,42,251, భార్య పేరుపై రూ.2,91,57,082, హిందూ అవిభక్త కుటుంబం విభాగం కింద రూ.13,89,560 చూపించారు.  స్థిరాస్తుల మార్కెట్‌ విలువ ప్రకారం కళా పేరుపై రూ.4,43,99,400, భార్య పేరిట రూ.18,22,51,000 ఉన్నాయి. రుణాలు లేవు. నెల్లిమర్ల మండలం రామతీర్థంలో 2021లో రాముని విగ్రహం శిరస్సు నరికిన సంఘటన సమయంలో ఆ ప్రదేశాన్ని పరిశీలించడానికి వెళ్లినందుకు అక్కడి ఠాణాలో పలు సెక్షన్లపై కేసు, పోలీసుల ఆదేశాలను బేఖాతరు చేసి ఉల్లాసపేటలో పర్యటించారంటూ ఆమదాలవలస ఠాణాలో మరో కేసు నమోదైనట్లు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని