logo

ఆయకట్టు ఆయువు తీసేశారు

అధికారికంగా 2,200 ఎకరాల ఆయకట్టు.. అనధికారికంగా మరో 500 ఎకరాలు.. వందలాది మంది రైతులకు ప్రధాన నీటి వనరు.. 40కు పైగా చెరువులకు దిక్కైన ఎస్‌.కోట మండలంలోని చిలకలగెడ్డ ఆనకట్ట పాలకుల తీరుతో నేడు అధ్వాన పరిస్థితిలో కొట్టుమిట్టాడుతోంది.

Published : 20 May 2024 03:50 IST

అధ్వానంగా దర్శనమిస్తున్న చిలకలగెడ్డ ఆనకట్ట
2,700 ఎకరాలకు అందని సాగునీరు
న్యూస్‌టుడే, శృంగవరపుకోట

అధ్వానంగా దర్శనమిస్తున్న చిలకలగెడ్డ ఆనకట్ట, పక్క చిత్రంలో ప్రధాన గోడకు పడిన రంధ్రం

అధికారికంగా 2,200 ఎకరాల ఆయకట్టు.. అనధికారికంగా మరో 500 ఎకరాలు.. వందలాది మంది రైతులకు ప్రధాన నీటి వనరు.. 40కు పైగా చెరువులకు దిక్కైన ఎస్‌.కోట మండలంలోని చిలకలగెడ్డ ఆనకట్ట పాలకుల తీరుతో నేడు అధ్వాన పరిస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఏళ్ల నాటి ఈ నిర్మాణం ప్రస్తుతం శిథిలావస్థకు చేరింది.. వైకాపా ప్రభుత్వం ఏనాడూ దీనిని పట్టించుకోలేదు.. శివారు భూములకు సాగునీరు అందించలేదు.. దీంతో ఆయకట్టు బోరుమంటోంది..

ఎస్‌.కోట, అనంతగిరి మండలాల మధ్యలోనే బొడ్డవర గ్రామ సమీపంలో ఉన్న చిలకలగెడ్డపై బ్రిటిష్‌ వారు ఈ ఆనకట్టను నిర్మించారు. తూర్పు కనుమల్లో ఏ మాత్రం వర్షం పడినా ఈ గెడ్డ ద్వారా నీరు వస్తుంది. దీంతో అప్పటి వారికి పూర్తిస్థాయిలో తాగు, సాగునీటి అవసరాలు తీరేవి. ఆ రోజుల్లో మండు వేసవిలోనూ ప్రవాహం సాగేదని స్థానికులు చెబుతున్నారు. అనంతరం 1995లో దీనిని అభివృద్ధి చేశారు. శృంగవరపుకోట మండలంలోని భర్తాపురం, అంబుదాసుపాలెం, రాజీపేట, పెదఖండేపల్లి, కృష్ణాపురం, విశ్వనాథపురం, ధర్మవరం, సన్యాసయ్యపాలెం, గంట్యాడ మండలంలోని మధుపాడ గ్రామాల్లో 2,200 ఎకరాలకు సాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టారు.

నిర్మాణాలు ఇలా..

జిల్లాలోని రెండు మండలాల్లో గల 9 గ్రామాల్లో అనధికారికంగా మరో 500 ఎకరాల మేర దీని కిందే సాగవుతోంది. ఈమేరకు మూడు కిలోమీటర్ల మేర ప్రధాన కాలువను తవ్వించారు. ఆనకట్ట వద్ద(హెడ్‌వర్క్స్‌ స్లూయిజ్‌) రెండు ప్రధాన షట్టర్లు(ఇనుప గేట్లు) ఏర్పాటు చేశారు. స్కవర్‌ వెంట్‌(కాలువలో ప్రవాహం సాగే మార్గం)లో మరో రెండు పెట్టారు. హెడ్‌వర్క్స్‌ స్లూయిజ్‌ వద్ద రింగ్‌వాల్‌(రక్షణ గోడకు దిగువనున్న నిర్మాణం), అప్రాన్‌(ప్రవాహాన్ని తట్టుకునేందుకు నిర్మించే రాతి కట్టడం) పనులు చేపట్టారు.

షట్టరు పడిపోకుండా కట్టిన తాడు, అడ్డంగా పెట్టిన కర్ర 

ప్రస్తుత పరిస్థితి ఇదీ..

నాలుగేళ్లుగా ఆనకట్ట అధ్వానంగా మారింది. ప్రధాన షట్టర్లలో ఒకటి పూర్తిగా విరిగిపోవడంతో కర్రలు దన్ను పెట్టి, తాడుతో కట్టి ఉంచారు. ఒకటి లీకులమయంగా మారింది. స్కవర్‌ వెంటనున్న రెండింటి జాడలు కానరావడం లేదు. అవెప్పుడో కొట్టుకుపోయాయి. రింగువాల్‌ ఇప్పటికే దెబ్బతింది. కొంతమేర కూలిపోయింది.. అప్రాన్‌దీ అదే పరిస్థితి. చాలావరకు కనుమరుగైంది. ఆనకట్ట గర్భంతో పాటు ప్రధాన కాలువ పూడికలతో నిండిపోయాయి. కిందనున్న పిల్ల కాలువలదీ అదే దుస్థితి. దీంతో ఏటా ఇబ్బందులు  తప్పడం లేదు.


ప్రధాన గోడకు పగుళ్లు..

ఆనకట్ట ప్రధాన గోడకు ఎక్కడికక్కడే పగుళ్లు ఏర్పడ్డాయి. షట్టర్లు సైతం దెబ్బతినడంతో నీరు నిరంతరం దిగువకు పారుతోంది. ఈక్రమంలో రెండేళ్లుగా సాగునీరు అందడం లేదు. రైతులు శ్రమదానంతో కాలువలను బాగుచేసుకుంటున్నారు. ఉపాధిహామీ పథకం కింద మరమ్మతులు చేసేందుకు 2021 మార్చి నెలలో రూ 39.50 లక్షల నిధులు మంజూరయ్యాయి. పనులు చేసేందుకు గుత్తేదారులు ముందుకు రావడం లేదు. తెదేపా హయాంలో నీరు-చెట్టు కార్యక్రమం కింద పూడిక తీత పనులు చేపట్టారు. వీటికి సంబంధించి సుమారు రూ.15 లక్షల బిల్లులు వైకాపా వచ్చాక ఆగిపోయాయి. దీంతో రైతు ప్రతినిధులు గగ్గోలు పెడుతున్నారు. పాత బకాయిలు రాకపోవడంతో గుత్తేదారులు స్పందించడం లేదని, త్వరలోనే పనులు జరిగేలా చర్యలు తీసుకుంటామని జలవనరుల శాఖ శృంగవరపుకోట సెక్షన్‌ జేఈ సతీష్‌ ‘న్యూస్‌టుడే’కు తెలిపారు.


40 చెరువులకు ఆధారం.. ఆనకట్ట కింద 40 వరకు లింకు చెరువులున్నాయి. కాలువ పరిధిలోని 20 వరకు ఉన్న డ్రాపులు(చెరువులకు నీరు మళ్లించే లింకులు) ఉన్నాయి. కొంత ఎత్తు వరకు నీరు చేరితే ఇవన్నీ నిండుతాయి. అనంతరం మిగులు జలాలన్నీ గంట్యాడ మండలంలోని తాటిపూడి రిజర్వాయర్‌కు చేరుతాయి. సాగునీటికి పది రెట్లు ఈ జలాశయంలోకి వెళ్లిపోతున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. అయినా నిలుపుదలకు చర్యల్లేవు. ప్రస్తుత పరిస్థితితో నీరు పూర్తిస్థాయిలో రిజర్వాయర్‌కే చేరుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని