logo

కేజీబీవీల్లో అక్రమాలు..!

కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో(కేజీబీవీలు) అక్రమాలు రాజ్యమేలుతున్నాయి. ప్రభుత్వ నిధులు సైతం దుర్వినియోగం అవుతున్నట్లు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ తేల్చింది.

Published : 20 May 2024 03:55 IST

గుర్తించిన విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌  

విజయనగరం విద్యావిభాగం, న్యూస్‌టుడే: కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో(కేజీబీవీలు) అక్రమాలు రాజ్యమేలుతున్నాయి. ప్రభుత్వ నిధులు సైతం దుర్వినియోగం అవుతున్నట్లు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ తేల్చింది. గతేడాది సెప్టెంబరు 9న రాష్ట్రవ్యాప్తంగా అయిదు జిల్లాల్లో నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో లోపాలను బయటపెట్టింది. రూ.89.26 లక్షలు దుర్వినియోగమైనట్లు గుర్తించారు. ఇందులో విజయనగరం జిల్లా ఒకటి. ఈ మేరకు బాధ్యులైన వారి నుంచి రికవరీ చేయాలని, క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఆ సంస్థ లేఖ రాసిన నేపథ్యంలో రెండు రోజుల క్రితమే రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్‌ జిల్లాకు ఆదేశాలిచ్చారు. అకౌంటెంట్, ప్రధానాచార్యులు, జీసీడీవోల విధినిర్వహణలో అలసత్వం, పర్యవేక్షణ, ఆడిటింగ్‌ లేకపోవడంపై చర్యలు తీసుకోవాలన్నారు. జూన్‌ 15లోగా చర్యలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించడంతో జిల్లా విద్యాశాఖ దీనిపై ప్రత్యేక దృష్టి సారించింది.

చేసిన సూచనలివీ..

తనిఖీల్లో భాగంగా కొన్ని సూచనలు చేసింది. బీ జిల్లాలో 26 కేజీబీవీలు ఉన్నాయి. ప్రతి విద్యాలయంలో కిచెన్‌గార్డెన్స్‌ నిర్వహించాలని పేర్కొంది. ప్రకృతి వ్యవసాయ విధానంలో కూరగాయలు పండించడం ద్వారా ఆర్థిక వెసులుబాటు, విద్యార్థులకు సాగుపై అవగాహన కల్పించాలని అయిదేళ్ల క్రితమే అమల్లోకి తెచ్చారు. ప్రస్తుతం దీనిని పట్టించుకోకపోవడంతో పదుల సంఖ్యలో కూడా నిర్వహిస్తున్న దాఖలాలు లేవు. బీ స్టూడెంట్‌ మెస్‌ కమిటీలు కీలక పాత్ర పోషించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. గతంలోనే ఈ కమిటీలున్నా నామమాత్రమయ్యాయి. మళ్లీ క్రియాశీలకంగా వ్యవహరించేలా చూడాలి. కొత్తగా ఏర్పాటు చేయనున్న కమిటీల్లో  8,9,10, ఇంటర్‌ తరగతుల నుంచి ఒక్కొక్కరు చొప్పున అయిదుగురితో కమిటీ ఉండాలి. సీనియర్‌ విద్యార్థిని కమిటీకి హెడ్‌గా నియమించాలి. మెస్‌ నిర్వహణ, స్టోర్‌ మేనేజ్‌మెంట్, విద్యార్థినులకు పోషకాహారం అందుతుందా? మెస్‌ నిర్వహణకయ్యే వ్యయాన్ని పర్యవేక్షించాలి. పరిపాలన, వంట పనివాళ్లు, సహాయకులతో సమన్వయం చేసుకుని రోజువారీ ఇస్తున్న మెనూ, సరకుల కొనుగోలు, కూరగాయల సరఫరా, నాణ్యతను పరిశీలించాలని పేర్కొంది.

కేజీబీవీల వారీగా రావాలి: జిల్లాకు సంబంధించి ఆదేశాలు వచ్చాయి. అక్రమాలు, దుర్వినియోగం గుర్తించిన కేజీబీవీ వివరాలు ఇంకా రావాల్సి ఉంది. ఏ కేజీబీవీలో సిబ్బంది, అధికారులపై చర్యలు తీసుకోవాలో త్వరలోనే వస్తాయి. వచ్చిన వెంటనే చర్యలకు ఉపక్రమిస్తాం.

ఎన్‌.ప్రేమకుమార్, జిల్లా విద్యాశాఖాధికారి   

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు