logo

నాలుగేళ్లయినా బాలారిష్టాలే!

ఉత్తరాంధ్రకు సంబంధించి గరివిడిలో ఏర్పాటైన పశు వైద్య (వెటర్నరీ సైన్స్‌) కళాశాల వైకాపా పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా సమస్యలతో మూలుగుతోంది. కళాశాలను ప్రారంభించి నాలుగేళ్లు కావస్తున్నా..

Published : 20 May 2024 04:03 IST

పశువైద్య విద్యపై ప్రభుత్వం చిన్నచూపు
మంత్రి నియోజకవర్గంలో సమస్యల కళాశాల

నిర్మాణం పూర్తయినా తరగతుల బోధనకు అప్పగించని ప్రధాన భవనం

న్యూస్‌టుడే, గరివిడి: ఉత్తరాంధ్రకు సంబంధించి గరివిడిలో ఏర్పాటైన పశు వైద్య (వెటర్నరీ సైన్స్‌) కళాశాల వైకాపా పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా సమస్యలతో మూలుగుతోంది. కళాశాలను ప్రారంభించి నాలుగేళ్లు కావస్తున్నా.. దీన్ని గాడిలో పెట్టాలని ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సైతం పట్టించుకోలేదు. ఇందులో చేరిన విద్యార్థులు నాలుగో సంవత్సరంలోకి వచ్చినా బోధకులు, బోధనేతర సిబ్బందిని పూర్తిస్థాయిలో సమకూర్చలేదు. బడ్జెట్‌ కేటాయింపుల్లేక ప్రయోగశాలలకు పరికరాలు సమకూరలేదు. 


నియామకాల్లేవు

2020-21 విద్యా సంవత్సరంలో ప్రారంభమైన ఈ కళాశాలలో ఏడాదికి 70 మంది చొప్పున విద్యార్థులు ప్రవేశాలు పొందారు. ప్రస్తుతం నాలుగో సంవత్సరం బోధన జరుగుతోంది. మొత్తం 280 మంది విద్యార్థులున్నారు. వెటర్నరీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా నిబంధనల ప్రకారం విద్యార్థులకు బోధన నిమిత్తం 17 విభాగాల్లో ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లు కలిపి 86 మంది అవసరం. ఇక్కడ 42 మంది మాత్రమే ఉన్నారు. 3, 4 సంవత్సరాల్లో బోధనకు ప్రయోగశాలలతో పాటు పరికరాలు లేవు. వీటి కొనుగోలుకు ఆర్‌ఐడీఎఫ్‌ నిధులు రూ.2.5 కోట్లతో ప్రతిపాదనలు పంపినా మంజూరు కాలేదు. కళాశాల ప్రధాన భవన నిర్మాణాన్ని నాబార్డు నిధులతో గుత్తేదారుకు అప్పగించగా.. పనులన్నీ పూర్తయినా సుమారు రూ.10 కోట్ల వరకు బిల్లులు చెల్లించలేదు. దీంతో అతను భవనాన్ని అప్పగించలేదు. ఇటీవల బెంచీలన్నీ సిద్ధం చేసి, ఆ భవనంలో తరగతులు ప్రారంభించాలని భావించినా గుత్తేదారు అంగీకరించలేదు. పశువైద్య చికిత్సలు, సేవల కోసం నిర్మించిన వెటర్నరీ క్లినికల్‌ కాంప్లెక్స్‌ భవనంలోనే తరగతుల బోధన సాగిస్తున్నారు. ప్రాంగణంలో పక్కా రహదారుల నిర్మాణ పనులు ఇంకా ప్రారంభం కాలేదు. 

విద్యార్థులకు బోధన, పశువైద్యానికి వినియోగిస్తున్న వెటర్నరీ క్లినికల్‌ కాంప్లెక్స్‌ భవనం 


తెదేపా హయాంలో మంజూరు

ఉత్తరాంధ్ర జిల్లాలకు పశు వైద్య విద్య కళాశాలను అందుబాటులోకి తీసుకురావాలని 2016లో అప్పటి తెదేపా ప్రభుత్వం రూ.81.72 కోట్లు మంజూరు చేసింది. తిరుపతి శ్రీవేంకటేశ్వర  పశు వైద్య విశ్వవిద్యాలయానికి అనుబంధంగా దీని ఏర్పాటుకు అన్ని రకాల అనుమతులు  ఇవ్వడంతో పాటు కొంత మేర బోధన సిబ్బందిని నియమించారు. వెటర్నరీ క్లినికల్‌ కాంప్లెక్స్, విద్యార్థినీ, విద్యార్థులకు వసతి గృహ భవనాల నిర్మాణ  పనులన్నీ గత ప్రభుత్వ హయాంలోనే జరిగాయి. 2019లో అధికారం చేపట్టిన వైకాపా ప్రభుత్వం కళాశాలను ప్రారంభించడానికే పరిమితమైంది తప్ప దీన్ని నిర్వహణను పట్టించుకోలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 


పులివెందులకు ఓ విధానం..

వీసీఐ మార్గదర్శకాల ప్రకారం బోధనేతర సిబ్బంది పోస్టులు 150 వరకు భర్తీ చేయాల్సి ఉండగా 70 మంది మాత్రమే ఉన్నారు. వీరు సైతం పొరుగు సేవల విధానం (ఆప్కాస్‌)లో కాకుండా వర్క్‌ కాంట్రాక్టర్‌ దగ్గర పనిచేస్తున్నవారు కావడంతో ఉద్యోగ భద్రత లేదు. కడప జిల్లా పులివెందులకు మంజూరుచేసిన పశువైద్య కళాశాలలో బోధనేతర సిబ్బందిని ఆప్కాస్‌ విధానంలో నియామకానికి ప్రభుత్వం జీవో ఇచ్చింది. గరివిడి కళాశాలలోని వర్క్‌ కాంట్రాక్టు బోధనేతర సిబ్బందిని కూడా ఆప్కాస్‌ విధానంలోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరినా ఫలితం లేదు. ఖాళీగా ఉన్న బోధనేతర సిబ్బంది పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోలేదు.


దశలవారీగా అన్ని సదుపాయాలు
-ఎం.శ్రీను, అసోసియేట్‌ డీన్, గరివిడి పశు వైద్య కళాశాల

కళాశాలకు దశలవారీగా అన్ని వసతులు, సదుపాయాలు సమకూరుతాయి. బోధకుల విషయంలో చాలా వరకు కొరత తీరింది. కళాశాల ప్రధాన భవనం అందుబాటులోకి రావాలి. బోధనకు సంబంధించి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా యూనివర్సిటీ చర్యలు తీసుకుంటోంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని