logo

ముంచెత్తిన వర్షం

పార్వతీపురంలో భారీ వర్షం కురవడంతో జనజీవనం స్తంభించింది. శనివారం రాత్రి నుంచి ఏకధాటిగా నాలుగు గంటల పాటు ఉరుములు, పిడుగులతో ఎడతెరిపి లేకుండా పడటంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

Published : 20 May 2024 04:14 IST

కాంప్లెక్స్‌లో చేరిన నీరు 

పార్వతీపురం పురపాలిక, గ్రామీణం, పట్టణం, కలెక్టరేట్ ప్రాంగణం, న్యూస్‌టుడే: పార్వతీపురంలో భారీ వర్షం కురవడంతో జనజీవనం స్తంభించింది. శనివారం రాత్రి నుంచి ఏకధాటిగా నాలుగు గంటల పాటు ఉరుములు, పిడుగులతో ఎడతెరిపి లేకుండా పడటంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ప్రధాన రహదారితో పాటు పాతబస్టాండ్‌ నుంచి కళింగ వైశ్య కన్యకా పరమేశ్వరి ఆలయం వరకు, కంగటివీధి నుంచి సారిక వీధి కూడలి వరకు మోకాళ్ల లోతులో వరద ప్రవహించింది. సౌందర్య సినిమా హాలు రహదారి, గణేష్‌ నగర్, గూడ్స్‌షెడ్‌ రోడ్లు, ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద నీరు నిలిచిపోయింది. పట్టణ శివారులోని 19వ వార్డు రోడ్లు, యర్రాకాలనీ, వసుంధరానగర్, మజ్జిగౌరీ కాలనీలోని ఖాళీ స్థలాల్లో నీరు చేరింది. నర్సిపురం, వెంకంపేట, తాళ్లబురిడి, బందలుప్పి గ్రామాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

పెట్రోల్‌ బంక్‌ సమీపంలో రహదారిపై పడిన చెట్టు

వీరఘట్టంలో బీభత్సం

వీరఘట్టం: వీరఘట్టం ప్రాంతంలో ఆదివారం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది.  ఎంపీడీవో కార్యాలయం, పెట్రోల్‌ బంకు సమీపంలో చిట్టపుడివలస కూడలి, నడుకూరు సమీపంలో మహావృక్షాలు నేలకొరిగాయి. ఎక్కడికక్కడ విద్యుత్తు తీగలు తెగిపడ్డాయి. విద్యుత్తు ఉపకేంద్రంలో బ్రేకర్, స్తంభాలు కూలిపోవడంతో రక్షణ గోడ దెబ్బతింది. మరోవైపు విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వడగళ్ల వర్షానికి రహదారులపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఎస్సై ఎస్‌కె.ఫకృద్దీన్‌ ఆధ్వర్యంలో పోలీసులు, విద్యుత్తుశాఖ ఉద్యోగులు యుద్ధ ప్రాతిపదికన రహదారికి అడ్డంగా పడిన వృక్షాలను తొలగించారు. 

స్తంభాలు ఒరగడంతో దెబ్బతిన్న విద్యుత్తు ఉపకేంద్రం రక్షణగోడ 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని