logo

ప్రజల గొంతులో గరళం!

ఉమ్మడి జిల్లాలోని పుర, నగర పాలక, నగర పంచాయతీల ప్రజలకు స్వచ్ఛజలం అందడం లేదు. చాలా చోట్ల రంగుమారి.. మురుగు వాసన, నలకలతో సరఫరా అవుతోంది. తాగునీటి పథకాలను, రిజర్వాయర్లను శుభ్రం చేయకపోవడం,

Published : 20 May 2024 04:29 IST

తాగునీరు  కలుషితం.. నిర్వహణ అస్తవ్యస్తం
పట్టించుకోని నగర, పురపాలక  సంస్థలు
న్యూస్‌టుడే, విజయనగరం పట్టణం, బొబ్బిలి, నెల్లిమర్ల, పార్వతీపురం పురపాలిక, సాలూరు, పాలకొండ

స్టేడియం పేటలో రంగుమారిన నీటిని పట్టుకుంటున్న మహిళలు

ఉమ్మడి జిల్లాలోని పుర, నగర పాలక, నగర పంచాయతీల ప్రజలకు స్వచ్ఛజలం అందడం లేదు. చాలా చోట్ల రంగుమారి.. మురుగు వాసన, నలకలతో సరఫరా అవుతోంది. తాగునీటి పథకాలను, రిజర్వాయర్లను శుభ్రం చేయకపోవడం, పైపులైన్లకు లీకులు, కాలువల నుంచి వెళ్తుండటం తదితర కారణాలతో ఈ   పరిస్థితి ఏర్పడుతోంది. కుళాయిల ద్వారా కలుషిత నీరే వస్తోందని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. రానున్న వర్షాకాలంలో ఇదే పరిస్థితి కొనసాగితే ఇబ్బందులు తప్పవని, అధికారులు దృష్టి సారించాలని కోరుతున్నారు. ట్యాంకులను ప్రతి నెలా శుభ్రం చేయాలని ఉన్నతాధికారుల ఆదేశాలు ఉన్నా బేఖాతరు  చేస్తున్నారు. క్లోరినేషన్‌పైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 


విజయనగరంలో..

విజయనగరం జొన్నగుడ్డిలో నీటి కోసం కుళాయి వద్ద స్థానికుల పడిగాపులు  

విజయనగరం నగర పాలక సంస్థలో గత 15 రోజుల నుంచి ముషిడిపల్లి నీటి పథకం ద్వారా మురుగు వాసన, నలకల నీరు వస్తోందని స్థానికులు ఫిర్యాదు చేస్తున్నారు. నగరంలో 31 డివిజన్లకు ఇక్కడి నుంచి నీటి సరఫరా అవుతోంది. కొన్ని రోజులుగా కొత్తాగ్రహారం రిజర్వాయరు నుంచి రంగుమారి దుర్వాసనతో కూడిన నీరు వస్తోందని స్థానికులు వాపోతున్నారు. బుచ్చెన్నకోనేరు, అవనాపు వీధి, లంకాపట్నం, హుకుంపేట, శుద్ధవీధి, పుత్సల వీధి, నాగవంశపు వీధి, ఉల్లివీధి, ఫైరాఫీసు ప్రాంతాల నుంచి ఫిర్యాదులు ఉన్నాయి. జొన్నగుడ్డి రుబ్బ వీధి, స్టేడియం పేట, నాయుడు కాలనీ, వినాయకనగర్, భగవాన్‌ నగర్‌ ప్రాంతాల్లో రంగుమారిన నీటి సరఫరా జరుగుతోంది. కొత్తాగ్రహారం, బాలాజీ రిజర్వాయర్ల వద్ద శుభ్రం చేసిన తేదీలు ఫిబ్రవరి నుంచి రాయలేదు. మొత్తం రిజర్వాయర్లు 32 ఉన్నాయి. అన్ని రకాల కుళాయిలు 24,352 ఉన్నాయి. పైపులైన్ల మరమ్మతుల పేరుతో నాలుగైదు రోజులకు పలుచోట్ల సరఫరా చేస్తున్నారు. మూడు లక్షల నగర జనాభాకు రోజుకు 40 ఎంఎల్‌డీ నీటి సరఫరా చేయాల్సి ఉండగా ప్రస్తుతం రోజు విడిచి రోజు 25.8 ఎంఎల్‌డీ ఇస్తున్నారు.


తాగునీటికి తిప్పలు

విజయనగరం ముషిడిపల్లి పథకం నుంచి నీటి సరఫరా జరగక తోపుడు బండిపై తీసుకెళ్తున్న వైనం

రాజాం, న్యూస్‌టుడే: రాజాం పట్టణంలో 52,114 మంది జనాభా ఉన్నారు. నిబంధనల ప్రకారం రోజుకు 70.35 లక్షల లీటర్లు నీరు సరఫరా చేయాల్సి ఉండగా, 41.10 లీటర్లు మాత్రమే అందిస్తున్నారు. దీంతో చాలా ప్రాంతాలకు పూర్తిస్థాయిలో నీటి సరఫరా కాకపోవడంతో ఆ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నిర్వహణ లోపం, పైపులైన్ల లీకేజీ కారణంగా వచ్చిన చోట్లా కలుషిత జలం సరఫరా అవుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. భారీ రక్షిత నీటి పథకం నిర్మించినా పూర్తి స్థాయిలో నీరు అందించడంలో యంత్రాంగం విఫలమవుతోంది. పైపులైను విస్తరణ చేపట్టక ఈ పరిస్థితి నెలకొంది. డీఏవీ పాఠశాల ప్రాంతం, పొనుగుటివలస ఎస్సీ కాలనీ, శ్రీకాకుళం రోడ్డు, సాయిశŸరణ్యనగర్, బుచ్చెంపేట సమీప ప్రాంతాలకు పైపులైను విస్తరించాల్సి ఉంది. దీనిపై మున్సిపల్‌ కమిషనర్‌ రామఅప్పలనాయుడు మాట్లాడుతూ పట్టణంలో తాగునీటి ఇబ్బందులు లేవని, పైపులైను లీకులు ఏర్పడితే వెంటనే సరిచేస్తున్నామని, బురదనీరు సరఫరా కాకుండా జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు.


బొబ్బిలి: బొబ్బిలిలో తాగునీటి రిజర్వాయర్లపైన శుభ్రం చేసిన తేదీలు ఎక్కడా రాయడం లేదు. రంగుమారిన నీరు సరఫరా అవుతోంది. ఇక్కడ 5వ వార్డు, మల్లంపేట తదితర చోట్ల రంగుమారిన నీటి సరఫరా జరుగుతోంది. 9 ఎంఎల్‌డీ నీరు ఇవ్వాల్సి ఉండగా 3.5 ఎంఎల్‌డీ ఇస్తున్నారు. 

కొత్తాగ్రహారం రిజర్వాయరుపై శుభ్రం చేసిన తేదీలు జనవరి నుంచి రాయని పరిస్థితి


అధికారులు ఏమన్నారంటే..

విజయనగరంలో ముషిడిపల్లి నీటిపథకం ప్రధాన లైనుకు లీకులు ఏర్పడటంతో సరిచేస్తున్నామని ఈఈ కె.  శ్రీనివాసరావు తెలిపారు. దీనివల్ల సమస్య వచ్చిందన్నారు. నీటి సరఫరా పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రిజర్వాయర్లు ప్రతి నెలా శుభ్రం చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. క్లోరినేషన్‌పై పర్యవేక్షణ చేస్తామన్నారు. 

  • రిజర్వాయర్లు శుభ్రం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని నెల్లిమర్ల  కమిషనరు బాలాజీ ప్రసాద్, బొబ్బిలి, సాలూరు, పాలకొండ ఏఈలు రవికుమార్, దేవీ ప్రసాద్, సూరినాయుడు తెలిపారు.

నెల్లిమర్ల: ఇక్కడి జరజాపుపేట ప్రాంతంలో రిజర్వాయరుపై శుభ్రపరచిన తేదీలు రాసిలేవు. థామస్‌పేట, గాంధీనగర్‌ కాలనీ, సెగడి వీధి పలు ప్రాంతాల్లో రంగు మారిన నీరు సరఫరా అవుతోంది.


రాజాంలో ఇటీవల ఇంటింటి కుళాయిల ద్వారా వచ్చిన బురదనీరు


బురదే వస్తోంది
- కనకల భారతి, అవనాపు వీధి, విజయనగరం 

గత 10 రోజుల నుంచి మట్టి రంగులో, మురుగు వాసనతో నీరు వస్తోంది. పట్టుకోలేని పరిస్థితి ఉంది. నాలుగు రోజుల నుంచి అసలు నీరు ఇవ్వలేదు.  నీటికి ఇబ్బంది పడుతున్నాం. 


నాలుగు రోజులుగా నీరివ్వలేదు
- పి.కళావతి, లంకాపట్నం, విజయనగరం

రెండు వారాల నుంచి కుళాయిల నుంచి రంగు మారిన, నలకల నీరు వస్తోంది. నీటికి ఇబ్బంది పడుతున్నాం. నాలుగు రోజుల నుంచి నీటి సరఫరా జరగలేదు. దూర ప్రాంతాల నుంచి నీటిని తీసుకొస్తున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని