logo

నదుల్లో ఇసుక తోడేళ్లు

జిల్లాలో ఇసుక తవ్వకాలు నిబంధనలకు విరుద్ధంగానే జరుగుతున్నాయి. పాత గుత్తేదారులు కొన్ని చోట్ల అనుమతులు లేకుండా రీచ్‌ల్లో తోడేస్తున్నారు. తాజాగా సుప్రీంకోర్టు క్షేత్రస్థాయిలో పర్యటించి తవ్వకాలు ఆపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Published : 23 May 2024 04:13 IST

జిల్లాలో ఇసుక తవ్వకాలు నిబంధనలకు విరుద్ధంగానే జరుగుతున్నాయి. పాత గుత్తేదారులు కొన్ని చోట్ల అనుమతులు లేకుండా రీచ్‌ల్లో తోడేస్తున్నారు. తాజాగా సుప్రీంకోర్టు క్షేత్రస్థాయిలో పర్యటించి తవ్వకాలు ఆపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కలెక్టర్‌ నేతృత్వంలో పోలీసు, వివిధ విభాగాల అధికారులతో కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించింది. 

విజయనగరం అర్బన్, న్యూస్‌టుడే 

గజపతినగరం, న్యూస్‌టుడే: గజపతినగరం మండలం లింగాలవలస, తుమ్మికాపల్లి, కెంగువ, సీతారాంపురం, ఎం.గుమడాం నుంచి ఇసుక అక్రమ రవాణా సాగుతోంది.  జిన్నాం సమీపంలోని ఏడొంపుల గెడ్డలో రాత్రి సమయాల్లో తవ్వి సమీపంలోని తోటల్లో నిల్వ చేసి, లారీల్లో తరలిస్తున్నారు. దత్తిరాజేరు మండలం వంగర, పెదమానాపురం ప్రాంతాల్లోనూ అక్రమ తవ్వకాలు జోరుగా జరుగుతున్నాయి. మెంటాడ మండలం పిట్టాడ నుంచి రహస్యంగా తరలిస్తున్నారు. లింగాలవలస వద్ద ఉన్న వంతెన, నీటి పథకం ఆనుకుని తోడేయడంతో కట్టడాలకు ముప్పు ఏర్పడింది. దీనిపై గతంలో కమిటీ సభ్యులతో పరిశీలించి, నివేదికలు అందించామని, చర్యలు తీసుకుంటామని తహసీల్దారు రమేష్‌ అన్నారు.

జిల్లాలో ఉన్నవి మూడో శ్రేణి ఇసుక వాగులే. ఇక్కడ ప్రజోపయోగం కోసం ఉచితంగా పొందవచ్చు. ప్రభుత్వ ఇళ్ల నిర్మాణాల కోసం ఎడ్ల బండిపై రవాణా చేసేందుకు అనుమతి ఉంది. ఇందుకోసం స్థానిక కార్యదర్శి ద్వారా కూపన్‌  పొందాలి. లేకపోతే అనధికారికమే అవుతుంది. ఇక్కడా అక్రమంగా పెద్దఎత్తున  తరలింపు జరుగుతోంది. 
ఇసుక అమ్మకాలకు సంబంధించి ప్రతిమ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ద్వారా నిల్వ పాయింట్ల వద్ద అమ్మకాలకు అనుమతి కల్పించారు. జిల్లాలో పెదతాడివాడ, గొర్లె సీతారాంపురం, కొత్తవలస, చీపురుపల్లిలో నిల్వ కేంద్రాలు ఉన్నాయి.వీటి నుంచి ప్రభుత్వ పనులకు నిర్దేశిత ధరకు ఇసుకను సరఫరా చేస్తారు. సంస్థకు జిల్లాలో ఎక్కడా రీచ్‌లు కేటాయించకపోవడంతో ప్రస్తుతం కేంద్రాల్లో అందుబాటులో లేదని చెబుతున్నారు.

బొబ్బిలి, గ్రామీణం, రామభద్రపురం, న్యూస్‌టుడే: వేగావతి పరివాహక ప్రాంతంలోని రామభద్రపురం మండలంరొంపల్లి, కొట్టక్కి, కోటశిర్లాం, గొల్లలపేట, ఏడొంపుల గెడ్డ పరిధిలోని కొండకెంగువలో రాత్రిపూట తవ్వేస్తున్నారు.  పెంట, అలజంగి, పారాది వద్ద తంతు సాగుతోంది. బాడంగి మండలానికి చెందిన అధికార పార్టీ నాయకుడు పెంట నుంచి రాత్రిపూట అక్రమంగా తవ్వి రవాణా చేస్తున్నట్లు తెలిసింది. బాడంగి మండలంలోని పినపెంకి, పాల్తేరు రేవుల్లోనూ అక్రమంగా తవ్వేస్తున్నారు.

అనుమతుల దశలోనే రీచ్‌లు 

మూడో శ్రేణి వాగుల్లోనూ అయిదు వేల క్యూబిక్‌ మీటర్లు పైబడి ఇసుక ఉంటే అక్కడ రీచ్‌ను కేటాయిస్తారు. ప్రస్తుతం జిల్లాలో ఎక్కడా రీచ్‌లు కేటాయించలేదు. తెర్లాం మండలం కుసుమూరు, రాజాం నియోజకవర్గంలో తమరాం రీచ్‌లకు పర్యావరణ అనుమతులు గనులు భూగర్భ శాఖ తీసుకుంది. ఇవి ఇంకా సంస్థ పేరుతో బదిలీ కాలేదు. రాజాం నియోజకవర్గంలో కె.వెంకటాపురం రీచ్‌కు ఈసీ కోసం చేసిన దరఖాస్తు పెండింగ్‌లో ఉంది. 

లోపాలివే..

  • మూడో శ్రేణి వాగులపై సర్వే నామమాత్రమవుతోంది. నీటి పారుదల, రెవెన్యూ, మైనింగ్‌ అధికారులు సర్వే చేసి ఏ మేరకు అక్కడ ఇసుక ఉందో తెలుసుకోవాలి. కొత్త వాటిని గుర్తించాలి. ఇది రెగ్యులర్‌గా జరగాల్సి ఉన్నా అమలుకు నోచుకోవడం లేదు.
  • మూడో శ్రేణి రేవుల్లో ఇసుకను ట్రాక్టర్లు, లారీలపై అక్రమంగా తరలిస్తున్నారు. రాజకీయ జోక్యంతో నిఘా అధికారులు చూసీచూడనట్లు వదిలేస్తున్నారు.
  • ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ) పర్యవేక్షించి కేసులు నమోదు చేయాలి. స్థానికంగా పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం వీటిని పట్టుకుని కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. ఇక్కడ ఉదాసీనత కనిపించడంతో అక్రమ రవాణా యథాతథంగా కొనసాగుతోంది. 
  • గనులు భూగర్భ శాఖ అధికారులు కేవలం పట్టుకున్న కేసుల్లో పరిమాణాన్ని అంచనా వేసి, జరిమానాలు నిర్ణయించడానికే పరిమితమవుతున్నారు. తమకు సంబంధం లేదంటూ పోలీసులపై నెట్టేస్తున్నారు. గతంలో ఫిర్యాదుల మేరకు పట్టుకుని జరిమానాలు విధించేవారు. 
  • నదీ పరివాహక ప్రాంతాల్లో అక్రమ తవ్వకాలతో నీటి పథకాలకు ముప్పు వాటిల్లుతోంది. నెల్లిమర్లలో రామతీర్థం నీటి పథకానికి ఇసుక తవ్వకాల వల్లే నీటి కొరతకు తావివ్వడంతో ఇసుక బస్తాలు వేశారు.  

గుర్ల మండలంలోని చంపావతి తీరాన కలవచర్ల, కోటగండ్రేడు, గుర్ల, పెదమజ్జిపేట, ఆనందపురం, భూపాలపురంలో నిత్యం ఎడ్ల బళ్లపై తరలించేస్తున్నారు. ఓ రహస్య ప్రదేశంలో పోగుచేసి అక్కడి నుంచి లారీ, ట్రాక్టర్లలో తరలించేస్తున్నారు. ఒక్కో బండికి రూ.700 చొప్పున చెల్లిస్తున్నట్లు సమాచారం. 

న్యూస్‌టుడే-గరివిడి/గుర్ల

భోగాపురం మండలం కోటభోగాపురం వద్ద చంపావతిలో ఇసుక అక్రమ తవ్వకాలు రాత్రి వేళల్లో సాగుతున్నాయి. ప్రధానంగా నాతవలస వద్ద ఊటబావి, పంప్‌హౌస్‌ సమీపం, రెల్లివలస, కోనాడ, కొప్పెర్ల నుంచి తోలేందుకు నదిలో మార్గాలు వేసుకున్నారు. అక్రమార్కులకు అధికార పార్టీ నాయకుల అండదండలు ఉన్నాయి. డెంకాడ మండలంలో ఓ నేత కనుసన్నల్లోనే దందా జరుగుతోంది. 

న్యూస్‌టుడే, భోగాపురం

అనుమతులు బదిలీ కాలేదు

ప్రతిమ సంస్థకు జిల్లాలో ఎక్కడా రీచ్‌లు కేటాయించలేదు. అత్యవసరం కోసం రెండు రీచ్‌లకు పర్యావరణ అనుమతులు తెప్పించినా, వారి పేరు మీద బదిలీ కాలేదు. మూడో శ్రేణి రేవుల్లో ట్రాక్టర్ల ద్వారా రవాణా చేసుకునే అవకాశం ఉంది. స్థానికంగా వాల్టా చట్టం ప్రకారం జరగాలి. డిపోలు ఉన్నాయి. ఇసుక అక్కడ ఉన్నట్లు మాకు తెలియదు.

సూర్యచంద్రరావు, జిల్లా మైనింగ్‌ అధికారి 

మూడో శ్రేణి ఇసుక వాగులు : 78  
విజయనగరం 48 మన్యం  30  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని