logo

రైతు కన్నీరే పారించారు

పచ్చని పొలాలు కళకళలాడుతూ.. రైతు రాజులా బతకాలనే లక్ష్యంతో గత ంలో చేపట్టిన గజపతినగరం బ్రాంచి కెనాల్‌పై ఈ ప్రభుత్వం శీతకన్ను వేసింది. ఈ కాలువ తవ్వకానికి అయిదేళ్లలో ఒక్క పైసా కూడా విదల్చలేదు.

Published : 28 May 2024 03:32 IST

ఐదేళ్లలో గజపతినగరం బ్రాంచి కెనాల్‌ ఊసెత్తని ప్రభుత్వం
రూ.150 కోట్లకు పైగా నష్టపోయిన రైతులు 

గోభ్యాం వద్ద ఇలా వదిలేశారు  

పచ్చని పొలాలు కళకళలాడుతూ.. రైతు రాజులా బతకాలనే లక్ష్యంతో గత ంలో చేపట్టిన గజపతినగరం బ్రాంచి కెనాల్‌పై ఈ ప్రభుత్వం శీతకన్ను వేసింది. ఈ కాలువ తవ్వకానికి అయిదేళ్లలో ఒక్క పైసా కూడా విదల్చలేదు. పైగా పనులు రద్దు చేసి, తిరిగి కొత్త ప్రతిపాదనలు తెరపైకి తెచ్చింది. ఫలితంగా నీరు వస్తుంది.. పంటలు సాగు చేసుకుందామనుకున్న రైతులకు కన్నీరే మిగిలింది. వరుణుడి కరుణ కోసం చూడాల్సి వస్తోంది. 

న్యూస్‌టుడే, గజపతినగరం, దత్తిరాజేరు : తోటపల్లి కుడి కాలువ నుంచి గజపతినగరం, గుర్ల, దత్తిరాజేరు మండలాల్లోని 18 గ్రామాల పరిధిలోని 15,000 ఎకరాలకు సాగునీరు అందించేందుకు 2006లో గజపతినగరం బ్రాంచి కెనాల్‌ను మంజూరు చేశారు. అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి శిలాఫలకాన్ని వేశారు. అప్పటి నుంచి క్రమంగా కొంత వరకు పనులు చేస్తూ వచ్చారు. 2019లో అధికారం చేపట్టిన జగన్‌మోహన్‌రెడ్డి దీన్ని పూర్తిగా నీరుగార్చారు. రూపాయి పని చేయించలేదు సరికదా నిలుపుదల చేశారు. తిరిగి రూ.137 కోట్లతో కొత్తగా అంచనాలు వేయించి, అలాగే ఉంచారు. 

ప్రభుత్వం వద్ద దస్త్రాలు 

గజపతినగరం బ్రాంచి కెనాల్‌కు గతంలో మంజూరు చేసిన పనులు రద్దు చేశారు. కొత్తగా చేసేందుకు రూ.137 కోట్లతో అంచనాలు వేసి, పంపాం. ప్రధాన కాలువలో పనులతో పాటు, పిల్ల కాలువల పనులు చేయాలి. దస్త్రాలు ప్రభుత్వం వద్ద ఉన్నాయి. మంజూరైతే చేసేందుకు చర్యలు తీసుకుంటాం. 

- జి.వి.రమణమూర్తి, డీఈఈ, గజపతినగరం బ్రాంచి కెనాల్‌ 

ఇటు నష్టం.. అటు భారం 

బ్రాంచి కెనాల్‌ పనులు జరగకపోవడం వల్ల అయిదేళ్ల పాటు పంటలకు నీరు అందలేదు. వర్షాధారంపై సాగు చేసిన పైర్లకు చెరువుల నుంచి నీటిని తోడారు. అయినా ఆశించిన మేర దిగుబడి రాలేదు. ఫలితంగా అదనపు వ్యయం, పంట ఉత్పత్తులు కోల్పోవడం ద్వారా రైతు ఎకరాకు ఏటా సుమారు రూ.రెండు వేలు నష్టపోయాడు. 15 వేల ఎకరాలకు ఏటా సుమారు రూ.30 కోట్లు, అయిదేళ్లలో రూ.150 కోట్లు కోల్పోయారు. మరోపక్క మూడు మండలాల్లో 350 ఎకరాల్లో సాగునీటి కాలువలు తవ్వారు. దీనికి భూమి ఇచ్చిన రైతులు ఎకరాకు ఏటా రూ.30 వేల విలువ చేసే పంట కోల్పోయారు. మరోపక్క గతంలో బ్రాంచి కెనాల్‌ అంచనా విలువ రూ.100 కోట్లు కాగా.. పనులు రద్దు చేసి కొత్తగా రూ.137 కోట్లతో ప్రతిపాదించారు. దీంతో మరో రూ.37 కోట్లు అదనపు భారం పెరిగింది.

ధాన్యం దిగుబడి తగ్గుతోంది

మూడు ఎకరాల్లో 40 సెంట్లు ఇచ్చాను. కాలువ వస్తే మిగిలిన భూమికి నీటి ఎద్దడి ఉండదనుకున్నా. ఏటా చివరి తడి లేక ఎకరాకు రెండు నుంచి మూడు బస్తాల ధాన్యం నష్టపోతున్నాం. ఆయిల్‌ ఇంజిన్ల ద్వారా నీటి తోడకానికి రూ.10 వేల వరకు ఖర్చు పెట్టాల్సి వస్తోంది.

పత్తిగుళ్ల సన్యాసినాయుడు, రైతు, వేమలి

నీటి తోడకానికే రూ.15 వేలు 

నాకున్న మూడు ఎకరాల్లో ఎకరా పోయింది. వర్షాలు కురిసి చెరువులు నిండితే నీరు వస్తుంది. ఏటా వర్షాభావ పరిస్థితి వెంటాడుతోంది. ఈ సారి పంటను కాపాడుకునేందుకు కేవలం డీజిల్‌ కొనడానికి రూ.15 వేలు ఖర్చు చేశా. 

- కేసలి గౌరినాయుడు, రైతు, వేమలి.

రూ.కోటి వరకు కోల్పోయా 

పదేళ్ల కిందట కాలువకు 2.20 ఎకరాలు ఇచ్చా. అప్పట్లో కేవలం రూ.13 లక్షలు మాత్రమే పరిహారం ఇచ్చారు. తెదేపా హయాంలో తవ్విన కాలువ తప్ప ఈ ప్రభుత్వంలో కొంచెం పని కాలేదు. ఇప్పుడు ఎకరా రూ.50 లక్షలు పలుకుతోంది. ఈ లెక్కన చూస్తే ప్రభుత్వానికి ఇచ్చిన భూమికి సుమారు రూ.కోటి వరకు కోల్పోయా.

- వంగపండు కృష్ణమూర్తినాయుడు, రైతు, గొభ్యాం  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని