logo

మూడేళ్లుగా కాలయాపనే!

అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా ఉంది జిల్లాలోని పట్టణాల ప్రగతి. పుర పాలక  వర్గాల పాలన ప్రారంభమై మూడేళ్లు పూర్తయింది. పదవులే తప్ప ప్రజాసమస్యల పరిష్కారంపై ఎటువంటి శ్రద్ధ లేదు. 

Published : 28 May 2024 03:36 IST

పట్టణాల్లో అభివృద్ధికి పడని అడుగులు
బిల్లులు చెల్లించక ఎక్కడి పనులక్కడే

 

విజయనగరం కొత్త అగ్రహారంలో 15వ ఆర్థిక సంఘ నిధులు రోడ్డు నిర్మాణానికి కేటాయించినా ఇప్పటికీ చేపట్టని పనులు 

అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా ఉంది జిల్లాలోని పట్టణాల ప్రగతి. పుర పాలక  వర్గాల పాలన ప్రారంభమై మూడేళ్లు పూర్తయింది. పదవులే తప్ప ప్రజాసమస్యల పరిష్కారంపై ఎటువంటి శ్రద్ధ లేదు. 

పట్టణాల అభివృద్ధికి కేంద్రం ఆర్థిక సంఘం నిధులు రూ.కోట్లలో మంజూరు చేసింది. పురపాలికలు, నగర పంచాయతీల్లో సాధారణ నిధులు కూడా ఉన్నా.. పనులు ముందుకు సాగడం లేదు. ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. చేసిన పనులకూ సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో గుత్తేదారులు ముఖం చాటేస్తున్నారు. 

న్యూస్‌టుడే, విజయనగరం పట్టణం, బొబ్బిలి, నెల్లిమర్ల : పట్టణాల్లో గడప గడపకూ కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలను పాలకులు తెలుసుకున్నారు. ఒక్కో సచివాలయానికి రూ.20 లక్షలు కేటాయించారు. ప్రతిపాదిత పనుల్లో కనీసం 25 శాతం కూడా పూర్తికాలేదు. బిల్లుల విడుదల జాప్యంతో సామాజిక మరుగుదొడ్లు, కాలువల కల్వర్టు మరమ్మతులు, పారిశుద్ధ్య నిర్వహణ, మురుగునీటి కాలువల పనులు పూర్తిగా చేపట్టలేదు. రహదారులపై గుంతలు పూడ్చలేదు. వీధి దీపాలు వెలిగించలేని దుస్థితిలో ఉన్నామని కౌన్సిల్‌ సభ్యులు పాలకవర్గ సమావేశాల్లో వాపోతున్న సందర్భాలు ఉన్నాయి. 

విజయనగరంలో రూ.137.92 కోట్లతో 1104 పనులకు కౌన్సిల్‌ ఆమోదం తెలిపింది. వీటిలో కొన్ని ప్రస్తుతం నిలిచిపోయాయి. ఇక్కడి రహదారులు, కాలువలు ఇతర మౌలిక సదుపాయాల పరిస్థితి అంతే. ఇప్పటికే చేసిన పనులకు సంబంధించి గుత్తేదారులకు రూ.8 కోట్ల వరకు బిల్లులు చెల్లించాల్సి ఉంది. దీంతో 121 పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. నగరపాలక సంస్థ పరిధిలో 65 పనులు ప్రారంభించాల్సి ఉండగా, మరో 10 టెండర్ల దశలో ఉన్నాయి. ప్రతిపాదనల్లో మరో పది ఉండగా, 19 పనులు రద్దు అయ్యాయి. 

రూ.5 లక్షలు కేటాయించినా పనులు జరగని బొబ్బిలి ఐటీఐ కాలనీలో శ్మశానవాటిక  

ప్రతిపాదనలు 157.. పూర్తి 58  

నెల్లిమర్ల నగర పంచాయతీలో  157 అభివృద్ధి పనులు చేసేందుకు ప్రతిపాదించి ఆమోదించగా, వాటిలో 147కి టెండర్లు పిలిచారు. ఇప్పటికి 58 మాత్రమే పూర్తి చేశారు. మూడేళ్లలో రూ.3.50 కోట్లతో పనులు చేపట్టారు. ఆర్థిక సంఘం నిధులు మంజూరైనా ప్రజా సమస్యలు పరిష్కారం కాలేదు.   

బొబ్బిలిలో సగమే

బొబ్బిలి పురపాలిక సంఘం పరిధిలో రూ.20.20 కోట్ల నిధులు కేటాయించారు. 231 ప్రతిపాదనలకు పాలకవర్గం ఆమోదం మేరకు టెండర్లు వేశారు. వీటిలో 121 పనులు పూర్తి చేశారు. రూ.11.50 కోట్లు ఖర్చు చేశారు. శ్మశాన వాటికలకు రూ.75 లక్షలు కేటాయించారు. పారిశుద్ధ్య విభాగంలో టిప్పర్, ఇతర వాహనాలు, డస్టుబిన్ల కొనుగోలుకు సుమారు రూ.కోటి కేటాయించారు. నీటి సరఫరా విభాగంలో కొత్త ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు, మోటార్ల కొనుగోలు, పైపులైన్ల మార్పిడికి రూ.1.50 కోట్లు మంజూరు చేశారు. ఆ పనులేవీ పూర్తి కాలేదు. చాలా వరకు టెండర్లు పూర్తయినా పనులు చేసేందుకు గుత్తేదారులు ముందుకు రావడం లేదు.

అధికారులు ఏమన్నారంటే... 

  • నగర పాలక సంస్థలో నిధుల లభ్యత మేరకు, ప్రాధాన్యతా క్రమంలో కౌన్సిల్‌ ఆమోదంతో రహదారుల నిర్మాణం చేపడుతున్నాం. త్వరలో పూర్తి చేస్తామని విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్‌ ఎంఎం. నాయుడు అన్నారు.
  • ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున పనులు చేసేందుకు గుత్తేదారులు రావడం లేదు. జూన్‌ 6వ తేదీ తర్వాత వాటిని వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటామని బొబ్బిలి పుర కమిషనర్‌ రామలక్ష్మి తెలిపారు.  
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని