logo

వారంలో రాష్ట్ర ప్రజలకు స్వతంత్రం

తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లగలరని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు పూసపాటి అశోక్‌ గజపతిరాజు అన్నారు.

Published : 28 May 2024 03:38 IST

చంద్రబాబు ఎక్స్‌వో పుస్తకావిష్కరణలో అశోక్‌ గజపతిరాజు

చంద్రబాబు ఎక్స్‌వో పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న అశోక్‌ గజపతిరాజు, చిత్రంలో  ఎమ్మెల్సీలు రఘువర్మ, చిరంజీవిరావు, విజయనగరం ఎంపీ అభ్యర్థి కలిశెట్టి 
అప్పలనాయుడు, కొండపల్లి శ్రీనివాస్, రచయిత శ్రీనివాస్‌ ప్రసాద్‌ తదితరులు 

విజయనగరం అర్బన్, న్యూస్‌టుడే: తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లగలరని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు పూసపాటి అశోక్‌ గజపతిరాజు అన్నారు. రచయిత ఎస్‌.శ్రీనివాస్‌ ప్రసాద్‌ రచించిన ‘చంద్రబాబు ఎక్స్‌వో.. అనంత భావజాలికుడు’ పుస్తకావిష్కరణ కార్యక్రమం సోమవారం రాత్రి విజయనగరంలోని క్షత్రియ కళ్యాణ మండపంలో వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మరో వారం రోజుల్లో రాష్ట్ర ప్రజలకు స్వతంత్రం రాబోతోందని, ఎన్నికల్లో కూటమి విజయం సాధిస్తుందని పేర్కొన్నారు. అరాచకానికి అంతం పలికి విజయోత్సవాలకు స్వాగతం పలకబోతున్నామన్నారు. ప్రజలంతా నిర్భయంగా ఓటేశారని, అధికార పార్టీ బెదిరింపులకు లొంగకుండా ముందడుగు వేశారన్నారు. సాంకేతికత, ఐటీ రంగానికి చంద్రబాబు పునాదులు వేస్తే వైకాపా వచ్చాక దోచుకునేందుకు వాటిని వినియోగించిందని ఆరోపించారు. రాజధాని అమరావతిని దారుణంగా మార్చేసిందని మండిపడ్డారు. తాకట్లు, అప్పుల నుంచి రాష్ట్రాన్ని బయటకు తీసుకురాగల శక్తి, సామర్థ్యాలు చంద్రబాబుకే ఉన్నాయని, మంచి ఆలోచనలతో అభివృద్ధి చేయగలరని ఆశాభావం వ్యక్తం చేశారు.

విజన్‌ అంటే ఆ ఇద్దరే..

విజన్‌ అనగానే గుర్తొచ్చేవారిలో ఒకరు అబ్దుల్‌కలాం కాగా.. మరొకరు చంద్రబాబేనని ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు కొనియాడారు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. తనలాంటి ఎంతోమంది కార్యకర్తలను రాజకీయ నాయకులుగా చేసి, వారి ఎదుగుదలకు తెదేపా అధినేత ఎంతో కృషి చేశారని కూటమి విజయనగరం ఎంపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. రచయిత ఎస్‌.శ్రీనివాస్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ చంద్రబాబును దగ్గర నుంచి చూశానని, ఆయన ఆలోచన తీరు గొప్పదన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ, మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీశ్వరరావు, విజయనగరం, గజపతినగరం ఎమ్మెల్యే అభ్యర్థులు అదితి గజపతిరాజు, కొండపల్లి శ్రీనివాస్, భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి పావని, గొంప కృష్ణ, తెదేపా జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవీపీ.రాజు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని