logo

కన్నీటిసంద్రం

ఉమ్మడి జిల్లాలో సోమవారం తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన వివిధ ప్రమాదాల్లో ఏడుగురు మృత్యువాత పడ్డారు. సీతంపేట మండలం వంబరిల్లి ఘాట్‌లో ఆటో, గుమ్మలక్ష్మీపురం మండలం కంబగూడలో వ్యాన్‌ బోల్తా పడడంతో ఒకరు మృతిచెందగా.. 20 మంది గాయపడ్డారు.

Published : 28 May 2024 03:43 IST

కల్యాణి (పాతచిత్రం) 

ఉమ్మడి జిల్లాలో సోమవారం తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన వివిధ ప్రమాదాల్లో ఏడుగురు మృత్యువాత పడ్డారు. సీతంపేట మండలం వంబరిల్లి ఘాట్‌లో ఆటో, గుమ్మలక్ష్మీపురం మండలం కంబగూడలో వ్యాన్‌ బోల్తా పడడంతో ఒకరు మృతిచెందగా.. 20 మంది గాయపడ్డారు. ఎస్‌.కోట మండలంలో ఓ వ్యక్తి తన భార్యను చున్నీతో ఉరేసి, చంపేశాడు. ఇదే మండలంలో ఓ కల్లుగీత కార్మికుడు చెట్టు పైనుంచి పడి దుర్మరణం చెందాడు. కొత్తవలస- కంటకాపల్లి రైల్వే  స్టేషన్ల మధ్య ఓ యువకుడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. కాకినాడ జిల్లాలో ఆదివారం రాత్రి జరిగిన ప్రమాదంలో విశ్రాంత న్యాయమూర్తి, అతని కారు చోదకుడు మరణించారు. విజయనగరానికి చెందిన వృద్ధుడు కర్నూలు జిల్లాలో కారు ఢీకొని కన్నుమూశారు.

అనుమానంతో భార్యను చంపేశాడు

శృంగవరపుకోట, న్యూస్‌టుడే: ఒకరినొకరు ఇష్టపడ్డారు.. ఏడడుగులూ నడిచారు.. కానీ అనుమానం ఆ దంపతుల మధ్య చిచ్చు పెట్టింది. ఆవేశంలో ఆ ఇంటి పెద్ద తీసుకున్న నిర్ణయం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. నూరేళ్లూ తోడుగా ఉంటానని అగ్నిసాక్షిగా తాళి కట్టిన భర్తే ఓ వివాహిత పాలిట కాలయముడయ్యాడు. అనుమానంతో చున్నీతో పీకకు ఉరి బిగించి ప్రాణాలు తీశాడు. ఈ విషాదకర ఘటన శృంగవరపుకోట మండలంలో జరిగింది. సీఐ      మురళీరావు వివరాల ప్రకారం మూలబొడ్డవర పంచాయతీ శివారు ఒడ్డుమరుపల్లి గ్రామానికి చెందిన సీహెచ్‌.కనకారావు, దారప్ప అలియాస్‌ కల్యాణి(22)ది ప్రేమ వివాహం. వీరికి మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. దంపతుల మధ్య మూడు నెలలుగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో ఇటీవల ఆమె సమీపంలో ఉన్న పుట్టింటికి వెళ్లిపోయింది. లచ్చందొరపాలెం కూడలిలోని ఓ హోటల్‌లో పనిచేస్తోంది. అక్కడ పనిచేయొద్దంటూ కనకారావు ఆమెను హెచ్చరించాడు. ఆదివారం ఉదయం కూడా ఆమె పనికి వెళ్లింది. దీంతో ఉదయం 10 గంటల సమయంలో మాట్లాడాలని చెప్పి అక్కడి నుంచి సమీపంలోని జీడి తోటల వద్దకు తీసుకెళ్లాడు. చెప్పినా ఎందుకు వెళ్లావంటూ గొడవకు దిగి కొట్టాడు. ఈక్రమంలో మెడకు చున్నీని చుట్టి గట్టిగా బిగించి చంపేశాడు. మృతదేహాన్ని మరుపల్లి సమీపంలోని రైల్వే టన్నెల్‌ కింద పడేసి వెళ్లిపోయాడు. కుమార్తె ఇంటికి రాకపోవడంతో ఆమె తల్లిదండ్రులు వెతికినా ఆచూకీ దొరకలేదు. అనుమానంతో కనకారావును నిలదీశారు. దీంతో వారిని తీసుకెళ్లి మృతదేహాన్ని చూపించాడు. గ్రామస్థుల సమాచారంతో సీఐ, ఎస్సై గంగరాజు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. అనుమానంతో ఇలా చేశాడని స్థానికులు చెబుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, నిందితుడిని అరెస్టు చేసి రిమాండుకు తరలించామని సీఐ వెల్లడించారు.


తండ్రితో పుస్తకాలు కొనుగోలుకు వెళ్లి..

వంబరిల్లి పాఠశాలలో 4వ తరగతి చదివి ఐదో తరగతికి వచ్చిన సవర కార్తీక్‌ కొత్త పుస్తకాల కొనుగోలు కోసం తండ్రి డొంబయ్యతో కలిసి సీతంపేట సంతకు వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో ప్రమాదానికి గురై, చికిత్స పొందుతూ మరణించాడు. డొంబయ్య తీవ్రగాయాలతో విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రికి చేరుకున్న అతని భార్య సరోజిని, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ దంపతులకు ముగ్గురు మగ సంతానం కాగా.. కార్తీక్‌ పెద్ద కుమారుడు. తన కళ్లముందే కుమారుడు విగత జీవిగా పడి ఉండడంతో ఆ తల్లి తల్లడిల్లిపోయింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన మధు, తిక్కమ్మ, అనిత, కవిత గాయపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు