logo

వంబరిల్లి ఘాట్‌లో ఆటో బోల్తా

సీతంపేట మండలంలో వంబరిల్లి ఘాట్‌ రోడ్డులో సోమవారం ఉదయం ఓ ఆటో బోల్తా పడింది. ప్రయాణికులతో కిక్కిరిసి వెళ్తున్న వాహనం కొండ ఎక్కలేక వెనక్కి జారడంతో ప్రమాదం చోటుచేసుకుంది.

Published : 28 May 2024 03:45 IST

బాలుడి మృత్యువాత
16 మందికి తీవ్ర గాయాలు
నలుగురి పరిస్థితి విషమం

ప్రాంతీయాసుపత్రిలో క్షతగాత్రులు 

సీతంపేట, న్యూస్‌టుడే: సీతంపేట మండలంలో వంబరిల్లి ఘాట్‌ రోడ్డులో సోమవారం ఉదయం ఓ ఆటో బోల్తా పడింది. ప్రయాణికులతో కిక్కిరిసి వెళ్తున్న వాహనం కొండ ఎక్కలేక వెనక్కి జారడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఓ బాలుడు మృతిచెందాడు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఎస్సై జగదీశ్‌ నాయుడు, స్థానికుల వివరాల ప్రకారం.. వంబరిల్లి ప్రాంతానికి చెందిన గిరిజనులు సీతంపేట వారపు సంతకు వెళ్లారు. తిరుగుప్రయాణంలో బుడ్డడుగూడకు చెందిన ఎస్‌.మధు ఆటోలో ఎక్కారు. కొత్తగూడ దాటి స్వగ్రామానికి సమీపంలోని ఘాటీ మార్గంలో ఆటో నియంత్రణ కోల్పోయింది. పరిమితికి మించిన ప్రయాణికులతో కొండ మీదుగా ఉన్న సీసీ రహదారి ఎక్కలేక వెనక్కి జారిపోయింది. అలా సుమారు వంద అడుగుల కిందకు వచ్చి లోయలో పడిపోయింది. వాహనం నుజ్జవగా.. అందులో ఉన్న 17 మంది తీవ్రంగా గాయపడ్డారు.

హాహాకారాలు..

లోయలో పడ్డ ఆటోలో అందరూ ఇరుక్కుపోయారు. కొందరికి కాళ్లు, చేతులు విరిగిపోవడంతో అతికష్టంపై బయటకు రాగలిగారు. మరికొందరు అందులోనే ఉండిపోయారు. వారి హాహాకారాలతో లోయ ప్రాంతమే కన్నీరు పెట్టింది. క్షతగాత్రుల అరుపులు విన్న  స్థానికులు, అటుగా వెళుతున్న ప్రయాణికులు పరుగున వెళ్లారు. అతికష్టం మీద బాధితులను బయటకు తీశారు. అక్కడి నుంచి సీతంపేట ప్రాంతీయాసుపత్రికి తరలించారు. సూపరింటెండెంట్‌ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వైద్యులు, సిబ్బంది వైద్య సేవలు అందించారు.

వేర్వేరు ఆసుపత్రుల్లో..

తీవ్రంగా గాయపడిన సవర లక్ష్మి, సవర డొంబయ్య, అనిత, కవిత, సుక్కమ్మ, టిక్కమ్మ, అడ్డాయి, బెన్నయ్య, ఉష, తుంపమ్మను శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. వీరిలో అనిత, లక్ష్మి, డొంబయ్య, మరొకరి పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి విశాఖ కేజీహెచ్‌కు తీసుకెళ్లారు. బాలుడు సవర కార్తీక్‌(10)తో పాటు ఆటో చోదకుడు మధును రాగోలులోని జెమ్స్‌కు చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ కార్తీక్‌ మృతి చెందాడు. మరో క్షతగాత్రుడు సవర నవీన్‌ పాలకొండలోని  ఓ ప్రైవేటు ఆసుపత్రిలో సేవలు పొందుతున్నారు. ప్రస్తుతం ప్రాంతీయాసుపత్రిలో సుక్కమ్మ, రమణ ఉండగా.. లాస్య డిశ్ఛార్జి అయ్యారు. ప్రయాణికుడు సాంబయ్య ముందుగానే గెంతేయడంతో సురక్షితంగా బయటపడ్డారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. సీఐ చంద్రమౌళి బాధితులను పరామర్శించారు. రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌  శంకరరావు సేవలపై ఆరా తీశారు.

ప్రభుత్వ నిర్లక్ష్య ఫలితమే: నిమ్మక

క్షతగాత్రులను కూటమి పాలకొండ నియోజకవర్గం అభ్యర్థి నిమ్మక జయకృష్ణ పరామర్శించారు. రక్షణ గోడలు లేకపోవడంతోనే ప్రమాదం జరిగిందని, ఎప్పటి నుంచో నిర్మించాలని కోరుతున్నా వైకాపా ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. వారి నిర్లక్ష్యం వల్లే గిరిజనులు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి పడాల భూదేవి తదితరులు పరామర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని