logo

మొదటి ఫలితం పార్వతీపురం

సార్వత్రిక ఎన్నికలు సంతృప్తిగా ముగిశాయి. ఇక లెక్కింపు మాత్రమే మిగిలింది. జిల్లాలో నాలుగు శాసనసభ నియోజకవర్గాలు, అరకు పార్లమెంటు ఓట్ల లెక్కింపు పార్వతీపురం ఉద్యాన కళాశాలలో జరగనుంది.

Published : 28 May 2024 04:00 IST

ఓట్ల లెక్కింపునకు పక్కా ఏర్పాట్లు
న్యూస్‌టుడే’తో కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌

పార్వతీపురం, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికలు సంతృప్తిగా ముగిశాయి. ఇక లెక్కింపు మాత్రమే మిగిలింది. జిల్లాలో నాలుగు శాసనసభ నియోజకవర్గాలు, అరకు పార్లమెంటు ఓట్ల లెక్కింపు పార్వతీపురం ఉద్యాన కళాశాలలో జరగనుంది. ఇందుకు అన్ని ఏర్పాట్లు పక్కాగా చేస్తున్నట్లు అరకు పార్లమెంటరీ నియోజకవర్గ ఎన్నికల అధికారి, కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ చెప్పారు. సోమవారం ఆయన తన ఛాంబర్‌లో ‘న్యూస్‌టుడే’తో మాట్లాడారు.

ముందుగా పోస్టల్‌ బ్యాలట్లు..

ఒక పార్లమెంట్, నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలైన పోస్టల్‌ బ్యాలట్లను ముందుగా లెక్కిస్తారు. అరకు ఎంపీ స్థానానికి సోమవారానికి 22,600 పైగా వచ్చాయి. ఈసారి పోస్టల్‌ బ్యాలట్‌ వినియోగించుకున్న వారి సంఖ్య పెరిగింది. ఈ నేపథ్యంలో లెక్కింపు వేగంగా జరిగేందుకు వీలుగా టేబుళ్లను పెంచాలని ఎన్నికల సంఘాన్ని కోరాం. దీనిపై ఈసీ సానుకూలంగా స్పందించింది. పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి 20 టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నాం. ఒక్కో శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి గతంలో మాదిరి రెండు టేబుళ్లపై లెక్కిస్తారు. 20 మంది జిల్లా అధికారులను సహాయ ఎన్నికల అధికారులుగా నియమించాం. 

ఎలక్ట్రానిక్‌ వస్తువులను అనుమతించం

లెక్కింపు కేంద్రంలోకి ఎలక్ట్రానిక్‌ వస్తువులను అనుమతించేది లేదు. వీటిని భద్రపరిచేందుకు ఎటువంటి వ్యవస్థ అందుబాటులో ఉండదు.  ఒకవేళ తీసుకువచ్చిన తర్వాత బయట ఉంచేయాల్సి వస్తే పూర్తి బాధ్యత వారిదే. అందువల్ల అభ్యర్థులు, వారి ప్రతినిధులు చరవాణులు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలను తీసుకురావద్దు. వీటిని గుర్తించేందుకు ఎనిమిది అంచెల్లో తనిఖీ వ్యవస్థ ఉంటుంది. 

270 మందితో రక్షణ 

ఈవీఎంల వద్ద 270 మందితో పటిష్ఠ రక్షణ  వ్యవస్థను ఏర్పాటు చేశాం. అసిస్టెంట్‌ కమాండెంట్‌ నేతృత్వంలో కేంద్ర సాయుధ బలగాలు మొదటి అంచెలో భద్రత కల్పిస్తున్నాయి. తర్వాత రాష్ట్ర సాయుధ దళాలు, బయట పోలీసు బృందాలు కాపలా ఉన్నాయి. కౌంటింగ్‌ కేంద్రం చుట్టూ ఒక డీఎస్పీ, నలుగురు సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్లు, ఆరుగురు ఎస్సైలు, వంద మంది పోలీసులు భద్రత చేపడతారు. 

ఆ రోజు పటిష్ఠ చర్యలు

ఫలితాలు వెల్లడయ్యే రోజున పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నాం. లెక్కింపు కేంద్రం వద్ద రాజకీయ పార్టీల ప్రతినిధుల మధ్య ఎటువంటి ఉద్రేకపూరిత వాతావరణం తలెత్తకుండా అందరిపై నిఘా ఉంటుంది. వాహనాల పార్కింగ్‌ దగ్గర, ప్రవేశ ద్వారాల దగ్గర పోలీసుల నిరంతర పర్యవేక్షణ ఉంటుంది. 144 సెక్షన్‌ అమలు చేస్తున్నాం. మంగళవారం పార్లమెంట్‌ పరిధిలోని అభ్యర్థులకు లెక్కింపు విధి విధానాలపై అవగాహన కల్పిస్తాం.  

8 గంటలకు ప్రారంభం

ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల్లో పోలైన ఓట్లను లెక్కించే ప్రక్రియ 4న ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. దానికి అర గంట ముందు పోస్టల్‌ బ్యాలట్లు లెక్కించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఆ సమయాన్ని కచ్చితంగా అమలు చేస్తాం. ఈ విషయాన్ని పోటీలో ఉన్న అభ్యర్థులందరికీ తెలియజేశాం. లెక్కింపు టేబుళ్ల దగ్గర ఏజెంట్లను నియమించుకునేందుకు వారికి సమాచారం అందించాం. 

14 టేబుళ్లపై ఈవీఎంలు

ఈవీఎంల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టేందుకు ఎనిమిది గదులను గుర్తించి ఏర్పాట్లు చేశాం. శాసనసభకు నాలుగు, పార్లమెంటుకు నాలుగు చొప్పున ఉంటాయి. ప్రతి నియోజకవర్గానికి 14 టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నాం. సాయంత్రం నాలుగు గంటలలోగా తుది ఫలితాలను వెల్లడించేందుకు వీలుగా అన్ని చర్యలు చేపడుతున్నాం. పాలకొండ నియోజకవర్గానికి సంబంధించి లెక్కింపు అత్యధికంగా 20 రౌండ్లు ఉంటుంది. పార్వతీపురానికి వచ్చేసరికి 17 రౌండ్లలో పూర్తి చేసి తొలి ఫలితం ప్రకటిస్తాం.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని