logo

ఫిష్‌ ఆంధ్ర.. మూణ్నాళ్ల ముచ్చటే

యువతకు స్వయం ఉపాధి, రైతుల ఉత్పత్తులకు గిట్టుబాటు, ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన మత్స్య సంపదను అందుబాటులోకి తెస్తామని ప్రగల్భాలు పలికిన వైకాపా ప్రభుత్వం..

Updated : 24 May 2024 07:48 IST

ఆర్భాటపు ప్రచారంతో సరి 
అందుబాటులోకి రాని అవుట్‌లెట్లు

మెంటాడ మండల కేంద్రంలో మూతపడిన దుకాణం 

భోగాపురం, గజపతినగరం, కోట, న్యూస్‌టుడే: యువతకు స్వయం ఉపాధి, రైతుల ఉత్పత్తులకు గిట్టుబాటు, ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన మత్స్య సంపదను అందుబాటులోకి తెస్తామని ప్రగల్భాలు పలికిన వైకాపా ప్రభుత్వం.. ఫిష్‌ ఆంధ్రా కింద అవుట్‌లెట్లను ఆర్భాటంగా ప్రారంభించింది. వీటి ఏర్పాటుకు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనలో భాగంగా కేంద్ర ప్రభుత్వం 24 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 16 శాతం రాయితీ అందించాయి. మిగిలిన సొమ్మును బ్యాంకుల నుంచి రుణాల రూపంలో పొందాలి. స్థానిక చెరువులు, రిజర్వాయర్ల నుంచి చేపలు సరఫరా చేస్తామని, వాటినే మార్కెట్‌ కన్నా తక్కువ ధరకు వినియోగదారులకు విక్రయించాలని యంత్రాంగం స్పష్టం చేసింది. దీంతో నిరుద్యోగ యువకులు అవుట్‌లెట్లను నెలకొల్పేందుకు ఉత్సాహం చూపారు. ఏర్పాటైన తరువాత క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉండటంతో ఆ దుకాణాలన్నీ మూతపడుతున్నాయి.
  విజయనగరం జిల్లాలో 170 ఫిష్‌ ఆంధ్రా దుకాణాలు ఏర్పాటు చేశారు. యూనిట్‌ వ్యయాన్ని రూ.1.50 లక్షలుగా నిర్ణయించగా రూ.30 వేలు దుకాణదారుడు చెల్లించాలి. అయితే ప్రస్తుతం వీటిలో 111 వరకు మూతపడ్డాయి. దీంతో అధికారులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. కొత్తవారికి ఇవ్వాలని అనుకున్నా ఇప్పటికే ఉన్న యూనిట్లకు సక్రమంగా చేపలు సరఫరా చేయడం లేదు. దీంతో వారికి వ్యాపారం జరగకపోవడంతో మూసేస్తున్నారు. కొందరు ఆదివారం ఒక రోజు చేపలు తెచ్చుకొని విక్రయించుకుంటున్నారు. ఇదే సమయంలో విద్యుత్తు బిల్లులు అధికంగా వస్తున్నాయి. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని ఎవరూ ముందుకురావడం లేదు.

మత్స్యకారులే స్వయంగా..

జిల్లాలో సముద్రతీర ప్రాంతం ఉంది. భోగాపురం, పూసపాటిరేగ మండలాల్లోని వివిధ మత్స్యకార గ్రామాల నుంచి జిల్లా వ్యాప్తంగా చేపలు సరఫరా అవుతున్నాయి. కొందరు మత్స్యకారులు నేరుగా వెళ్లి విక్రయిస్తున్నారు. వీరు తక్కువ ధరలకే ఇస్తున్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పడిన దుకాణాల్లో మాత్రం అధిక ధరలు ఉన్నట్లు వినియోగదారులు వాపోతున్నారు. తక్కువ అమ్మాలంటే తాము నష్టపోతామని నిర్వాహకులు చెబుతుండడం గమనార్హం. ఈక్రమంలో దుకాణాలన్నీ మూతపడుతున్నాయి.


లక్ష్యం చేరేలా కృషి.. అవుట్‌లెట్లు మూతపడుతున్న విషయం మా దృష్టికి వచ్చింది. కొంతమేర ఇబ్బందులున్నా పరిష్కరించి లక్ష్యాలు సాధించేలా కృషి చేస్తాం. యువతలో చైతన్యం కల్పించి వారికి అవసరమైన సహకారం అందిస్తున్నాం. రుణాల మంజూరు, రాయితీలు మంజూరయ్యేలా చొరవ తీసుకుంటాం.    

నిర్మలాకుమారి, జిల్లా మత్స్యశాఖ అధికారి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని