logo

దద్దరిల్లిన కలెక్టరేట్‌

కలెక్టరేట్‌ ప్రాంగణం సోమవారం నిరసనలతో హోరెత్తింది. అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయిల్‌పామ్‌  రైతులు, సీపీఐ, వివిధ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆందోళనలు చేశారు.

Published : 07 Feb 2023 03:41 IST

బైఠాయించిన అంగన్‌వాడీ కార్యకర్తలు

కలెక్టరేట్ ప్రాంగణం, న్యూస్‌టుడే: కలెక్టరేట్‌ ప్రాంగణం సోమవారం నిరసనలతో హోరెత్తింది. అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయిల్‌పామ్‌  రైతులు, సీపీఐ, వివిధ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆందోళనలు చేశారు.

ముఖ హాజరు వద్దు.. అంగన్‌వాడీలను ముఖ హాజరు నుంచి మినహాయించాలని జిల్లా గౌరవాధ్యక్షురాలు ఉమామహేశ్వరి, ప్రధాన కార్యదర్శి జ్యోతి కోరారు. అన్ని మండలాల నుంచి కార్యకర్తలు తరలివచ్చి కలెక్టరేట్‌ ముందు బైఠాయించారు. కనీస వేతనం రూ.26 వేలు చేయాలని, గ్యాస్‌ ప్రభుత్వమే సరఫరా చేయాలని, సంపూర్ణ పోషణ మెనూ ఛార్జీలు పెంచాలని కోరారు. 300 జనాభా దాటిన మినీ కేంద్రాలను ప్రధాన కేంద్రాలుగా మార్చాలన్నారు. అనంతరం జేసీ ఆనంద్‌కు వినతిపత్రం ఇచ్చారు. సిటూ నాయకులు ఇందిర, ప్రాజెక్టు అధ్యక్షురాలు సరళికుమారి, సిటూ నాయకుడు మన్మథరావు తదితరులు ఉన్నారు.

రూ.5 లక్షలివ్వాలి.. ప్రస్తుతం అన్ని రకాల సామగ్రి ధరలు పెరిగిన నేపథ్యంలో జగనన్న ఇళ్ల నిర్మాణాలకు ఇస్తున్న రూ.1.80 లక్షలు సరిపోవడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పి.కామేశ్వరరావు అన్నారు. ఈ మొత్తాన్ని రూ.5 లక్షలకు పెంచాలని డిమాండ్‌ చేశారు. గ్రామాల్లో 3 సెంట్లు, అర్బన్‌లో 2 సెంట్ల స్థలం మంజూరు చేయాలన్నారు.  
కూలి ధర పెంచాలి.. ఆయిల్‌పామ్‌ కూలి ధరలు పెంచాలని ఏపీ పామాయిల్‌ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ముందు నిరసన తెలిపారు. కూలి ధరను రూ.వెయ్యి చేయాలని డిమాండ్‌ చేశారు. ఆందోళన చేసేందుకు వివిధ సంఘాల నాయకులు, కార్యకర్తలు ఎక్కువ మంది రావడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సీఐ కృష్ణారావు, ఎస్‌ఐ ఫకృద్దీన్‌, సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.


15 నెలలుగా జీతాలు లేవాయె
వైటీసీ సిబ్బంది ఆవేదన

సీతంపేట, న్యూస్‌టుడే: సీతంపేట ఐటీడీఏ కార్యాలయంలో పీవో బి.నవ్య ఆధ్వర్యంలో జరిగిన గిరిజన స్పందనకు 51 అర్జీలు వచ్చాయి. సీతంపేట, పాతపట్నం, శ్రీకాకుళం, మందసలోని గిరిజన యువత శిక్షణ కేంద్రాల్లో పనిచేస్తున్న కేర్‌ టేకర్లు, సిబ్బంది మొత్తం 24 మంది 15 నెలలుగా జీతాలు అందలేదని, దీంతో ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులకు గురవుతున్నామని మొరపెట్టుకున్నారు. ఆప్కాస్‌లో నమోదై ఉన్నా బడ్జెట్‌ లేని కారణంగా చెల్లింపులు లేవని, ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి జీతాలు అందేలా చూడాలని వైటీసీ కేర్‌ టేకర్లు మల్లేష్‌, శ్రీనివాసరావు, రామినాయుడు తదితరులు విన్నవించారు. మందస వైటీసీకి కృష్ణపట్నం పోర్టు అద్దె, నిర్వహణ కింద రూ.18 లక్షలు చెల్లించాల్సి ఉందని, ఆ మొత్తాన్ని వసూలు చేసి తమకు జీతాలుగా ఇప్పించాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని