logo

చింత తీర్చేదెవరో..?

ఈ ఏడాది చింతపండు సీజనులో వ్యాపారాన్ని మెరుగుపరుచుకోవడానికి గిరిజన సహకార సంస్థ ప్రయత్నిస్తోంది. దీంతో పాటు వన్‌దన్‌ వికాస కేంద్రాలకు ఇచ్చిన నిధులతో చింతపండు వ్యాపారం చేయాలని వెలుగు చూస్తోంది.

Published : 27 Mar 2023 04:33 IST

పార్వతీపురం, న్యూస్‌టుడే

సాలూరు: సంతకు తెచ్చిన చింతపండు

ఏడాది చింతపండు సీజనులో వ్యాపారాన్ని మెరుగుపరుచుకోవడానికి గిరిజన సహకార సంస్థ ప్రయత్నిస్తోంది. దీంతో పాటు వన్‌దన్‌ వికాస కేంద్రాలకు ఇచ్చిన నిధులతో చింతపండు వ్యాపారం చేయాలని వెలుగు చూస్తోంది. ఈ రెండూ కాకుండా వ్యాపారులు రంగంలోకి దిగి కొనుగోలు ప్రారంభించారు. వారి ఆకర్షణలకు లోనవుతున్న గిరిజనులు పంటను తక్కువ ధరకే అమ్ముతూ నష్టపోతున్నారు.

మద్దతు ధర ఇచ్చినా..

కిలో చింతపండుకు జీసీసీ రూ.32.40 ధరను చెల్లిస్తోంది. జిల్లాలోని రెండు డివిజన్లు కలిపి 15 వేల క్వింటాళ్లు కొనుగోలుకు నిర్ణయించారు. నాణ్యతలో రాజీ పడకుండా పొడి బొట్టను మాత్రమే కొంటున్నారు. ఇలా ఇప్పటివరకు పార్వతీపురం డివిజన్‌లో 1,300 క్వింటాళ్లు కొనుగోలు చేశారు.  దీంతో పాటు వన్‌దన్‌యోజన కేంద్రాలతో టీపీఎంయూ కొనుగోలు చేయించింది. వీటిలో చింతపండు కేకులు తయారు చేసే యంత్రాలను గతంలో మండలానికి ఒకటి వంతున 8 ఉపప్రణాళిక మండలాలకు పంపించారు. వీటిలో కురుపాం, మక్కువ మండలాల్లో మాత్రమే కొనుగోలు చేసినట్లు సమాచారం. కురుపాంలో రూ.28 లెక్కన 5 వేల క్వింటాళ్లు కొనుగోలు చేశారు. వీరికి విక్రయించడం కంటే బయట అమ్ముకుంటే మంచి ధర వస్తుండటంతో ఇతర ప్రాంతాలకు తీసుకెళ్తున్నారు.  

జీసీసీ కంటే తక్కువ చెల్లిస్తున్నా..  

నాణ్యతతో సంబంధం లేకుండా పంట ఎలా ఉన్నా కొంటామని కొందరు వ్యాపారులు ముందుకొస్తున్నారు. వీరే ధరను నిర్ణయిస్తున్నారు. గ్రేడింగ్‌ సరకుకు రూ.40 పైన, మిగిలిన దానికి కిలోకు రూ.22, నుంచి రూ.25 మధ్య చెల్లిస్తున్నారు. ఇక్కడ క్వింటాకు 20 కిలోలు కూడా గ్రేడింగ్‌ ఉన్న పంట వచ్చే అవకాశం లేదు. ఈ లెక్కన జీసీసీ చేస్తున్న చెల్లింపులకంటే వ్యాపారులు తక్కువే చెల్లించినట్లు అవుతుంది. కానీ గిరిజనులు మాత్రం అటువైపే మొగ్గు చూపుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ ఏడాది కాపు ఆలస్యంగా రావడంతో పాటు ఇటీవల వర్షాలకు బొట్లలో నీరు దిగడంతో గ్రేడింగ్‌ తగ్గే అవకాశముండటతో వ్యాపారులకు  అమ్మకాలు చేస్తున్నారు.


అవగాహన కల్పించాం..
- వి.మహేంద్రకుమార్‌, జీసీసీ డీఎం, పార్వతీపురం

చింతపండు సీజను ప్రారంభానికి ముందే నాణ్యత, మద్దతు ధరలపై గిరిజన ప్రాంతాల్లో అవగాహన సదస్సులు నిర్వహించాం. జీసీసీకి అమ్మడంతో కలిగే ప్రయోజనాలను వివరించాం. మెరుగైన ధర చెల్లిస్తుండటంతో నాణ్యమైన సరకు కావాలని కోరాం. కానీ కొందరు గ్రేడింగ్‌ చేసి వ్యాపారులకు విక్రయిస్తున్నారు. గ్రేడింగ్‌తో సంబంధం లేకుండా పొడిగా, నాణ్యంగా ఉంటే రూ.32.40 చెల్లిస్తున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు