logo

నొచ్చుకున్న ప్రజాప్రతినిధులు!

గణతంత్ర వేడుకల్లో తమకు సరైన గౌరవం దక్కలేదని జిల్లా ప్రజాప్రతినిధులు నొచ్చుకున్నారు.

Published : 27 Jan 2023 02:13 IST

హై టీ కార్యక్రమానికి డుమ్మా

వీఐపీ గ్యాలరీకే పరిమితమైన బాలినేని, బూచేపల్లి, మాగుంట,
సుజాత, తూమాటి తదితరులు

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: గణతంత్ర వేడుకల్లో తమకు సరైన గౌరవం దక్కలేదని జిల్లా ప్రజాప్రతినిధులు నొచ్చుకున్నారు. కలెక్టర్‌ ప్రసంగిస్తుండగానే కార్యక్రమం నుంచి నిష్క్రమించారు. ఈ వ్యవహారం  చర్చనీయాంశంగా మారింది. వేడుకలకు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్‌బాబు, ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు, ఒంగోలు మేయర్‌ గంగాడ సుజాత తదితరులు హాజరయ్యారు. వీరెవరినీ వేదిక పైకి ఆహ్వానించలేదు. జాతీయ జెండాకు గౌరవ వందనం సమర్పించడానికి కూడా ప్రధాన వేదిక వద్దకు పిలవలేదు. వీఐపీ గ్యాలరీలో సాధారణ వీక్షకుల్లా వందనం సమర్పించాల్సి వచ్చింది. ఈ పద్ధతికి ప్రజాప్రతినిధులు నొచ్చుకున్నారు. పోలీసు కవాతు ముగిసి.. కలెక్టర్‌ ప్రసంగం ప్రారంభించిన కొద్దిసేపటికే అక్కడి నుంచి వెళ్లిపోయారు. అధికారులు వ్యవహరించిన తీరుపై ఎంపీ మాగుంట మనస్తాపానికి గురైనట్టు తెలిసింది. గణతంత్ర వేడుకలకు ఎంపీ మాగుంట ఏటా హాజరవుతుంటారు. అధికారులు కూడా సభా వేదికపై ఆయనకు సముచిత స్థానం కల్పిస్తుంటారు. అదేరోజు సాయంత్రం నిర్వహించే హై టీ కార్యక్రమంలోనూ సందడి చేస్తారు. ఈ దఫా మాత్రం ప్రజాప్రతినిధుల్ని కార్యక్రమ నిర్వాహకులు పెద్దగా పట్టించుకోలేదు. ఈ విషయాన్ని అధికారులు ఆలస్యంగా గుర్తించారు. ఎంపీ మాగుంటను బుజ్జగించేందుకు ఒక సీనియర్‌ పోలీసు అధికారిని పంపి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన హై టీ కార్యక్రమానికి ఆయనతో పాటు, ప్రజాప్రతినిధులెవరూ హాజరు కాలేదు. రాష్ట్ర ప్రభుత్వ సామాజిక న్యాయ సలహాదారు జూపూడి ప్రభాకర్‌ మాత్రమే పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని