logo

మహమ్మారిపై మళ్లీ పోరు!

మొదటి, రెండో దశలో కొవిడ్‌ విలయతాండవం చేసింది. జిల్లాలో వేలాది మంది వైరస్‌ బారిన పడ్డారు. వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు.

Published : 01 Apr 2023 04:12 IST

25 పీహెచ్‌సీల్లో పడకల నిర్మాణం
పరీక్షల సంఖ్య పెంచుతూ నిర్ణయం
కొవిడ్‌ కేసులతో అప్రమత్తం
ఒంగోలు నగరం, న్యూస్‌టుడే:

జీజీహెచ్‌లో రోగుల పడకలు

మొదటి, రెండో దశలో కొవిడ్‌ విలయతాండవం చేసింది. జిల్లాలో వేలాది మంది వైరస్‌ బారిన పడ్డారు. వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో ఆసుపత్రుల్లో పడకలు దొరకడమే దుర్భరమైంది. ఆక్సిజన్‌ అందక ప్రాణాలు ఎందరో రోగుల ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. కొవిడ్‌ కేర్‌ సెంటర్లు ఏర్పాటు చేసినప్పటికీ బాధితులను వాటిల్లోకి చేర్చడమూ సమస్యగా మారింది. అనంతరం పరిస్థితులు సద్దుమణిగాయి. ప్రస్తుతం కొవిడ్‌ కేసులు మళ్లీ వెలుగుచూస్తుండటంతో వైద్యశాఖ అప్రమత్తమైంది. ఇప్పటికే ఉమ్మడి ప్రకాశంలో మూడు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో అందిన ఆదేశాల మేరకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అనుమానితులకు గత వారం రోజులుగా ర్యాపిడ్‌ పరీక్షలు చేస్తున్నారు.

ఆసుపత్రులకు అనుబంధంగా గదులు...: అనుకోని పరిస్థితులు ఎదురైతే ఎదుర్కొనేందుకు వైద్యశాఖ సన్నద్ధమవుతోంది. బాధితుల కోసం ఎమర్జెన్సీ కొవిడ్‌ రెస్పాన్స్‌ ప్రాజెక్టు(ఈసీఆర్‌పీ) కింద జిల్లాలోని 25 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అరు పడకలతో ప్రత్యేక గదులు నిర్మించనున్నారు. ఇందుకోసం కేంద్రం ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఈ పనులను ర.భ. శాఖకు అప్పగించారు. ప్రాథమికంగా మొదటి విడతలో రూ.30 లక్షల నిధులు విడుదల చేశారు. ఒక్కో పీహెచ్‌సీకి రూ.9.83 లక్షలు వ్యయం అవుతుందని అంచనా వేశారు.  భవిష్యత్తులో కొవిడ్‌ ఉద్ధృతి తలెత్తితే రోగులకు సత్వర సేవలందించడానికి ముందస్తుగా ఈ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో 64 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. వీటికితోడు టంగుటూరు మండలం కొణిజేడు, పొన్నలూరు మండలం చెరుకూరు, సీఎస్‌పురం మండలం డీజీ పేట, మద్దిపాడు మండలం ఇనమనమెళ్లూరు, సింగరాయకొండ మండలం పాకలలో ఈ ఏడాది కొత్తగా ఆరోగ్య కేంద్రాలు ప్రారంభించారు. దీంతో మొత్తం వీటి సంఖ్య 69కు చేరింది. ప్రతి కేంద్రంలో ముగ్గురు స్టాఫ్‌నర్సులు, ఇద్దరు వైద్యులు పనిచేస్తున్నారు. కొవిడ్‌ పడకలు అందుబాటులోకి వచ్చాక ఆ సిబ్బందే అవసరమైన సేవలందిస్తారు.

ఆ 25 కేంద్రాలు ఇవే...: కొవిడ్‌ పడకలను ఏర్పాటు చేసే కేంద్రాలు 11 గిరిజన ప్రాంతాల్లో, 14 ఇతర ప్రదేశాల్లో ఉన్నాయి. చింతల, కొర్రప్రోలు, పాలుట్లపెంట, వెంకటాద్రిపాలెం, పుల్లలచెరువు, ముటుకుల, పెద్దారవీడు, చెట్లమిట్ట, అర్థవీడు, యాచవరం, కిష్టంశెట్టిపల్లి పీహెచ్‌సీలు గిరిజన ప్రాంతాల్లో ఉన్నాయి. కొత్తపట్నం, త్రిపురాంతకం, సంతనూతలపాడు, బండ్లమూడి, కురిచేడు, తూర్పు గంగవరం, గజ్జలకొండ, ఉప్పలపాడు, కనిగిరి మాచవరం, వెలిగండ్ల, పెట్లూరు, సింగరాయకొండ, బేస్తవారపేట, కొమరోలు కేంద్రాలు ఇతర ప్రాంతాల్లో ఉన్నాయి. వీటిల్లో ప్రత్యేక గదులు నిర్మించడంతో పాటు కొవిడ్‌ రోగులకు వైద్యసేవలందించడానికి అవసరమైన మందులు, ల్యాబ్‌లు, పరికరాలు సమకూరుస్తారు.

9 మండలాల్లో హెల్త్‌ హబ్‌లు...: 15వ ఆర్థిక సంఘం నిధులతో 9 మండలాల్లో హెల్త్‌ హబ్‌లు ఏర్పాటు చేయనున్నారు. ఒక్కొక్క దానికి రూ.50 లక్షలు కేటాయించారు. ఇందులో అన్ని రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు, ఆన్‌లైన్‌ ద్వారా నిపుణుల వైద్యసలహాలు పొందవచ్చు. జిల్లాలో కొమరోలు, పుల్లలచెరువు, కనిగిరి, దొనకొండ, కురిచేడు, ముండ్లమూరు, చీమకుర్తి, తాళ్లూరు, సీఎస్‌పురం మండలాల్లో హెల్త్‌ హబ్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి పరిపాలనా అనుమతి రావాల్సి ఉంది. ఈ మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు సమాచారం అందింది.

సన్నద్ధతపై 10, 11 తేదీల్లో మాక్‌డ్రిల్‌...

ఇప్పటికే అందిన ఆదేశాల మేరకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అనుమానితులకు ర్యాపిడ్‌ పరీక్షలు చేస్తున్నారు. బుధ, గురువారాల్లో జిల్లా వ్యాప్తంగా 30 పరీక్షలు చేశారు. వీటిని రోజుకు కనీసం 50కు పెంచాలనేది ఉన్నతాధికారుల ఆదేశాలు. పలుచోట్ల కేసులు నమోదు కావడంతో వైద్యులు, సిబ్బందిని అప్రమత్తం చేసేందుకు ఈ నెల 10, 11 తేదీల్లో మాక్‌డ్రిల్‌ ఏర్పాటు చేశారు. ఆసుపత్రుల్లో ఏర్పాట్లు, ఆక్సిజన్‌, మందులు, ప్రత్యేక పడకలు, ల్యాబ్‌లు, పరీక్ష కిట్‌లు, వైద్యసిబ్బంది వివరాలను తెలుపుతూ నివేదికను డీఎంహెచ్‌వో డాక్టర్‌ రాజ్యలక్ష్మి ఉన్నతాధికారులకు ఇప్పటికే పంపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు