logo

ఇంత బరితెగింపు ఏంటన్నా!

చెప్పుకొనేందుకు చేసిన అభివృద్ధి పనులేమీ లేవు. దీంతో ప్రలోభాలనే నమ్ముకున్నట్లున్నారు అధికార పార్టీ నేతలు. ఎన్నికలు తరుముకొస్తున్న వేళ సిద్ధమని బీరాలు పలుకుతున్నారు. తాయిలాల పంపిణీకి పోటాపోటీగా బరి తెగిస్తున్నారు.

Updated : 28 Feb 2024 06:09 IST

చేసిందేమీ లేక ప్రసన్నానికి పాట్లు

మార్కాపురం, న్యూస్‌టుడే: చెప్పుకొనేందుకు చేసిన అభివృద్ధి పనులేమీ లేవు. దీంతో ప్రలోభాలనే నమ్ముకున్నట్లున్నారు అధికార పార్టీ నేతలు. ఎన్నికలు తరుముకొస్తున్న వేళ సిద్ధమని బీరాలు పలుకుతున్నారు. తాయిలాల పంపిణీకి పోటాపోటీగా బరి తెగిస్తున్నారు. క్షేత్రస్థాయిలో కీలకంగా భావిస్తున్న వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులే లక్ష్యంగా ఈ కథ నడుపుతున్నారు. మిఠాయిల మాటున నగదు ఎర వేస్తూ ప్రసన్నం చేసుకోవటానికి పడరాని పాట్లు పడుతున్నారు. విమర్శలు వెల్లువెత్తుతున్నప్పటికీ పట్టించుకోవడం లేదు. ఈ విషయంలో గిద్దలూరు ఎమ్మెల్యే, మార్కాపురం నియోజకవర్గ వైకాపా సమన్వయకర్త అన్నా రాంబాబు మరింత బరితెగించి వ్యవరిస్తున్నారు. నిన్నటి వరకు వాలంటీర్లకు ఒక్కొక్కరికి రూ.5 వేల నగదు, మిఠాయిలు పంపిణీ చేశారు. తాజాగా మార్కాపురం మండలంలోని అన్ని గ్రామ సచివాలయాల అధికారులను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.

మిఠాయిల మాటున నగదు...

అన్నా రాంబాబు తరఫున మార్కాపురం పూర్వపు ఎంపీపీ అరుణ భర్త పోరెడ్డి చెంచిరెడ్డితో పాటు వాల్మీకి కార్పొరేషన్‌ డైరెక్టర్‌ నల్లబోతుల కొండయ్య, మరో ఓ వైకాపా నాయకుడు ఈ ప్రలోభాల పర్వానికి తెర లేపారు. మార్కాపురం మండలంలోని అన్ని గ్రామ సచివాలయాల వద్దకు వెళ్లి అక్కడి పంచాయతీ కార్యదర్శులతో మాట్లాడుతున్నారు. అనంతరం 11 మంది ఉద్యోగులకు 300 గ్రాముల బరువుండే మిఠాయిల పెట్టె అందిస్తున్నారు. మంగళవారం ఒక్క రోజే దాదాపు పది సచివాలయాలకు వెళ్లి అందుబాటులో ఉన్న ఉద్యోగులకు అందజేశారు. లేనివారికి తర్వాత ఇవ్వాలంటూ అప్పగించి వెళ్లారు. మిఠాయిల పెట్టెలను కొందరు ఉద్యోగులు, అధికారులు తీసుకునేందుకు నిరాకరించారు. కొన్ని సచివాలయాల్లో రూ.1,000 నుంచి రూ.1,500 నగదు కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేయగా పలువురు తీసుకోలేదని సమాచారం. ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ.. ఉద్యోగం కల్పించినందుకుగాను వైకాపాకు మీరు ఓటు వేయడమే కాకుండా మీ బంధువులతోనూ వేయించాలని కోరినట్లు తెలిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని