logo

అధికారంలో అయోమయం

ఓ వైపు ప్రతిపక్ష తెదేపా ఒకే దఫా జిల్లాలో అయిదుగురి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి ‘పంచ్‌’ విసిరింది. దీంతో ఆ పార్టీ శ్రేణుల్లో అంతులేని ఉత్సాహం వెల్లివిరుస్తోంది. ఎక్కడికక్కడ సంబరాలు చేసుకుని మిఠాయిలు పంచుకుంటున్నారు.

Updated : 28 Feb 2024 09:51 IST

సతమతమవుతున్న సమన్వయకర్తలు
తాయిలాల పైనే దింపుడు కల్లం ఆశల

ఓ వైపు ప్రతిపక్ష తెదేపా ఒకే దఫా జిల్లాలో అయిదుగురి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి ‘పంచ్‌’ విసిరింది. దీంతో ఆ పార్టీ శ్రేణుల్లో అంతులేని ఉత్సాహం వెల్లివిరుస్తోంది. ఎక్కడికక్కడ సంబరాలు చేసుకుని మిఠాయిలు పంచుకుంటున్నారు. గెలుపు తమదేననే ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. అదే సమయంలో అధికార వైకాపా పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల స్థానంలో సమన్వయకర్తల పేరిట కథ నడుపుతోంది. సర్వేల పేరిట ఆశావహులతో అధిష్ఠానం ఆటాడుకుంటోంది. సిటింగ్‌ ఎమ్మెల్యేలను ప్రాతినిథ్యం వహిస్తున్న స్థానాల నుంచి గెంటేసి డమ్మీలను చేసింది. తమకు ఇష్టం ఉన్నా లేకపోయినా పాత స్థానాలను విడిచి కొత్తవాటిలో సమన్వయకర్తలుగా బాధ్యతలు చేపట్టారు. సిటింగులుగా ఉన్న కొందరిని పక్కనబెట్టినా కిమ్మనలేని పరిస్థితి. ఈ పరిస్థితులన్నీ ఆ పార్టీ శ్రేణుల్లో తీవ్ర అయోమయం, గందరగోళానికి దారి తీస్తున్నాయి.

ఈనాడు, ఒంగోలు

చేసేదేమీ లేక.. చేష్టలుడిగి...: ఒక్క ఒంగోలు అసెంబ్లీ స్థానం తప్ప జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అధికార వైకాపా సమన్వయకర్తలను నియమించింది. తదనుగుణంగా వారంతా ఆయా చోట్ల పరిస్థితిని చక్కబెట్టుకునే పనిలో పడ్డారు. అసంతృప్తుల నుంచి ప్రతిఘటన ఎదురవుతున్నా భరిస్తున్నారు. కొందరు తమ ప్రచార భారాన్ని కొందరు పోలీసు, ఇతర ప్రభుత్వ శాఖాధికారులపై వేసి ముందుకు సాగుతున్నారు. మరికొందరు ఆస్తులను తెగనమ్మి కార్యక్రమాలు చేపడుతున్నారు. వ్యక్తిగత కారణాలతో ఈ దఫా ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటానని ప్రకటించి.. సీటు మార్చేసరికి సరేనంటూ ఇంకొకరు తాయిలాల పంపిణీకి తెర లేపారు. స్థానిక నేతల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నా తప్పనిసరి పరిస్థితుల్లో మరొకరు చేసేదేమీ లేక సర్దుకుపోతున్నారు. పనిలో పనిగా వాలంటీర్లను మచ్చిక చేసుకునేలా తాయిలాలు ఎర వేస్తున్నారు. బూత్‌ కమిటీలను మచ్చిక చేసుకునే పనిలో తలమునకలుగా ఉన్నారు.

అయిదేళ్లు.. ప్రజలను గాలికొదిలేసి...: జిల్లాలో గత ఎన్నికల్లో కొండపి మినహా మిగిలిన ఏడు నియోజకవర్గాల్లోనూ వైకాపా అభ్యర్థులే ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. అయిదేళ్లపాటు జిల్లా సమస్యలపై పట్టించుకున్నది లేదు. జిల్లా విభజన సమయంలోనూ ప్రజల వినతులపై పెదవి విప్పలేదు. రైతులు, వ్యాపారుల, ఉద్యోగులు, కార్మికులు ఇలా రంగాలవారీగా తమ సమస్యలపై పోరాటం చేస్తున్నా మద్దతు ఇవ్వలేకపోయారు. విపత్తుల సమయంలో పంట నష్టపోయిన రైతులకు క్షేత్రస్థాయిలో పర్యటించి ఆదుకుంటామనే నమ్మకం కూడా కలిగించలేకపోయారు. పార్టీ ఆదేశాలు పాటించడం, పథకాల ప్రారంభానికే పరిమితం అయ్యారు. వెలిగొండ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టు జాబితా నుంచి తొలగించిన సందర్భంలోనూ, ప్రాజెక్టు పూర్తిచేసి సాగు, తాగు నీళ్లు ఇవ్వడంలోనూ అధికార పార్టీ ప్రజాప్రతినిధులు విఫలమయ్యారు. తమ నియోజకవర్గం పరిధిలో అవినీతి అక్రమాలను ప్రోత్సహించడం, బినామీల ద్వారా వాటాలు పుచ్చుకోవడం తప్ప జిల్లా ప్రజల కోసం ఒక్క నూతన ప్రాజెక్టును తీసుకొచ్చిన దాఖలాలు లేవు. కొత్తగా ఒక కంపెనీ తీసుకొచ్చి ఉద్యోగాలు కల్పించింది లేదన్న విమర్శలున్నాయి. ప్రధాన రహదారులకు మరమ్మతుల సంగతి సరేసరి. కొత్తగా మంజూరైనవి పూర్తిచేసింది లేదు. ఈ పరిణామాలతో ఎక్కడికక్కడ ప్రజల నుంచి నిలదీతలు ఎదురయ్యాయి. దీంతో చాలామంది ఎమ్మెల్యేలు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి కూడా మొహం చాటేశారు.

ప్రలోభాలే చివరికి దిక్కు...: ఇలాంటి పరిస్థితుల్లో తాయిలాలనే అధికార పార్టీ నేతలు తమకు ఓట్లు కురిపించేవిగా నమ్ముకుంటున్నారు. వాలంటీర్లను మభ్యపెట్టి తమకు అనుకూలంగా పని చేయించుకునేందుకు తహతహలాడుతున్నారు. వారితో తరచూ సమావేశాలు ఏర్పాటు చేసి నగదు, మిఠాయిలు, ఇతర బహుమతులు అందజేస్తున్నారు. బూత్‌ కమిటీ సభ్యులతో ‘అభ్యర్థులను గెలిపించడానికి తాము సిద్ధం’ అంటూ ప్రతిజ్ఞ చేయిస్తున్నారు. అధికార వైకాపాలో ప్రాంతీయ సమన్వయకర్తగా నూతనంగా నియమితులైన చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఇటువంటి వాటిలో సిద్ధహస్తుడనే పేరుంది. ఆయన తెర వెనుక ఉంటూ నియోజకవర్గాల్లో తాయిలాలు పంపిణీ చేయిస్తూ ఆకట్టుకునే పనిలో ఉన్నట్లు ప్రచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని