logo

ఓట్ల వేటలో మహా నటులు

వైకాపా ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత జనం బాధలు అంతగా పట్టించుకున్నది లేదు. రోడ్లు వేసింది లేదు.. పరిశ్రమలు తెచ్చింది లేదు.. కాలనీల్లో ఇళ్లూ పూర్తిచేసింది లేదు.. అభివృద్ధి పనులకు కొబ్బరికాయలు కొట్టిందీ లేదు.

Published : 30 Mar 2024 03:39 IST

ఆగమేఘాలపై పనులు.. ట్యాంకర్లతో నీళ్లు
అధికార పార్టీ తీరుతో విస్తుపోతున్న స్థానికులు

వైకాపా ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత జనం బాధలు అంతగా పట్టించుకున్నది లేదు. రోడ్లు వేసింది లేదు.. పరిశ్రమలు తెచ్చింది లేదు.. కాలనీల్లో ఇళ్లూ పూర్తిచేసింది లేదు.. అభివృద్ధి పనులకు కొబ్బరికాయలు కొట్టిందీ లేదు. అదేమని అడిగితే అధినేత బటన్‌ నొక్కుడుతో సరిపుచ్చారు. సమస్యలు పరిష్కరించాలని జనం ఎన్నిసార్లు ఆందోళనలు చేసినప్పటికీ పాలకుల్లో ఉలుకూ పలుకు లేదు. ఎన్నికల వేళ మాత్రం వారిలో హడావిడి మొదలైంది. తాయిలాలు, కానుకలు, నగదు పంపిణీలే ఓట్ల వేటలో పూర్తిస్థాయి ఫలితాలను ఇవ్వవని తెలుసుకున్నారు. అందుకే మహా నటుల అవతారమెత్తారు. ఏవో చిన్నాచితక పనులు చేస్తూ ఆకట్టుకునేందుకు నానా పాట్లు పడుతున్నారు.  

ఈనాడు, ఒంగోలు

వినతులిచ్చి.. విసిగివేసారి...: ఒంగోలు నగరంలోని 11వ డివిజన్‌ అయ్యన్నశెట్టి సత్రం వద్ద రహదారి అధ్వానంగా మారింది. విద్యుత్తు సౌకర్యం, తాగునీటి సదుపాయం లేదు. ఈ విషయమై స్థానికులు కోరుతున్నప్పటికీ ఇంతకాలం ఎవరూ పట్టించుకోలేదు. ఇటీవల ఆ ప్రాంతానికి ప్రచారానికి వెళ్లిన అధికార పార్టీ నేతను కూడా ఇదే విషయమై అక్కడి వాసులు నిలదీశారు. దీంతో ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నప్పటికీ వాటి నిర్మాణానికి సిద్ధమయ్యారు. అదేమంటే సొంత నిధులతో అంటూ చెప్పుకొస్తున్నారు. ఈ తీరుపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

నిలదీస్తున్నారనే నీళ్లు...: యర్రగొండపాలెం నియోజకవర్గంలోని పుల్లలచెరువు, పెద్దారవీడు, యర్రగొండపాలెం తదతర ప్రాంతాల్లో గతేడాది నుంచి నీటి ఎద్దడి పరిస్థితులున్నాయి. ఈ సమస్యతో వేల మంది ప్రజలు అవస్థలు పడుతున్నారు. తాగడానికి గుక్కెడు నీళ్లూ ఇవ్వడం లేదంటూ ఖాళీ బిందెలతో రోడ్ల పైకి వచ్చి ఆందోళనలు చేశారు. అయినప్పటికీ వైకాపా ప్రభుత్వం పట్టించుకున్నది లేదు. ఈ సమస్య ఎన్నికల్లో సమస్యలు సృష్టిస్తుందని తెలుసుకున్న ఓ నేత.. ఇప్పుడు పలు ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీళ్లు తోలిస్తున్నారు. కొన్నిచోట్ల సొంత నిధులతో బోరు కూడా వేయించడం గమనార్హం.

మీరు తోలండి.. డబ్బులు మేమిస్తాం...: మార్కాపురం శివారు, పొదిలిలో తాగునీటి సమస్య తీవ్రం. తాగునీటి సరఫరా కోసం స్థానికులు ప్రజాప్రతినిధులు, అధికారులకు పదే పదే వినతులు సమర్పించారు. నగర పంచాయతీ ఆధ్వర్యంలో ట్యాంకర్ల ద్వారా నీళ్లు సరఫరా చేస్తున్నా అవి సరిపోవడంలేదు. వీటి సంఖ్య పెంచాలని కోరినా ఇంతకాలం ఎలాంటి ఫలితం లేదు. ఎన్నికల వేళ రావడంతో నాయకులు ఇప్పుడు స్పందించారు. రెండు నెలలపాటు ట్యాంకర్ల ద్వారా నీళ్లు తోలాలని.. అందుకయ్యే డబ్బులు మేమిస్తామంటూ వాటి యజమానులతో చెప్పుకొస్తున్నారు.

బకాయిలిచ్చి ఓట్లేయించాలని పురమాయింపులు: ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చాక నీటి బిల్లుల బకాయిల చెల్లింపునకు ప్రభుత్వం తెర లేపింది. ఇందుకుగాను స్క్రీనింగ్‌ కమిటీ ఆమోదం లేకుండా ఇటీవల ప్రభుత్వం 13 జీవోలు తెచ్చింది. వీటి ప్రకారం కనిగిరి నగర పంచాయతీ పరిధిలో రూ.4.75 కోట్లు, మార్కాపురం మున్సిపాలిటీ పరిధిలో రూ.3 కోట్లు, పొదిలి నగర పంచాయతీలో రూ.3.25 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇందులో కనిగిరి పరిధిలో ఇప్పటికే కొంత నగదు జమైంది. మార్కాపురం, పొదిలిలో ఆ ఊసే లేదు. ఈ అంశాన్ని కూడా వైకాపా నాయకులు తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. బిల్లులు వచ్చిన గుత్తేదారులు.. తమకు అనుకూలంగా పనిచేసి ఓట్లు వేయించాలని పురమాయిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని