logo

అన్న పాలనలో ఆటవిక రాజ్యం

Published : 13 Apr 2024 02:22 IST

జగన్‌ ప్రభుత్వంలో పరాకాష్ఠకు వైకాపా నేతల అరాచకాలు
ప్రజలు, ప్రతిపక్షాలు, ఆఖరికి ప్రభుత్వ ఉద్యోగులపైనా దౌర్జన్యకాండ
ఈనాడు, ఒంగోలు, న్యూస్‌టుడే, సింగరాయకొండ గ్రామీణం

జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో వైకాపా అల్లరిమూకలు పేట్రేగిపోయాయి. జిల్లాలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు సామాన్య ప్రజల నుంచి మొదలు ప్రతిపక్ష నేతలు, ఆఖరికి ప్రభుత్వ ఉద్యోగులపైనా దౌర్జన్యాలకు పాల్పడ్డారు. వారు చెప్పిందే వేదం అన్నట్లు రెచ్చిపోయారు. ప్రభుత్వ కార్యాలయాల్లోనే అధికారులపై దూషణల పర్వానికి దిగి, ఆఖరుకి కొందరిపై చేయి కూడా చేసుకున్నారు. వీటిని అడ్డుకోవాల్సిన పోలీసులు ప్రేక్షకపాత్రకే పరిమితమయ్యారు. ఫలితంగా ఎంతోమంది ప్రభుత్వ బాధితులయ్యారు. అందుకు నిదర్శనమే ఈ సంఘటనలు.

చెప్పింది వినకపోతే బూతులతో విరుచుకుపడి..

  • తనపై వైకాపా మండల అధ్యక్షుడు దుంపా చెంచిరెడ్డి దాడిచేశారని అప్పటి సంతనూతలపాడు తహసీల్డారు లక్ష్మీనారాయణరెడ్డి స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే కేసు నమోదు చేయకపోవడంతో ఆయన జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
  • నాగులుప్పలపాడు మండలంలో వైకాపా పాలనలో ఆరుగురు తహసీల్దార్లు, ఆరుగురు ఎస్సైలు మారారు. మండల సర్వసభ్య సమావేశానికి వెళ్లనీయకుండా అడ్డుకున్నారని ఎస్సైపై వైకాపా ఎంపీపీ ఒంటికాలిపై లేచారు. కొన్నిరోజులకే ఆ ఎస్సైకి బదిలీ బహుమానం ఇచ్చి పంపించారు.
  • గతంలో ఒంగోలు తహసీల్దారుగా పనిచేసిన ఓ అధికారి అధికారపార్టీ నేతలు చెప్పిందంతా చేశారు. 60 సెంట్ల భూమి విషయంలో నిబంధనలకు విరుద్ధంగా ఉందని, భవిష్యత్తులో తనకు సమస్యలొస్తాయని వెనకడుగేశారు అంతే సదరు తహసీల్దారుపై అధికారపార్టీ నేతలు భూతులతో విరుచుకుపడ్డారు. ఆయన అవమానంతో బదిలీపై వెళ్లిపోయారు.
  • చంద్రబాబునాయుడు అరెస్టుకు నిరసనగా గతేడాది సెప్టెంబరు 17న ఒంగోలులో తెదేపా నిర్వహించిన బంద్‌ విజయవంతం కావడాన్ని జీర్ణించుకోలేని వైకాపా నాయకులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మేం చెప్పింది చేస్తావా...ఇక్కడి నుంచి పంపించేయమంటావా.. అంటూ పోలీసు అధికారిని బెదిరించారు. పలువురు తెదేపా నేతలపై హత్యాయత్నం కేసు నమోదుతోపాటు, కొందరిని అరెస్టు చేసినా శాంతించకుండా మరికొంత మందిని అరెస్టు చేయాలని హుకుం జారీ చేశారు. ఆధారాలు లేకుండా అరెస్టు చేయలేమని చెప్పినందుకు సదరు సీఐని పట్టుబట్టి బదిలీ చేయించారు.
  • ఏడాది క్రితం సింగరాయకొండలోని ఓ బ్యాంకులో విధులు నిర్వహిస్తున్న దళిత ఉద్యోగి విజయభాస్కర్‌పై వైకాపా నాయకులు దాడిచేసి అతడిపైనే కేసుపెట్టారు. వైకాపా నాయకుడు బ్యాంకులో రుణం తీసుకుని నిబంధనల ప్రకారం నెలవారి వాయిదాలు చెల్లించకపోవడంతో సదరు ఉద్యోగి మరో ముగ్గురు సిబ్బంది నేత ఇంటికెళ్లి రుణం చెల్లించాలని కోరడంతో ఆయనతోపాటు, అతని కుమారులు మూకుమ్మడిగా పిడిగుద్దులతో దాడికి పాల్పడ్డారు. బ్యాంకు సిబ్బంది ఘటనపై స్థానిక పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేయడానికి వెళ్లగా వైకాపా నేతలు గుంపులుగా వచ్చి రాజీకి రావాలని బెదిరింపులకు దిగారు. పోలీసులు నిందితులకే అనుకూలంగా వ్యవహరించారని బ్యాంకు సిబ్బంది వాపోయారు.
  • గత ప్రభుత్వ హయాంలో పాతసింగరాయకొండ పరిధిలో గిరిజనులకు ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని శ్మశాన వాటికకు కేటాయించారు. ఆ భూమిని వైకాపా నేత కబ్జా చేయడంతో కాలనీవాసులు అడ్డుకోవాలని ప్రయత్నిస్తుండగా మారణాయుధాలతో గిరిజనులపై దాడి చేశాడు. అతనిపై పోలీసులు నామమాత్రపు కేసు నమోదు చేసి చేతులు దులుపుకొన్నారు.
  • ఆరు నెలల క్రితం సోమరాజుపల్లిలో బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని అదే గ్రామానికి చెందిన వైకాపా నేత పశువుల దొంగతనానికి పాల్పడ్డాడని పోలీసులతో అక్రమ కేసు బనాయించి స్థానిక పోలీసు స్టేషనులో ఉదయం నుంచి సాయంత్రం వరకు విచారణ పేరుతో వేధింపులకు గురి చేశారు. అనంతరం బాధితుడు ఇంటికి వెళుతుండగా నేత గ్రామ రైల్వే గేటు వద్ద ఎదురై చంపుతానని బెదిరించడంతో మనస్థాపం చెంది రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుళికలు తిని ఆత్మహత్యకు ప్రయత్నించగా స్థానికులు ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. పది రోజులపాటు వైద్యం పొంది కోలుకున్నాడు.

ప్రతిపక్షనేతపై రాళ్లు రువ్వి పైశాచిక ఆనందం

చంద్రబాబుపై వైకాపా మూకలు దాడికి యత్నించడంతో ఆయన చుట్టూ నిలిచిన భద్రతా సిబ్బంది

ప్రధాన ప్రతిపక్ష నేత, తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గతేడాది ఏప్రిల్‌లో యర్రగొండపాలెంలో పర్యటించారు. మంత్రి హోదాలో ఉన్న ఆదిమూలపు సురేష్‌ చొక్కావిప్పి అర్ధనగ్నంగా నల్లబెలూన్లు, రిబ్బన్లతో నిరసన తెలపడంతో పాటు వైకాపా మూకలు  చంద్రబాబుపైకి రాళ్లు రువ్వడంతో ఎన్‌ఎస్‌జీ అధికారి తలకు రాయి తగిలి గాయమైంది. వైకాపా చేపట్టే కార్యక్రమంతో శాంతిభద్రతల సమస్య వస్తుందని పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి, కట్టడి చేయాల్సిన పోలీసులు చేష్టలుడిగి చూశారు. గతేడాది పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని, ఆయన తనయుడు ప్రణీత్‌రెడ్డి రోడ్డుపైకి వచ్చి కేకలు వేయడం, తెదేపా నాయకుడిని కొట్టడం, విషయం తెలిసి తెదేపా మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ మద్దతుదారులు రావడంతో నగరంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇక్కడా పోలీసులు ఏకపక్షంగానే వ్యవహరించారు.

చంద్రబాబు పర్యటన సందర్భంగా భారీగా గుమిగూడిన వైకాపా శ్రేణులు


రీల్‌ కాదు.. రియల్‌

సింగరాయకొండ సెబ్‌ కార్యాలయం వద్ద కుర్చీలో దర్జాగా కూర్చొని సెబ్‌ ఎస్సైని దూషిస్తున్న వైకాపా నాయకుడు

సినిమాల్లోనే చూస్తుంటాం ఇలాంటి సంఘటనలు. తమ అనుచరులను పోలీసులు తీసుకెళ్లారని వెంటనే స్టేషన్‌ వద్దకు ఒక నాయకుడు వచ్చి, పోలీసులను బూతులు తిడుతూ, మా వాళ్లనే తీసుకొస్తావా.. ఎంత ధైర్యం నీకు, నేనెవరనుకుంటున్నావ్‌..అంటూ నానా యాగీ చేస్తాడు. అచ్చం ఇలాంటిదే గత ఏడాది ఆగస్టు 20న సింగరాయకొండలోని సెబ్‌ కార్యాలయం వద్ద చోటుచేసుకుంది. సెబ్‌ ఎస్సై దయాకర్‌ పాతసింగరాయకొండ పరిధిలో జూద శిబిరంపై దాడి చేసి నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.2 లక్షలు నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. మరుసటి రోజు మండల వైకాపా నేత మద్యం తాగి తన అనుచరులతో సెబ్‌ కార్యాలయం వద్దకు చేరుకుని నా మనుషులనే అరెస్టు చేస్తావా..అంటూ బహిరంగంగానే ఎస్సైపై బూతులు తిడుతూ బెదిరింపులకు దిగాడు. ఆ అధికారి చేసేదేమీ లేక మిన్నకుండిపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని