logo

అల్లరిమూకలు సిద్ధం

జిల్లా కేంద్రం ఒంగోలులో రాజకీయ దాడులు, అల్లరిమూకల ఆగడాలు ఇటీవల పెచ్చుమీరుతున్నాయి. ఉద్రిక్తతలను నిలువరించాల్సిన సీనియర్‌ నాయకులు.. తమ వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం ప్రోత్సహిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Published : 13 Apr 2024 02:26 IST

పెంచి పోషిస్తున్న వైకాపా నేతాగణం
ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసే వ్యూహం!
న్యూస్‌టుడే, ఒంగోలు నేరవిభాగం

జిల్లా కేంద్రం ఒంగోలులో రాజకీయ దాడులు, అల్లరిమూకల ఆగడాలు ఇటీవల పెచ్చుమీరుతున్నాయి. ఉద్రిక్తతలను నిలువరించాల్సిన సీనియర్‌ నాయకులు.. తమ వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం ప్రోత్సహిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సమతానగర్‌లో మాజీ మంత్రి, వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు శ్రీకావ్య ఎన్నికల ప్రచారం సందర్భంగా తెదేపా మద్దతుదారు చప్పిడి ప్రభావతి కుటుంబంపై దాడి, అనంతరం తెదేపా నాయకుడు మేడికొండ మోహన్‌పై హత్యాయత్నం వంటి ఉదంతాలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.

ప్రతి డివిజన్‌లోనూ ఓ ముఠా...: ఎన్నికల నేపథ్యంలో అధికార వైకాపా అల్లరిమూకలను పెంచి పోషిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి డివిజన్‌లోనూ సుమారు 20 మంది నుంచి 30 మంది వరకు యువకులను ఎంపిక చేసుకుని వారితో ఆయా ప్రాంతాల్లో భయాందోళనలు సృష్టించేందుకు పావులు కదుపుతున్నట్లు సమాచారం. ప్రత్యర్థి పార్టీల్లో క్రియాశీలకంగా పనిచేసే వారిని గుర్తించి బెదిరింపులకు దిగడం, ఎన్నికల రోజున పోలింగ్‌ బూత్‌ల వద్ద అలజడులు సృష్టించి తటస్థ ఓటర్లను బూత్‌ల వద్దకు రానీయకుండా కుట్రలు పన్నుతున్నారనే అనుమానాలున్నాయి.

బల ప్రదర్శన.. కాదా కోడ్‌ ఉల్లంఘన...: ప్రస్తుతం ఎన్నికల కోడ్‌ అమలులో ఉంది. అయినప్పటికీ వైకాపా నేతలు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. ఒంగోలు జీజీహెచ్‌లో బుధవారం అర్ధరాత్రి మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి బల ప్రదర్శన చేశారు. ఆయన పర్యవేక్షణలోనే వైకాపా శ్రేణులు విధ్వంసకాండ సృష్టించాయి. అనంతరం తమ వారిని అరెస్టు చేశారంటూ ఒకటో పట్టణ పోలీసు స్టేషన్‌లోకి వెళ్లి శుక్రవారం మరోమారు హల్‌చల్‌ చేశారు. రెండు రోజులుగా నగరంలో ఉద్రిక్తతలున్నా.. వైకాపా శ్రేణుల్ని స్టేషన్‌ ఆవరణలోకి పోలీసులు రానివ్వడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. స్టేషన్‌ వచ్చి తన వాదన వినిపించే హక్కు ఎమ్మెల్యేగా బాలినేనికి ఉంటుంది. అయితే వందల మందితో మోహరించి గంటల తరబడి స్టేషన్‌లోనే తిష్ట వేసి తాను చెప్పినట్లు, తనకు నచ్చినట్లు వ్యవహరించాలని పోలీసులపై ఒత్తిడి చేయటం ఎంతమేరకు సబబు.. కోడ్‌ ఉల్లంఘన కాదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

పోలీసుల దొంగాట..!: ఎన్నికల నియమావళిని పక్కాగా అమలుచేయాల్సిన అధికారులు కూడా అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. అనుచరులతో స్టేషన్‌కు వచ్చిన బాలినేనితో గంటల తరబడి చర్చలు సాగించారు. తీరా సర్వెలెన్స్‌ బృందం వస్తున్నట్లు తెలుసుకుని కేంద్ర బలగాల సాయంతో అక్కడ భారీగా గుమిగూడిన వైకాపా కార్యకర్తలను దూరంగా పంపారు. ఈ తరహా చర్యలతో అధికార పార్టీతో కలిసి పోలీసు యంత్రాంగం దొంగాట ఆడుతోందనే అపప్రథను మూటగట్టుకుంటోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని