logo

బాలినేని.. ఏంటీ దాదాగిరి!.. పెచ్చుమీరుతున్న అసహనం

సార్వత్రిక ఎన్నికల వేళ వైకాపా నేతలు తీవ్ర అసహనానికి లోనవుతున్నారు. అరాచకంతోనైనా రాజ్యమేలే దిశగా కుట్రలు పన్నుతున్నారు. అదే సమయంలో వాస్తవాలను వక్రీకరిస్తూ.. అబద్ధాలు పదే పదే చెబుతూ సానుభూతి నాటకాలకు తెర లేపారు.

Updated : 13 Apr 2024 09:11 IST

ఎన్నికల వేళ సానుభూతి నాటకం

సార్వత్రిక ఎన్నికల వేళ వైకాపా నేతలు తీవ్ర అసహనానికి లోనవుతున్నారు. అరాచకంతోనైనా రాజ్యమేలే దిశగా కుట్రలు పన్నుతున్నారు. అదే సమయంలో వాస్తవాలను వక్రీకరిస్తూ.. అబద్ధాలు పదే పదే చెబుతూ సానుభూతి నాటకాలకు తెర లేపారు. ప్రజాస్వామ్య విలువలంటూ పైకి వల్లె వేస్తూ.. తాము మాత్రం వాటికి నిలువునా నీళ్లొదులుతున్నారు. మందితో దండుగా దౌర్జన్యాలు సాగిస్తూ నెపం ప్రత్యర్థుల పైకి నెడుతున్నారు. గిట్టని వారిపై తప్పుడు కేసులు బనాయిస్తూ.. పైగా తమకేం అన్యాయం చేస్తున్నారంటూ మొసలి కన్నీరు కారుస్తున్నారు. తమ అడుగులకు మడుగులొత్తాలే కానీ చట్ట ప్రకారం పని చేయకూడదంటూ హూంకరిస్తున్నారు. కాదు కూడదంటే ఏకంగా స్టేషన్లలోకి వెళ్లి మరీ దూషణపర్వానికి తెర లేపుతున్నారు.

ఈనాడు, ఒంగోలు: ఒంగోలు నుంచి ఎమ్మెల్యేగా బాలినేని శ్రీనివాసరెడ్డి అయిదుసార్లు గెలుపొందారు. రెండు సార్లు మంత్రిగా కొనసాగారు. మంత్రివర్గ విస్తరణ సమయంలో ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి 2022లో ఆయన్ను తొలగించారు. నాటి నుంచి పెరిగిన అసహనం ఎన్నికల సమయానికి తారస్థాయికి చేరింది. అదే సమయంలో క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న వ్యతిరేకతతో మరింత కలవరానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో దాదాగిరికి తెర లేపారు. ప్రజాప్రతినిధిననే ఆలోచన లేకుండా తరచూ హెచ్చరికలు, సవాళ్లు, శ్రేణులను గొడవలకు రెచ్చగొట్టడం, తనకు అనుకూలంగా వ్యవహరించకుంటే విధేయులైన అధికారుల పైనే నోరు పారేసుకోవడాన్ని పరిపాటిగా మార్చుకున్నారు. ఈ దాదాగిరి ధోరణితో జిల్లా వాసులిప్పుడు నివ్వెరపోతున్నారు.

సంగతి తేలుస్తా...: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఒంగోలు సెయింట్‌ థెరెసా పాఠశాల వద్ద తెదేపా, వైకాపా వర్గాల మధ్య గొడవ తలెత్తింది. వైకాపా కార్యకర్తలు తెదేపా మద్దతుదారు కాకర్ల ఈశ్వర్‌తో పాటు ఇతరులపై దాడికి దిగారు. ఈశ్వర్‌ను పోలీసులు సమీపంలోని కల్యాణ మండపంలోకి తీసుకెళ్లారు. అదే సమయంలో ఒంగోలు వైకాపా ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి భారీ కాన్వాయ్‌తో అక్కడికి వచ్చారు. విధుల్లో ఉన్న ఒంగోలు వన్‌టౌన్‌ అప్పటి ఎస్సైపై మండిపడ్డారు. పోలింగ్‌ కేంద్రం నుంచి వైకాపా కార్యకర్తలను పంపించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నీ సంగతి తేలుస్తా.. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావంట’ అని బహిరంగంగా హెచ్చరించారు. ఈ వ్యవహారంలో తమకు అనుకూలంగా వ్యవహరించలేదంటూ ఒక సీఐని బదిలీ చేయించారు.

మిమ్మల్ని దామచర్ల పంపారా...: 2022 సంవత్సరంలో కొత్తపట్నం మండలం అల్లూరులో బాలినేని పర్యటించారు. అక్కడ ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలు చోటుచేసుకున్నాయి. ఈ విషయమై జిల్లా ఉన్నతాధికారులకు ఆ గ్రామస్థులు కొందరు ఫిర్యాదు చేశారు. బాలినేని పర్యటన సందర్భంగా ఓ మహిళతో పాటు కొందరు తెదేపా నాయకులు ఈ విషయమై మాజీమంత్రిని ప్రశ్నించారు. దీంతో ఆయన ఆగ్రహంతో ఊగిపోయారు. ‘మిమ్మల్ని దామచర్ల జనార్దన్‌ పంపించారా?’ అంటూ వేలు చూపుతూ దూషించారు.

ఒకటో పట్టణ పోలీస్‌ స్టేషన్‌ సమీపంలో వైకాపా నాయకులు, కార్యకర్తలతో శ్రీనివాసరెడ్డి తనయుడు ప్రణీత్‌ రెడ్డి

కొట్టి.. వీడియో చిత్రీకరించి...: ఒంగోలు నగరంలో బాలినేనికి అండగా ఉన్న ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన సోమిశెట్టి సుబ్బారావు గుప్తా ఓ కార్యక్రమంలో వైకాపా నాయకులపై విమర్శలు చేశారు. అంతే ఆ పార్టీలోని కొందరికి కోపమొచ్చింది. సొంత పార్టీకి చెందిన వాడనీ చూడకుండా గుప్తా ఇంటిపై బాలినేని అనుచరులు దాడి చేశారు. ప్రాణభయంతో గుంటూరుకు పారిపోయినా వదలకుండా వెంటాడారు. ఓ లాడ్జిలో తల దాచుకున్న గుప్తాను గుర్తించి కొట్టి మోకాళ్లపై కూర్చోబెట్టి క్షమాపణలు చెప్పించి వీడియో చిత్రీకరించారు.

సీనియర్‌ నేతగా ఏదీ సంయమనం...: రెండు రోజుల క్రితం ఒంగోలు సమతానగర్‌లో బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు కావ్యరెడ్డి ఎన్నికల ప్రచారంలో చోటుచేసుకున్న స్వల్ప వివాదం.. బాలినేని రంగప్రవేశంతో పతాక స్థాయికి చేరింది. వివాదం సద్దుమణిగేలా పోలీసులను పురమాయించి ఉంటే సరిపోయేది. గొడవలు లేకుండా శాంతియుతంగా ప్రచారం చేసుకోవాలని తన మద్దతుదారులు, వైకాపా శ్రేణులకు సూచించినా ఎంతో హూందాగా ఉండేది. ఈసీ ఆదేశాలకు అనుగుణంగా వాలంటీరును ప్రచారానికి దూరం పెట్టున్నా అసలు సమస్యే తలెత్తేది కాదు. వీటన్నింటికీ విరుద్ధంగా వ్యవహరించారు. విషయం కాస్తా చినికి చినికి గాలివానగా మారింది. సమతానగర్‌ నుంచి ఒంగోలు జీజీహెచ్‌ వరకు దాడులను తీసుకెళ్లారు. అర్ధరాత్రి సమయంలో రోగులకు ఇబ్బంది కలుగుతుందన్న విచక్షణ కూడా లేకుండా లోనికి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ వ్యవహార తీరు ఇప్పుడు తీవ్ర విమర్శలకు తావిస్తోంది.

స్టేషన్‌లోనే హంగామా...: దాడుల వ్యవహారంలో బాధితురాలు ప్రభావతి ఫిర్యాదు మేరకు బాలినేని కావ్య, గోలి తిరుపతిరావు, అట్ల కల్యాణ్‌రెడ్డి, గంటా రామానాయుడు, బాంబుల సాయి సహా ముగ్గురిపై తేలికపాటి సెక్షన్ల కిందే పోలీసులు కేసులే నమోదు చేశారు. అయినా బాలినేని సహించలేకపోయారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నా పట్టించుకోకుండా శుక్రవారం ఉదయం ఒంగోలు ఒకటో పట్టణ పోలీస్‌ స్టేషన్‌కు అనుచరులతో వెళ్లి దురుసుగా ప్రవర్తించారు. ఇప్పుడు ఈ పరిణమాలన్నీ జిల్లా వాసుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. నిబంధనల అమలుకు అడ్డు తగులుతూ దాదాగిరి ప్రదర్శించడంపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని