logo

చదువుల చెట్టుకు ‘జగన్‌’ చీడ

చదువుల విప్లవం తెచ్చామంటూ వైకాపా ప్రభుత్వం గొప్పలు చెబుతోంది. విద్యా ప్రమాణాలు మెరుగు పర్చామంటూ ఆ పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు వేదికలపై పదే పదే వల్లె వేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలు గుప్పిస్తూ ఊదరగొడుతున్నారు.

Published : 13 Apr 2024 02:31 IST

విద్యా ప్రమాణాల్లో లేదు ‘ప్రకాశం’
హైస్కూల్‌ ఇంటర్‌ ఫలితాలు దారుణం
కేజీబీవీల్లోనూ తీరు అంతంత మాత్రం
మాటల్లోనే వైకాపా పాలకుల ఆర్భాటం
న్యూస్‌టుడే, ఒంగోలు నగరం

చదువుల విప్లవం తెచ్చామంటూ వైకాపా ప్రభుత్వం గొప్పలు చెబుతోంది. విద్యా ప్రమాణాలు మెరుగు పర్చామంటూ ఆ పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు వేదికలపై పదే పదే వల్లె వేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలు గుప్పిస్తూ ఊదరగొడుతున్నారు. వాస్తవ పరిస్థితులు మాత్రం అవన్నీ అబద్ధాలని చెప్పకనే చెబుతున్నాయి. చదువులతోనే భవిష్యత్తు బాగుంటుందని నమ్మి ప్రభుత్వ విద్యాలయాల్లో తమ పిల్లలను చేర్చిన తల్లిదండ్రుల ఆశలు అడియాసలవుతున్నాయి. గడచిన అయిదేళ్లలో అనుసరించిన విధానాలే ఈ దయనీయ పరిస్థితిని సృష్టించాయని విద్యావేత్తలు విమర్శిస్తున్నారు. సకాలంలో అధ్యాపకుల నియామకాలు చేపట్టకపోవడం.. ప్రమాణాల మెరుగుకు కృషి చేయకపోవడం వంటి విధానాలతో ప్రభుత్వ విద్యాసంస్థలను జగన్‌ సర్కారు చావు దెబ్బ తీసిందని.. ధ్వంసరచనే తప్ప దార్శనికత తెలియకుంటే పరిణామాలు మరింత దిగజారుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అతిథి అధ్యాపకులే  దిక్కు...

జిల్లాలో 31 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలుండగా.. 107 మంది రెగ్యులర్‌, 230 మంది కాంట్రాక్టు అధ్యాపకులున్నారు. ఖాళీ పోస్టుల్లో ప్రత్యామ్నాయంగా అతిథి అధ్యాపకులతో నెట్టుకొస్తున్నారు. 2020-21, 2021-22లో పనిచేసినందుకు 32 మంది అతిథి అధ్యాపకులకు ఇంతవరకు వేతనాలు ఇవ్వలేదు. ప్రస్తుతం ఫిబ్రవరి నెల వేతనం విడుదల కాలేదు. ఈ పరిస్థితుల్లో వారు అంతంత మాత్రంగా బోధించి మమ అనిపించారు. ఇదిలా ఉంటే కళాశాలలో కీలకమైన ప్రిన్సిపల్‌ పోస్టులు ఎన్నికల నోటిఫికేషన్‌ ముందు వరకు భర్తీ చేయకపోవడం గమనార్హం.

హవ్వ.. డిసెంబర్‌లో  నియామకాలా..!

ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో జిల్లా చతికిల పడింది. వైకాపా ప్రభుత్వంలో కొత్తగా ఏర్పాటు చేసిన హైస్కూల్‌ ప్లస్‌ విద్యాలయాల్లో చదివిన విద్యార్థులు పూర్తిగా బోల్తా పడ్డారు. గ్రామీణ ప్రాంతాల బాలికలు ఉన్నత విద్యలో డ్రాప్‌ అవుట్‌ కాకుండా చెంతనే ఇంటర్‌ కోర్సులు అందుబాటులోకి తేవాలనే సదాశయంతో జిల్లాలో పది ఉన్నత పాఠశాలల్లో ఇంటర్‌ కోర్సులు ప్రారంభించారు. బోధకులను మాత్రం నియమించలేదు. ఇన్‌ సర్వీస్‌లో ఉన్న స్కూల్‌ అసిస్టెంట్లకు పీజీటీలుగా ఉద్యోగోన్నతులు కల్పించి భర్తీ చేయాలనే ప్రతిపాదన అమలులోకి వచ్చే సరికి పుణ్యకాలం పూర్తయింది. జూన్‌లో తరగతులు ప్రారంభమవగా డిసెంబర్‌ వరకు సిబ్బంది నియామకాలు చేపట్టలేదు. దీంతో కొన్ని చోట్ల విద్యార్థులు మానుకుని ప్రైవేట్‌ కళాశాలల్లో చేరారు. ఆర్థిక స్తోమత లేని పేదవర్గాల పిల్లలు మాత్రమే మిగిలారు. ఉన్నత పాఠశాలల్లో పదో తరగతి బోధించే వారితోనే దాదాపు ఆరు నెలలు కాలం వెల్లదీశారు. డిసెంబర్‌లో ఆ పోస్టులు భర్తీ చేశారు. ఆ ప్రభావం ఫలితాలపై చూపింది. హైస్కూల్‌ ప్లస్‌ విద్యాలయాల్లో జూనియర్‌ ఇంటర్‌లో 145 మంది పరీక్ష రాయగా కేవలం 38 మంది(26.2 శాతం) ఉత్తీర్ణులయ్యారు. సీనియర్‌ ఇంటర్‌లో 814 మందికి గాను 21 మంది(2.6 శాతం) ఉత్తీర్ణులయ్యారు.

బాలికా విద్యను నాశనం చేశారు..

డ్రాప్‌ అవుట్‌, అనాథ బాలికల కోసం నిర్వహిస్తున్న కస్తూర్బా బాలికా విద్యాలయాలు జిల్లాలో 28 ఉన్నాయి. వీటిలో ఇంటర్‌ ఉత్తీర్ణత గణనీయంగా పడిపోయింది. ఈ ఏడాది ప్రథమ సంవత్సరంలో 425 మంది పరీక్షలు రాయగా 159 మంది(37.4 శాతం)., ద్వితీయ సంవత్సరంలో 390 మందికి గాను 206 మంది(52.8 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఈ పరిస్థితికి ప్రధాన కారణం సకాలంలో బోధనా సిబ్బందిని నియమించకపోవడమే. అన్ని విద్యాలయాల్లో కలిపి 102 పీజీటీ పోస్టులు ఖాళీగా ఉండగా.. ఆగస్టులో కొన్ని పోస్టులు, నవంబర్‌లో మరికొన్ని భర్తీ చేశారు. దీనివల్ల సిలబస్‌ సకాలంలో పూర్తికాక విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఫలితంగా మొదటి సంవత్సరం ఫలితాలు దారుణంగా పడిపోయాయి.

రెండేళ్లుగా ఉచిత పాఠ్యపుస్తకాల్లేవు..

గత రెండేళ్లుగా ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు, మోడల్‌ స్కూల్స్‌, కేజీబీవీలు, హైస్కూల్‌ ప్లస్‌ విద్యాలయాలకు ఉచిత పాఠ్యప్తుకాలు నిలిపివేశారు. దీంతో ప్రైవేట్‌గా కొనుగోలు చేయక తప్పలేదు. అక్కడ చదివేవారంతా పేద విద్యార్థులే. ఒక్కో సెట్‌ పుస్తకాలు కొనాలంటే రూ.3 వేలు వరకు ఖర్చవుతుంది. దీంతో పేద విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. కొందరు పాత పుస్తకాలు సేకరించుకొని చదువు కొనసాగించారు.

ఆ నాలుగింటిలో ఉత్తీర్ణత సున్నా...

జిల్లాలోని మర్రిపూడి, ముండ్లమూరు, పెద్దారవీడు, వెలిగండ్ల కేజీబీవీల్లో జూనియర్‌ ఇంటర్‌ విద్యార్థులు ఒక్కరు కూడా ఉత్తీర్ణత సాధించలేదు. అత్యధికంగా తాళ్లూరులో 57.14 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. సీనియర్‌ ఇంటర్‌లో వెలిగండ్ల కేజీబీవీలో ఒక్కరూ ఉత్తీర్ణులైంది లేదు. మర్రిపూడిలో కేవలం 20 శాతం మంది గట్టెక్కారు. కురిచేడు, రాచర్ల కేజీబీవీల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని