logo

జగనూ.. తాగించి చిదిమేస్తావా?

ప్రభుత్వం మద్యపాన నిషేధం అమలు చేస్తామని ఒక పక్క చెబుతూనే వైకాపా ప్రభుత్వం విచ్చలవిడిగా అమ్మకాలకు అనుమతులు ఇచ్చింది. నియంత్రణ లేకపోవడంతో మద్యం అమ్మకాలకు అడ్డే లేకుండా పోయింది.

Updated : 19 Apr 2024 04:56 IST

నిత్య కలహాలతో విచ్ఛిన్నమవుతున్న కుటుంబాలు
యథేచ్ఛగా మద్యం అమ్మకాలు

ప్రభుత్వం మద్యపాన నిషేధం అమలు చేస్తామని ఒక పక్క చెబుతూనే వైకాపా ప్రభుత్వం విచ్చలవిడిగా అమ్మకాలకు అనుమతులు ఇచ్చింది. నియంత్రణ లేకపోవడంతో మద్యం అమ్మకాలకు అడ్డే లేకుండా పోయింది. చరవాణిలో ఒక్క సందేశమిస్తే నిమిషాల్లో మద్యం బాటిళ్లు ఇళ్ల వద్దకే చేరి పోతున్నాయి. పట్టణాలు, పల్లెలో సైతం ఇదే పరిస్థితులు నెలకొంది. దీంతో గ్రామాల్లో కుటుంబంలో నిత్యం కలహాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమై పోతున్నాయి.  నాణ్యత లేని మద్యం బ్రాండ్‌లను తాగి పలువురు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. మద్యానికి తోడుగా పశ్చిమ ప్రకాశాన్ని నాటుసారా దెబ్బతీస్తోంది.

 పొదిలి, పొదిలి గ్రామీణం, పెద్దదోర్నాల, మార్కాపురం నేర విభాగం, యర్రగొండపాలెం పట్టణం


నిలువరించే వారేరీ

పెద్దారవీడు మండలం కలనూతల గ్రామంలో రెండేళ్ల క్రీతం సారా తాగి పొలం వద్దకు వెళ్లిన ఓ వ్యక్తి దాహార్తిని తీర్చుకోలేక గొంతు ఎండిపోయి ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ కుంటుంబం అనాథ అయింది. మూడేళ్ల కిందట గుండంచర్ల గ్రామంలోనూ ఇదే తరహా ఘటనే చోటు చేసుకుంది. ముంపు గ్రామాల్లో సారా వ్యాపారం యథేచ్ఛగా సాగుతున్నా నిలువరించే నాథుడే కరువయ్యారు

వైద్య పరీక్షలో బయటపడ్డ నిజం :  అర్థవీడు మండలం పాపినేనిపల్లిలో 2021 జూన్‌లో ఓ వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఇరవై కుటుంబాలకు చెందిన వారి నుంచి రక్త నమూనాలు సేకరించారు. ఈ గ్రామంలో సారా ఎక్కువగా తాగడం వల్ల చాలా మంది కామెర్లు, లివర్‌ సంబంధిత వ్యాధుల బారిన పడినట్లు వైద్యులు గుర్తించారు.


కల్తీ మద్యం ఏరులై పారుతోంది

వైకాపా ప్రభుత్వ పాలనలో కల్తీ మద్యం అమ్మి ప్రజల ఆరోగ్యాన్ని చెడగొట్టారు. గతంలో నాణ్యమైన మద్యం అందుబాటులో ఉండేది. అయిదేళ్లలో రోజుకొక బ్రాండ్‌తో కొత్త మద్యాన్ని మార్కెట్‌లోకి తెచ్చారు. ధర పెంచి కల్తీ మద్యం అందించారు. దీంతో చాలా మంది అనారోగ్యం పాలయ్యారు. కొన్ని గ్రామాల్లో సారా విచ్చలవిడిగా అందుబాటులో ఉంది.      

 తెల్లయ్య, పెద్దదోర్నాల


సగం జీవితాలు తెల్లారి పోతున్నాయి

సారా తాగడం వల్ల చెంచుల జీవితాలు సగంలోనే తెల్లారిపోతున్నాయి. విచ్చలవిడిగా సారా కాస్తున్న వారిని పట్టుకొని కఠిన శిక్షలు విధించాలి. కొన్ని గిరిజన గూడేల్లో సారా కాయడం అమ్మడం జరుగుతోంది. కొందరికి ఇది వ్యాపారం మారింది. మా చెంచులు సారా తాగడం వల్ల ఎంతో మంది చనిపోయారు. ఇప్పటికైనా సారా, గంజాయిని అరికట్టాలి.

నిమ్మల ఈదన్న, గిరిజన నాయకుడు, పాలుట్ల


సారా తాగడం మాన్పించాలి

గిరిజనుల జీవితాలు మారాలంటే సారా తాగడం మాన్పించాలి. ఇందుకు అధికారులు చొరవ చూపాలి. సారా తాగందే చెంచులు జీవించలేకుండా ఉన్నారు. నల్లమల గూడేల్లో సారా విచ్చల విడిగా కాస్తున్నారు. అధికారులు నిలువరించ లేకపోతున్నారు. సారాను పూర్తిగా రూపు మాపితేనే గిరిజనుల జీవితాలను బాగుపడతాయి..

బొజ్జ అంకారావు,  గిరిజన నాయకుడు, పుల్లలచెరువు చెంచుగూడెం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని