logo

ముక్కలవుతున్న ఫ్యాను రెక్కలు

ఫ్యాను రెక్కలు ముక్కలు చెక్కలవుతున్నాయి. పార్టీ శ్రేణులు కకావికలమవుతున్నాయి. జిల్లా కేంద్రంలో ఇప్పటి వరకు పార్టీకి దన్నుగా ఉన్న రెండు ప్రధాన సామాజిక వర్గాలకు చెందిన కీలక నాయకులు గుడ్‌బై చెప్పారు.

Updated : 21 Apr 2024 09:05 IST

పార్టీని వీడుతున్న కీలక నేతలు
మాజీ మంత్రి తీరుపై తీవ్ర విమర్శలు

ఫ్యాను రెక్కలు ముక్కలు చెక్కలవుతున్నాయి. పార్టీ శ్రేణులు కకావికలమవుతున్నాయి. జిల్లా కేంద్రంలో ఇప్పటి వరకు పార్టీకి దన్నుగా ఉన్న రెండు ప్రధాన సామాజిక వర్గాలకు చెందిన కీలక నాయకులు గుడ్‌బై చెప్పారు. నిన్నామొన్నటి వరకు ఆ శిబిరంలో కీలకంగా వ్యవహరించిన నేతలు పార్టీని వీడి విపక్ష తెదేపా గూటిలోకి చేరుతున్నారు. అంతటితో ఆగటం లేదు. తీవ్ర విమర్శలతో విరుచుకు పడుతున్నారు. తాజా పరిణామాలు మండు వేసవిలో అధికార వైకాపాకు ఉక్కపోతగా పరిణమించాయి. ప్రత్యేకించి ఒంగోలు నియోజకవర్గంలో ఆ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారుస్తున్నాయి. 

న్యూస్‌టుడే, ఒంగోలు

ఆ సామాజికవర్గాలు దూరం...: ఒంగోలు నియోజకవర్గంలో అధికార పార్టీకి పెట్టని కోటలా నిలిచిన ప్రధాన సామాజిక వర్గాలు ఎన్నికలు సమీపించే కొద్దీ వేగంగా దూరమవుతున్నాయి. ప్రధానంగా ఆర్యవైశ్య, కాపు సామాజిక వర్గాల నుంచి పెద్దసంఖ్యలో తెదేపాలోకి వలసలు పెరుగుతున్నాయి. ఒంగోలు ప్రాంతంలో తమ సామాజిక వర్గానికి చెందిన భూములను బలవంతంగా ఆక్రమించుకుని తమపై దౌర్జన్యపూరితంగా వ్యవహరిస్తున్నారంటూ ఒక వర్గం అధికార వైకాపాపై గుర్రుగా ఉంది.

  • తొలి నుంచీ మాజీ మంత్రి, బాలినేని శ్రీనివాసరెడ్డికి దన్నుగా నిలిచిన నల్లమల్లి బాలు పెద్దసంఖ్యలో తన అనుచరులతో తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. ‌
  • బాలినేని అనుచరుల చేతిలో దాడికి గురైన సోమిశెట్టి సుబ్బారావు గుప్తా తెదేపాలో చేరనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ‌్ర కాపు సామాజికవర్గం నుంచి ఎన్‌ఎస్‌యూఐ, యువజన కాంగ్రెస్‌, కాంగ్రెస్‌, అనంతరం వైకాపాలో క్రియాశీలకంగా పనిచేసిన దమ్మాలపాటి రమేష్‌, కోలా ప్రభాకర్‌ తదితరులు తెదేపా గూటికి చేరారు.
  • గత ఎన్నికల్లో వైకాపా నుంచి క్రియాశీలకంగా పనిచేసిన ఏఎంసీ మాజీ ఛైర్మన్‌ సింగరాజు రాంబాబు పార్టీకి దూరంగా ఉన్నారు.
  • 37వ డివిజన్‌ కార్పొరేటర్‌ కూడా పార్టీని వీడి షాక్‌ ఇచ్చారు. ‌
  • తాజాగా 35వ డివిజన్‌ పార్టీ అధ్యక్షుడు గంజం రంగనాథ్‌, బ్రాహ్మణ సేవా సమితి జిల్లా కార్యదర్శి ముక్తినూతలపాటి వాసు తెదేపా చెంతన చేరారు.

‘అధికార’ శిబిరంలో నైరాశ్యం...

కీలక నాయకులు ఒక్కొక్కరుగా చేజారి పోతున్నారు. మరికొన్ని రోజుల్లోనే కొందరు కార్పొరేటర్లు కూడా పార్టీని వీడి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారనే ప్రచారం అధికార పార్టీలో గుబులు రేపుతోంది. పార్టీ నుంచి బయటకు వెళ్లిన నాయకులు ఘాటు విమర్శలు, తీవ్ర ఆరోపణలు గుప్పిస్తుంటే వాటిని ధీటుగా ఎదుర్కొని తిప్పికొట్టే సామర్థ్యం ఉన్న నేతలు వైకాపాలో కరవయ్యారు. పోలింగ్‌ తేదీ తరముకొస్తున్న నేపథ్యంలో ఒంగోలు నియోజకవర్గంలో అధికార వైకాపా పరిస్థితి అగమ్యగోచరంగా మారింది

వరసిద్ధి వినాయకుడిపై ఒట్టు...

కాంగ్రెస్‌, వైకాపాలో సుదీర్ఘకాలం పనిచేసి, గత కొన్నాళ్లుగా మార్కాపురం కేంద్రంగా సిటింగ్‌ ఎమ్మెల్యే కుందురు నాగార్జున రెడ్డి కుటుంబంపై తీవ్ర అవినీతి ఆరోపణలు చేసిన పెద్దిరెడ్డి సూర్యప్రకాష్‌రెడ్డి ఇటీవల తెదేపాలో చేరారు. పార్టీలో చేరిన నాటి నుంచి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని లక్ష్యంగా చేసుకుని తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. తాజాగా తన విమర్శలకు మరింత పదును పెట్టారు. శ్రీనివాసరెడ్డి, ఆయన తనయుడు ప్రణీత్‌రెడ్డి, వియ్యంకుడు కుండా భాస్కర్‌రెడ్డి, ప్రధాన అనుచరుడు, కడప జిల్లా కమలాపురానికి చెందిన రఘురెడ్డిలపై ఆరోపణలు గుప్పించారు. గ్రానైట్‌ అక్రమ క్వారీయింగ్‌, గనుల్లో వాటాలు, లీజుల పునరుద్ధరణ పేరిట వసూళ్లు, రవాణా శాఖకు చెల్లించాల్సిన పన్నులు ఎగ్గొట్టారని, అక్రమ వసూళ్లతో పాటు భూకబ్జాలకు పాల్పడ్డారని దుయ్యబట్టారు. ఈ అక్రమాలపై తాను కాణిపాకం వరసిద్ది వినాయక స్వామి ఆలయంలో ప్రమాణం చేస్తానని, బాలినేని కుటుంబం తాము అక్రమాలకు పాల్పడలేదని ప్రమాణం చేయగలరా అని సవాల్‌ విసిరారు. ఇరవై ఏడేళ్లపాటు కాంగ్రెస్‌, వైకాపాలో బాలినేని వెంట నడిచిన కీలక నాయకుడే అవినీతి ఆరోపణలు చేయటం అధికార పార్టీ శిబిరానికి ఆందోళన కలిగిస్తోంది..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని