logo

తాగు.. తూలు.. జైకొట్టు

‘బాబ్బాబూ.. నామినేషన్‌ వేస్తున్నాం. కాస్తంత అక్కడి వరకు వచ్చిపోండి. ఊరకనే కాదు అయిదొందల నోటు, క్వార్టర్‌ సీసా ఇస్తాం. పసందైన బిర్యానీ కూడా పెట్టిస్తాం. మందు తాగి మా పార్టీ జెండా పట్టుకుని జేజేలు కొడితే చాలు’ ఇదీ ప్రస్తుతం నామినేషన్ల సందర్భంగా వైకాపా అభ్యర్థుల ప్రదర్శనల్లో నాయకుల బతిమలాటలు.

Published : 23 Apr 2024 04:56 IST

క్వార్టర్‌ సీసా.. రూ. 500 నోటు
 అరువు జనాలతో జయ జయ ధ్వానాలు
 ఇదీ వైకాపా ప్రలోభాల బల ప్రదర్శనల తీరు

టంగుటూరు- ఒంగోలు రోడ్డులోని మద్యం దుకాణం వద్ద వైకాపా జెండాలతో కార్యకర్తలు

ఒంగోలు, న్యూస్‌టుడే: ‘బాబ్బాబూ.. నామినేషన్‌ వేస్తున్నాం. కాస్తంత అక్కడి వరకు వచ్చిపోండి. ఊరకనే కాదు అయిదొందల నోటు, క్వార్టర్‌ సీసా ఇస్తాం. పసందైన బిర్యానీ కూడా పెట్టిస్తాం. మందు తాగి మా పార్టీ జెండా పట్టుకుని జేజేలు కొడితే చాలు’ ఇదీ ప్రస్తుతం నామినేషన్ల సందర్భంగా వైకాపా అభ్యర్థుల ప్రదర్శనల్లో నాయకుల బతిమలాటలు. తాము ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో స్పందన ఉండటం లేదు. పొరుగు ప్రాంతాల నుంచి జనాలను అరువు తీసుకొచ్చి బలప్రదర్శన అంటూ చూపుకోవాల్సిన దుస్థితి. మద్యం మత్తులో కార్యకర్తలు జయ జయ ధ్వానాలు పలుకుతూ, పూలు జల్లుతుంటే ప్రత్యేకంగా అలంకరించిన వాహనాల్లో అభ్యర్థులు ఊరేగుతున్న తీరు ప్రజలను విస్తుగొలుపుతోంది.

ఒంగోలు: నగదు పంపిణీకి నామినేషన్‌ ర్యాలీకి వచ్చిన వారి పేర్లు నమోదు చేస్తున్న దృశ్యం

 డబ్బులు వెదజల్లి, మద్యం మత్తులో ముంచి...: దర్శి, గిద్దలూరు వైకాపా అభ్యర్థులు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, కుందురు నాగార్జునరెడ్డి ఈ నెల 18నే నామపత్రాలు దాఖలు చేశారు. ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సాదాసీదాగా అధికారులకు అందించారు. ఒంగోలు, గిద్దలూరు, కొండపి నియోజకవర్గాల అభ్యర్థులు బాలినేని శ్రీనివాసరెడ్డి, అన్నా వెంకట రాంబాబు, ఆదిమూలపు సురేష్‌ తమ నియోజకవర్గ కేంద్రాల్లో సోమవారం నామపత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా అరువు జనాలతో బల ప్రదర్శనలు నిర్వహించారు. సొంత పార్టీ కార్యకర్తలు కూడా స్వచ్ఛందంగా హాజరయ్యే పరిస్థితి లేదు. దీనికితోడు ఆయా నియోజకవర్గాల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. దీంతో పొరుగు ప్రాంతాల వారితోనైనా బలప్రదర్శన చేయాల్సిన పరిస్థితి. విధి లేని పరిస్థితుల్లో విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంపిణీ చేశారు అధికార పార్టీ నేతలు. యువ కార్యకర్తలకు వాహనాలకు పెట్రోల్‌ స్లిప్పులు కేటాయించారు. దీంతో ఆయా ప్రాంతాల్లోని పెట్రోల్‌ బంకులు, మద్యం దుకాణాలు కిటకిటలాడుతూ కనిపించాయి. ప్రదర్శనల్లో మందుబాబులు మత్తులో తూలుతూ కనిపించారు. మార్కాపురంలో ఏకంగా మున్సిపల్‌ కౌన్సిలర్‌ ఒకరు ప్రజలకు బహిరంగంగానే డబ్బులు పంచుతూ వీడియోలకు చిక్కారు.

ట్రంగుటూరు- ఒంగోలు రోడ్డులోని బంకు వద్ద ద్విచక్ర వాహనాలతో పెట్రోల్‌ కోసం వేచి ఉన్న యువకులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని