logo

అయిదేళ్లు గుడ్డి గుర్రాల పళ్లు తోమారా!

‘అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో వెలిగొండ ప్రాజెక్టు పూర్తిచేస్తామని చెప్పిన జగన్‌.. అయిదేళ్లలో ఉత్తుత్తి పనులు చేసి చివరిలో శిలాఫలకాలు వేశారు. రాజశేఖర్‌ రెడ్డి నిర్మించిన గుండ్లకమ్మ ప్రాజెక్టు రెండు గేట్లు కొట్టుకుపోయి రెండేళ్లవుతున్నా కనీసం మరమ్మతులు చేయించలేని జగన్‌ వైఎస్సార్‌ వారసుడు ఎలా అవుతారు’... అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు.

Updated : 23 Apr 2024 05:35 IST

 ఉత్తుత్తి పనులు.. గేట్లూ పెట్టింది లేదు
విధ్వంసకులు వైఎస్‌ వారసులు కానేకాదు
 వైకాపా ‘చెత్త’ అభ్యర్థులను ఆదరించొద్దు
 న్యాయయాత్ర సభల్లో వైఎస్‌.షర్మిల విమర్శలు

ప్రజలతో కరచాలనం చేస్తున్న పీసీసీ అధ్యక్షురాలు షర్మిల

 ఈనాడు, ఒంగోలు, యర్రగొండపాలెం, చీమకుర్తి- న్యూస్‌టుడే: ‘అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో వెలిగొండ ప్రాజెక్టు పూర్తిచేస్తామని చెప్పిన జగన్‌.. అయిదేళ్లలో ఉత్తుత్తి పనులు చేసి చివరిలో శిలాఫలకాలు వేశారు. రాజశేఖర్‌ రెడ్డి నిర్మించిన గుండ్లకమ్మ ప్రాజెక్టు రెండు గేట్లు కొట్టుకుపోయి రెండేళ్లవుతున్నా కనీసం మరమ్మతులు చేయించలేని జగన్‌ వైఎస్సార్‌ వారసుడు ఎలా అవుతారు’... అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు. ఏపీ న్యాయయాత్రలో భాగంగా జిల్లాలోని పెద్దదోర్నాల, యర్రగొండపాలెం, చీమకుర్తిలో పర్యటించారు. ఆయాచోట్ల ఏర్పాటు చేసిన సభల్లో మాట్లాడారు. ఆదిమూలపు సురేష్‌ నియోజకవర్గాన్ని గాలికొదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదరించిన ప్రజల కోసం కనీసం రోడ్లు కూడా వేయలేదన్నారు. అందుకే పక్క నియోజకవర్గానికి పంపించారనీ.. ఇక్కడ పనికిరాని చెత్త మరెక్కడైనా పనికిరాదని వ్యాఖ్యానించారు. మంత్రిగా ఉండి వెలిగొండ ప్రాజెక్టు నిర్మాసితులకు పరిహారం ఇప్పించలేని వ్యక్తి చిత్తుగా ఓడిపోతాడని తెలిసే పక్కకు తరమేశారన్నారు. బినామీల పేర్లతో కాంట్రాక్టులు చేసి అవినీతిలో కూరుకుపోయిన వ్యక్తిని ఎక్కడా ఆదరించవద్దని కోరారు. ప్రభుత్వం అమ్ముతున్న మద్యం విక్రయాల్లో లెక్కలు చూపడం లేదని, ఆ ఆదాయం ఎక్కడకు పోతోందో తెలియడం లేదన్నారు. రాష్ట్రాన్ని డ్రగ్స్‌కు అడ్డాగా మార్చారని, కంటెయినర్లతో తెస్తున్నారని మండిపడ్డారు. అయిదేళ్ల జగనన్న పాలనంతా మట్టి చెంబు ఇచ్చి వెండి చెంబు లాక్కోవడంలా సాగిందన్నారు. ఆర్టీసీ ఛార్జీలు, విద్యుత్‌ ఛార్జీలు పెంచి ప్రజల నడ్డి విరిచారన్నారు. గతంలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా వైకాపా వారు అయిదేళ్లుగా గుడ్డి గుర్రాలకు పళ్లు తోముతున్నారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో వైకాపా, తెదేపా, భాజపాల మధ్య ముక్కోణపు ప్రేమ కథ నడుస్తోందన్నారు. సంతనూతలపాడు ఎమ్మెల్యే కమీషన్లలో కింగ్‌ అట, ఇక్కడ దోచుకున్నారనే సీటు ఇవ్వలేదట కదా అని షర్మిల అన్నారు. ‘ఆయా పార్టీల వారు ఈసారి ఎంత డబ్బు ఇచ్చినా తీసుకోండి. అదంతా మీదగ్గర దోచుకున్న డబ్బే. ఓటు మాత్రం కాంగ్రెస్‌ పార్టీకి వేయండి’ అని కోరారు. కాంగ్రెస్‌ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని, అధికారంలోకి వస్తే పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని పార్టీ పెద్దలతో ముందుగానే హామీ తీసుకుని వచ్చానని షర్మిల తెలిపారు. ప్రతి పేద మహిళకు రూ.లక్ష ఆర్థిక సాయం, ఇల్లు లేని కుటుంబాలకు రూ.5 లక్షలతో నిర్మించి ఇస్తామని, మొదటి సంతకం 2.25 లక్షల ఉద్యోగాలు కల్పించడంపై పెడతామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ ఒంగోలు ఎంపీ అభ్యర్థి ఈదా సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. చిత్తూరు జిల్లాలో దోపిడీలు, దౌర్జన్యాలు, గిరిజనులను బెదిరించి పొలాలు, అడవులు ఆక్రమించిన వ్యక్తిని తెచ్చి వైకాపా వారు ఇక్కడ ఎంపీ టికెట్‌ ఇచ్చిందని ఆరోపించారు. బాలినేని, వైవీ కుటుంబాల స్వార్థంతోనే మార్కాపురం జిల్లా కాలేదని విమర్శించారు. సొంత నియోజకవర్గానికి న్యాయం చేయలేని వ్యక్తి కొండపికి పలాయనం చిత్తగించాడని ఎద్దేవా చేశారు. ఆయా సభల్లో కాంగ్రెస్‌ పార్టీ వై.పాలెం, సంతనూతలపాడు ఎమ్మెల్యే అభ్యర్థులు బూదాల అజితారావు, పాపర్తి విజేష్‌ రాజు, బాపట్ల పార్లమెంట్‌ నియోజకవర్గ అభ్యర్థి జేడీ.శీలం, సీపీఎం, సీపీఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

చీమకుర్తిలో నిర్వహించిన రోడ్డు షోకు హాజరైన జనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని