logo

ఉత్సవ విగ్రహాల్లా మార్చేశావ్‌.. జగన్‌

గత ప్రభుత్వ హాయంలో సర్పంచులు అంటే ఎంతో గౌరవంగా ఉండేది. చెక్‌ పవర్‌తో నిధులను ఖర్చు చేసి ప్రజా సమస్యలను పరిష్కరించేవారు.

Published : 24 Apr 2024 03:51 IST

కేంద్ర ప్రభుత్వ నిధులను లాగేసుకున్నావు
వైకాపా సర్కార్‌పై మండిపడుతున్న సర్పంచులు
నేడు జాతీయ పంచాయతీ రాజ్‌ దినోత్సవం

గత ప్రభుత్వ హాయంలో సర్పంచులు అంటే ఎంతో గౌరవంగా ఉండేది. చెక్‌ పవర్‌తో నిధులను ఖర్చు చేసి ప్రజా సమస్యలను పరిష్కరించేవారు. వైకాపా సర్కార్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత సర్పంచులకు పవర్‌ లేకుండా చేశారు. పంచాయతీల్లో ఉన్న నిధులను ప్రభుత్వం ఇష్టానుసారంగా వారి అనుమతి లేకుండా తీసుకొని వివిధ ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలు, పంచాయతీల్లో వివిధ నిర్మాణాలకు మళ్లించి పంచాయతీల్లో ఒక్క చిల్లి గవ్వ కూడా లేకుండా చేసి  సర్పంచులను ఖాళీ గా కూర్చీల్లో కూర్చొబెట్టారు. ఒక్కొక్కపంచాయతీలో సర్పంచులకు తెలియకుండా రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు కూడా వైకాపా సర్కార్‌ తీసుకొని ఇతర వాటికి మళ్లించింది. సర్పంచులు ఆందోళనలు, నిరసనలు చేసినా పట్టించుకోలేదు.

మార్కాపురం, గిద్దలూరు పట్టణం,  త్రిపురాంతకం, కొనకనమిట్ల, న్యూస్‌టుడే


చిన్న సమస్యను తీర్చలేకపోయాం  

పంచాయతీలో చిన్న సమస్యను పరిష్కరించ లేకపోయాం. మా పంచాయతీ పరిధిలో సుమారు రూ.30లక్షల పంచాయతీ నిధులను ప్రభుత్వమే తీసేసుకోవడంతో చిన్న పాటి పనులు చేపట్టేందుకు నిధులు లేక కాలం వెళ్లబుచ్చాల్సిన పరిస్థితి దాపురించింది.

కర్నాటి రామసుబ్బారెడ్డి, సర్పంచి, కొమ్మునూరు

అప్పుల పాలయ్యాం

గ్రామాల్లో ఉత్సవ విగ్రహాలుగా మారిపోయాం. గ్రామంలో రోడ్డు వేయడం కాదు కదా.. నీటిని అందించలేని దుస్థితిలో ఉన్నాం. అప్పు చేసి గ్రామాల్లో ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా.. వాటికి నిధులు రాక అప్పుల పాలయ్యాం. 

పాతకోటి వెంకట సుబ్బారావు, ఉప సర్పంచి, పాత అన్నసముద్రం, త్రిపురాంతకం మండలం.

ఆర్ధిక సంఘం నిధులు పక్కదారి..

గ్రామాల్లోని ప్రజల సమస్యలను పరిష్కరించలేక, వారికి సమాధానాలు చెప్పలేక సతమతమవుతున్నాం. గ్రామాల్లో వాటర్‌ ట్యాంకర్‌ల బిల్లులకు ప్రత్యేక నిధులు కేటాయించాల్సి ఉంది. అవాటికి కూడా పంచాయతీ నిధుల నుంచి చెల్లించాలంటూ ఆదేశాలు ఇచ్చారు.

రావిళ్ల సుధాకర్‌, సర్పంచ్‌, మిరియంపల్లి, త్రిపురాంతకం మండలం

హక్కులను కాలరాశారు

మా హక్కులు కాలరాస్తున్నారు. అధికార పార్టీ నాయకులు సర్పంచులకు తెలియకుండా పనులు చేస్తూ వాటి బిల్లులు చేయాలని మాపై అనేక సార్లు ఒత్తిడి చేశారు. పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు ఇవ్వలేకపోతున్నాం. వారికి ఏడాది నుంచి ఇవ్వాల్సి ఉంది.

 కె.భాగ్యమ్మ, సర్పంచి, రాయవరం

పనులకు పైసలు లేవు

తాగునీరు, ఇతర పనులు చేసి రూ.7లక్షలు ఖర్చు చేసి రెండు సంవత్సరాలైంది. నిధులు మంజూరు చేయకపోవడంతో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. నిధులు లేక ఏం చేయలేకపోతున్నాం. సిమెంట్‌ రహదారులు, తాగునీటి, ఇతర సమస్యలు చేయాలనుకున్నాం.

వెంకటనారాయణ , సర్పంచి, వింజవర్తిపాడు, కొనకనమిట్ల మండలం

ప్రగతి శూన్యం

మూడేళ్లుగా ప్రభుత్వం పైసా కేటాయించలేదు. నిధుల్లేక గ్రామాల్లో అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది.  ప్రభుత్వం గతంలో తీసుకున్న నిధులు అన్ని వెంటనే పంచాయతీల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని కోరుతున్నాను. నిధులు ఉంటే ప్రజా సమస్యలను పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది.

గోగిరెడ్డి పార్వతమ్మ, సర్పంచి, నికరంపల్లి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని