logo

అరవీర ‘రంగు’ మార్తాండ

మురుగు కాలువలు లేవు. ఉన్న వాటినైనా శుభ్రం చేయించడానికి సొమ్ముల్లేవు. ఎప్పుడో ఏర్పాటు చేసిన తాగునీటి పైపులైన్లే దిక్కు. పగిలిపోతే మరమ్మతులకు పైసల్లేవు.

Published : 24 Apr 2024 04:13 IST

కనిపించిన కట్టడాలకు సున్నాలు
శ్మశానాలనూ వదలకుండా సోకులు
వైకాపా ప్రభుత్వ వికృత విధానాలు
గ్రామ స్వరాజ్యానికి సమాధి రాళ్లు


రూ.11.50 కోట్లు వృథా 

మురుగు కాలువలు లేవు. ఉన్న వాటినైనా శుభ్రం చేయించడానికి సొమ్ముల్లేవు. ఎప్పుడో ఏర్పాటు చేసిన తాగునీటి పైపులైన్లే దిక్కు. పగిలిపోతే మరమ్మతులకు పైసల్లేవు. ఎక్కడ చూసినా ఛిద్రమైన, గోతులు ఏర్పడిన రహదారులు. తట్టెడు మట్టి పోసేందుకు చేతులురావు. రహదారుల వెంట చెత్త తొలగింపు మొదలు.. వీధి దీపాల నిర్వహణ వరకు ప్రతిదీ సమస్యే. బ్లీచింగ్‌, ఫాగింగ్‌కూ నాలుగు రూపాయల కోసం వెతుక్కోవాల్సిన దుస్థితి. గ్రామ స్వరాజ్యానికి వైకాపా ప్రభుత్వం సమాధి కట్టిందనేందుకు ఇవో నిదర్శనాలు. చెప్పుకొనేందుకు చేసిందేమీ లేక కనిపించిన కట్టడాలన్నింటికీ పార్టీ రంగులతో సున్నమేసి సోకులద్దే ప్రయత్నం చేశారు. ఉన్న కొద్దిపాటి నిధులను వృథాగా ఖర్చు పెట్టారు. ఈ వికృత విధానంపై న్యాయస్థానం కన్నెర్ర చేసింది. మళ్లీ వాటిని తొలగించాల్సి వచ్చింది. అందుకు మరోసారి రంగులేశారు. ఈ అనాలోచిత వికృత విధానం ఫలితంగా జిల్లాలో రూ. 11.50 కోట్ల ప్రజాధనాన్ని బూడిదలో పోసిన పన్నీరులా చేశారు వైకాపా పాలకులు.

న్యూస్‌టుడే, ఒంగోలు గ్రామీణం


మొదటిగా రూ. 8 కోట్లు...: జిల్లాలో మొత్తం 719 సచివాలయాలున్నాయి. అనుబంధంగా ఆర్బీకేలు, విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లకు పార్టీ రంగులద్దారు. ఇదే అదునుగా పట్టణం, గ్రామం అనే తేడా లేకుండా ప్రభుత్వ భవనాలకు వైకాపా రంగులు వేయించారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన పంచాయతీ భవనాలతో పాటు, చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు, వాటర్‌ట్యాంక్‌లు, చివరికి రహదారి డివైడర్లనూ వదలకుండా రంగులద్దారు. మరికొన్ని చోట్ల శ్మశానాలు, చేపల మార్కెట్‌ తదితర భవనాలకు కూడా వేశారు. ఆర్బీకే, విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌, డంపింగ్‌ యార్డులకు ఒక్కోదానికి ప్రభుత్వమే రూ.20 వేలు చొప్పున ఇవ్వగా, గ్రామ సచివాలయాలు, వాటర్‌ ట్యాంక్‌లకు చదరపు అడుగుల మేరకు ఒక్కోదానికి గ్రామ పంచాయతీ నిధుల నుంచి రూ.20 నుంచి రూ.50 వేల వరకు ఖర్చు చేశారు. మొదటి విడత వైకాపా రంగులు వేసేందుకు సరాసరిన ఒక్కో పంచాయతీకి రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు వెచ్చించారు. తద్వారా జిల్లా వ్యాప్తంగా రూ.8 కోట్ల మేర నిధులు ఖర్చు చేశారు.

హైకోర్టు ఆదేశాలతో మళ్లీ...

గ్రామాల్లోని సచివాలయాలతో పాటు, ఇతర ప్రభుత్వ భవనాలకు ఓ రాజకీయ పార్టీకి చెందిన వైకాపా రంగులు వేయడం రాజ్యాంగ విరుద్ధమంటూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో తక్షణమే పార్టీ రంగులు తొలగించాలంటూ కోర్టు ఆదేశాలిచ్చింది. దీంతో వాటిని మళ్లీ మార్చేశారు. కనీసం తెల్ల సున్నం వేసేందుకు కూడా పంచాయతీ ఖాతాలో నిధులు లేకపోవడంతో కొన్ని గ్రామాల్లో కార్యదర్శులు సొంత డబ్బులు వెచ్చించాల్సి వచ్చింది. మరికొందరు మూడు రంగుల్లో ఒకటి మాత్రమే తొలగించి మమ అనిపించారు. రెండో విడత కింద పంచాయతీకి సరాసరిన రూ.50 వేలు చొప్పున రూ.3.50 కోట్ల వరకు ఖర్చు చేశారు. జిల్లా అంతటా రెండు సార్లు రంగులు వేసేందుకు సుమారు రూ.11.50 కోట్ల వరకు ప్రభుత్వ నిధులు ఖర్చు చేశారు.

వైకాపా రంగులతో ఒంగోలు మండలం సర్వేరెడ్డిపాలెం రైతు భరోసా కేంద్రం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని