logo

ఇది కాదా.. జగన్నాటకం!

అబద్ధపు హామీలు గుప్పించడం.. మాయమాటలు చెప్పడంలో సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డిని మించినవారుండరు. అయిదేళ్లు పట్టించుకోకుండా ఉండటం.

Published : 24 Apr 2024 04:18 IST

ఎన్నికల ముంగిట శిలాఫలకం
లోయ గ్రామాలకు సీఎం వంచన

కొత్తూరు వద్ద ఎత్తిపోతల శిలాఫలకాలు ప్రారంభిస్తున్న సీఎం జగన్‌(పాత చిత్రం)

అర్థవీడు, న్యూస్‌టుడే: అబద్ధపు హామీలు గుప్పించడం.. మాయమాటలు చెప్పడంలో సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డిని మించినవారుండరు. అయిదేళ్లు పట్టించుకోకుండా ఉండటం.. ఎన్నికల ముంగిట మాత్రం శిలాఫలకం వేసి నాటకానికి తెర లేపడం ఆయనకే చెల్లు. ఇందుకు అర్థవీడు మండలంలోని కాకర్ల ఆనకట్టే నిదర్శనం. మండలానికి సాగు నీటి వనరులు లేవు. వర్షాధారం, భూగర్భ జలాలతోనే రైతులు పంటలు సాగు చేస్తుంటారు. మండల పరిధిలో 32 గ్రామాలున్నాయి. అందులో సుమారు 37 వేల మంది జనాభా నివసిస్తున్నారు. ఏడు లక్షల ఎకరాల సాగు భూమి ఉంది. వెలిగొండ జలాలను లోయ గ్రామాలకు పారిస్తే ఈ ప్రాంతం సస్యశామలం అవుతుంది. ఇదే తన అజెండా గతంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా ఉన్న అన్నా రాంబాబు వెలిగొండ జలాల ఎత్తిపోతల పథకాల సాధన పేరుతో పాదయాత్ర కూడా చేశారు. ఆ తర్వాత ఆయన 2019లో వైకాపా తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. తాజాగా మార్కాపురం నియోజకవర్గం నుంచి పోటీ బరిలో నిలిచారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ముందు ఎత్తిపోతల పథకానికి సంబంధించిన పరిపాలనా ఆమోదంతో రూ.51.16 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ఇటీవల వైకాపా ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఇందుకు సంబంధించిన రెండు శిలాఫలకాలను దోర్నాల మండలం కొత్తూరులోని వెలిగొండ సొరంగం వద్ద సీఎం జగన్‌ ఇటీవల హడావుడిగా ప్రారంభించి వెళ్లారు. ఎత్తిపోతల పథకం అంశాన్ని తెర పైకి తెచ్చిన ఎమ్మెల్యే అన్నా రాంబాబు అయిదేళ్లలో చేసిందేమీ లేక.. గిద్దలూరు నియోజకవర్గాన్ని వదలి మార్కాపురానికి రాజకీయ బదిలీపై వెళ్లారు. ఎన్నికల ముంగిట జగన్‌ తన మార్కు నాటకానికి తెర లేపారు. ఈ పరిణామాలతో జనం సమస్యలు అధికార పార్టీకి కేవలం ఓట్లుగా మాత్రమే కనిపిస్తున్నాయని మండల వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శిలాఫలకాలను చూపుతూ లోయ గ్రామాలను మరోమారు మోసం చేసేందుకు ఆడుతున్న నాటకంపై మండిపడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని