logo

అన‘కొండలు’ తిన్న మన్ను.. రూ.860 కోట్లు

తవ్వుకు‘న్నోళ్ల’కు తవ్వుకున్నంత.. మేసి‘నోళ్ల’కు మేసినంత. జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జిల్లాలో సహజ వనరుల విధ్వంసం యథేచ్ఛగా సాగింది. నేతల ముసుగులో ఉన్న గుంట నక్కలు బరితెగించాయి.

Updated : 24 Apr 2024 05:22 IST

ఊరూరా ‘గుంత’ నక్కల బరితెగింపు
వాగులు, వంకలు, చెరువుల్లో తవ్వకాలు
వనరుల లూటీతో భావితరాలకు భద్రత కరవు

తవ్వుకు‘న్నోళ్ల’కు తవ్వుకున్నంత.. మేసి‘నోళ్ల’కు మేసినంత. జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జిల్లాలో సహజ వనరుల విధ్వంసం యథేచ్ఛగా సాగింది. నేతల ముసుగులో ఉన్న గుంట నక్కలు బరితెగించాయి. స్వార్థంతో ఊరూరా గోతులు తీశాయి. మన్ను తినడం మొదలు పెట్టాయి. భారీగా జేబుల్లోకి వచ్చి పడుతున్న అక్రమార్జనతో అనకొండల రూపం దాల్చాయి. కొండలపై కన్నేసి కొల్లగొట్టి నామరూపాల్లేకుండా చేశాయి. నిరంతరాయంగా నమిలి మింగేశాయి. దొంగలు దొంగలూ కలిసి ఊళ్లు పంచుకున్నట్లు.. వైకాపా నేతలు తమ పరిధిలోని ప్రాంతాలను పంచుకున్నారు. కోట్ల టన్నుల మట్టిని అక్రమంగా తరలించి ఇనప్పెట్టెలు నింపుకొన్నారు. ఆ గుట్టలనే ఆధారం చేసుకున్న జనం బతుకులను నలిపేశారు. ప్రకృతి మాతను కొల్లగొట్టి భావితరాలకు భద్రత లేకుండా చేశారు.

 ఈనాడు, ఒంగోలు

ఇళ్లస్థలాలు సాకుగా  సాగిన దందా...

ఒంగోలు, టంగుటూరు మండలాల్లోని మర్లపాడు, యరజర్ల కొండలు ఎర్రమట్టికి నిలయాలు. అప్పటికే ఓ ఐరన్‌ ఓర్‌ కంపెనీ లీజులో ఉన్నాయి. అయినప్పటికీ వైకాపా ప్రభుత్వం బరితెగించింది. ఇరవై నాలుగు వేల మందికి ఇళ్లపట్టాలంటూ హడావుడి చేసింది. జగనన్న కాలనీ లేఅవుట్‌ ఏర్పాటు పేరుతో పెద్ద ఎత్తున యంత్రాలు ఉపయోగించి కొండలనే కొట్టి చదును చేసింది. ఇదే అదనుగా మట్టి మాఫియా రెచ్చిపోయింది. నిత్యం వందల సంఖ్యలో లారీలు, టిప్పర్లతో మట్టి తరలించారు. అయినా అధికారులు కన్నెత్తి చూడలేదు. టిప్పరు రూ.5 వేల నుంచి రూ.8 వేల చొప్పున తెగనమ్ముకున్నారు. రూ. కోట్ల రూపాయలతో పెట్టెలు నింపుకొన్నారు.

దేవుడినీ వదల్లేదు...

పాత సింగరాయకొండలో లక్ష్మీనరసింహస్వామి ఆలయ భూములు, ఇతర ప్రభుత్వ భూముల్లోనూ మట్టి మాఫియా తమ ఆగడాలను కొనసాగించింది. పొక్లెయిన్లు ఏర్పాటు చేసి యథేచ్ఛగా మట్టి అక్రమ తవ్వకాలను రేయింబవళ్లు కొనసాగించింది. మట్టి తవ్వకాలతో ఏర్పడిన గుంతలను చదును చేసి ఏకంగా పండ్ల తోటలే సాగు చేసుకుంటున్నారంటే అక్రమాల తీవ్రత తెలుస్తోంది.

చెరువులు, జల వనరుల్లోనూ...

దర్శి ప్రాంతంలోని పోతవరం, చందలూరు, వెంకటాచలంపల్లి, లంకోజనపల్లి కొండల్లోనూ అక్రమార్కులు రెచ్చిపోయారు. రోజుకు వందకు పైగా ట్రిప్పుల వాహనాల్లో మట్టిని తవ్వి తరలించారు.

  • తర్లుపాడు మండలంలోని నాగిళ్లముడుపు, కలుజువ్వలపాడు, గానుగపెంట, పోతలపాడు, తాడివారిపల్లి సమీపంలోనూ ఇదే తీరు. అక్కడ కొండలు, ప్రభుత్వ భూములు, చెరువుల్లో తవ్వకాలు ఇష్టారీతిన సాగాయి.
  • టంగుటూరు, పొదిలి, కొమరోలు, గిద్దలూరు, మార్కాపురం, సంతనూతలపాడు, పెళ్లూరు చెరువులోనూ వేల టన్నుల మట్టి తవ్వి సొమ్ము చేసుకున్నారు. ఇక్కడ అనుమతుల్లేకుండా అయిదేళ్లుగా కోట్ల టన్నుల మట్టిని అక్రమంగా తరలించారు.

జలాశయం కట్టలకూ ముప్పు...

మద్దిపాడు మండలంలోని బూరేపల్లి కొండల వద్ద ఎర్రమట్టి అక్రమ తవ్వకాలు అయిదేళ్లుగా నిత్యకృత్యమయ్యాయి. దీంతో కొండ రూపురేఖలే కోల్పోయాయి. గుండ్లకమ్మ జలాశయం గట్టును కూడా మట్టి మాఫియా వదల్లేదు. యంత్రాలతో తవ్వి తరలించి సొమ్ము చేసుకుంది. దీంతో ఆ గుంతల్లోకి ఇప్పుడు జలాశయం నీటి ఊట చేరి నిలుస్తూ.. కట్ట భద్రతకే ముప్పు వాటిల్లే దుస్థితి తలెత్తింది.

ప్రజల ప్రాణాలతో చెలగాటం...

దర్శి, యరజర్ల, శివరాంపురం పరిసర ప్రాంతాల్లో అక్రమ మట్టి టిప్పర్లు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుకున్నాయి. నిత్యం వందల సంఖ్యలో భారీ టిప్పర్లు నివాస ప్రాంతాల గుండా వెళ్తూ రోడ్లను ఛిద్రం చేశాయి. టిప్పర్ల చోదకుల నిర్లక్ష్యం కారణంగా తరచూ ప్రమాదాలు చోటుచేసుకుని పలువురు గాయాలపాలయ్యారు. మట్టి వాహనాలు ఢీకొని నలుగురు మృతి చెందారు.

రహదారుల  విధ్వంసం...

సంతనూతలపాడు, ఒంగోలు, దర్శి, కొండపి నియోజకవర్గాల్లో మట్టి వాహనాలతో రహదారులు ధ్వంసం అయ్యాయి. కొన్నిసార్లు స్థానికులే రోడ్లపై మట్టి పోసి గుంతలు పూడ్చుకున్నారు. దెబ్బతిన్న రహదారుల్లో మట్టి వాహనాల దెబ్బకు దుమ్ముధూళితో ప్రజలు, వాహనదారులు అనేక ఇబ్బందులకు గురవుతూనే ఉన్నారు.

ప్రభుత్వ ఖజానాకు  గండి...

జిల్లాలో కొన్ని చోట్ల మాత్రమే స్థానిక అవసరాలు, ప్రభుత్వ పనులకు ఎర్రమట్టి తవ్వుకోవడానికి అనుమతులున్నాయి. అక్కడ కూడా నిబంధనలకు విరుద్ధంగా మట్టి తవ్వారు. అధికారులు పట్టుకుంటే ప్రభుత్వ పనులు, రహదారుల పనులు, ఇతర అవసరాలకు అని చెప్పడం, రాజకీయ నాయకుల పేర్లు చెప్పి మట్టి తరలించేశారు. నిబంధనల ప్రకారం భూగర్భ గనుల శాఖ నుంచి ఎర్రమట్టి తరలింపునకు క్యూబిక్‌ మీటర్‌కు రూ.105 చెల్లించాలి. అనుమతి లేకపోవడంతో ఈ మొత్తం కూడా మట్టి యాఫియానే మిగుల్చుకుంది. ఇలా అయిదేళ్లలో రూ.35 కోట్ల మేర ప్రభుత్వ ఆదాయానికి గండి పడింది.

యరజర్ల కొండలను పొక్లెయిన్‌తో తవ్వి లారీలోకి ఎత్తుతున్న మట్టి


  • అయిదేళ్లలో తరలించిన మట్టి 2.70 కోట్ల టన్నులు
  • బహిరంగ మార్కెట్‌లో విలువ రూ.860 కోట్లు
  • ప్రభుత్వం కోల్పోయిన రాయల్టీ రూ.35 కోట్లు
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని