logo

పెళ్లికి నిరాకరించిందని పగ.. కాళ్లు పట్టుకున్నా కనికరించని కక్ష

పెళ్లికి నిరాకరించిందనే కక్షతో ఓ యువకుడు యువతితో పాటు ఆమె తల్లిపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన దారుణ సంఘటన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వింజమూరులోని పాతూరులో శుక్రవారం చోటుచేసుకుంది.

Updated : 18 May 2024 06:58 IST

నెల్లూరు జిల్లా పాతూరులో దారుణ ఘటన
నిందితుడు పామూరుకు చెందిన యువకుడు

వింజమూరు, న్యూస్‌టుడే: పెళ్లికి నిరాకరించిందనే కక్షతో ఓ యువకుడు యువతితో పాటు ఆమె తల్లిపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన దారుణ సంఘటన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వింజమూరులోని పాతూరులో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు, బాధితుల వివరాల ప్రకారం.. సంక్రాంతి వెంకటరత్నం, కాంతమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. వెంకటరత్నం నాలుగేళ్ల క్రితం అనారోగ్యంతో మృతిచెందారు. కాంతమ్మకు అగ్నిప్రమాదంలో ఓ చెయ్యి కోల్పోయింది. పెద్ద కుమార్తెకు పెళ్లి చేయగా.. చిన్న కుమార్తె పూజితను తనకు వచ్చే పింఛనుతో కాంతమ్మ చదివించారు. పామూరు మండలం కొత్తపల్లికి చెందిన వంటేరు నాగార్జున వీరికి సమీప బంధువు. అతనికి పూజితతో పరిచయం ఉండటంతో అడపాదడపా చదువులకు సాయం చేసేవాడు. పూజిత ప్రస్తుతం చెన్నైలో ఉద్యోగం చేస్తోంది. నాగార్జున క్యాటరింగ్‌, హోటల్‌, భవన నిర్మాణం వంటి పనులు చేస్తుంటాడు. వీరిద్దరి పెళ్లిపై రెండు కుటుంబాల మధ్య గతంలో చర్చ సాగినప్పటికీ కాంతమ్మ కుటుంబీకులు నిరాకరించారు. దీంతో నాగార్జున కక్ష పెంచుకున్నాడు. పూజిత వెంట పడుతూ ఇబ్బంది పెట్టడంతో ఆమె గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. చదువులకు చేసిన సాయం తిరిగిచ్చేలా ఇరు కుటుంబాల మధ్య ఒప్పందం కుదరడంతో అప్పట్లో వివాదం సద్దుమణిగింది. ఇటీవల కాలంలో నాగార్జున మళ్లీ వేధించసాగాడు. ఈ క్రమంలో సంచిలో కత్తి పెట్టుకుని పూజిత నివాసం ఉండే పాతూరులోని ఇంటికి శుక్రవారం వెళ్లాడు. కాంతమ్మపై విచక్షణారహితంగా దాడి చేశాడు. భయాందోళనకు గురైన ఆమె.. తన బిడ్డతో పెళ్లి చేస్తానని, చంపొద్దని కాళ్లు పట్టుకుని వేడుకున్నా వినిపించుకోలేదు. అపస్మారక స్థితిలోకి వెళ్లగానే సమీపంలో ఉన్న పూజితను వంట గదిలోకి లాక్కెళ్లి ఆమె పైనా కత్తితో దాడి చేశాడు. నిన్నే పెళ్లి చేసుకుంటాను.. చంపొద్దని ప్రాధేయపడినా వినలేదు. అనంతరం అతను పారిపోయాడు. తీవ్ర గాయాలైన తల్లీకుమార్తెలిద్దరినీ స్థానికులు ఆసుపత్రిలో చేర్చారు. నిందితుడిని, పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని సీఐ ఫిరోజ్‌ తెలిపారు.

చికిత్స పొందుతున్న పూజిత

కాంతమ్మ

నాగార్జున

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని