logo

ఆటల్లోనూ జగన్నాటకం.. వేసవిలో కనిపించని క్రీడా శిబిరాలు

అయిదేళ్లపాటు క్రీడారంగాన్ని పట్టించుకోని వైకాపా ప్రభుత్వం.. సార్వత్రిక ఎన్నికల కోడ్‌ అమలులోకి రావడానికి ముందు జగన్నాటకం ఆడించింది.

Updated : 20 May 2024 07:50 IST

ఆడుదామంటూ ఎన్నికల ముందు ప్రచార ఆర్భాటం 
వేసవిలో గాలికొదిలేసిన ప్రభుత్వం
శిబిరాల్లేక క్రీడాకారుల నిరుత్సాహం

అయిదేళ్లపాటు క్రీడారంగాన్ని పట్టించుకోని వైకాపా ప్రభుత్వం.. సార్వత్రిక ఎన్నికల కోడ్‌ అమలులోకి రావడానికి ముందు జగన్నాటకం ఆడించింది. ‘ఆడుదాం- ఆంధ్రా’ అంటూ హడావుడి చేసింది. క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నది తామే అంటూ ఆర్భాటపు ప్రచారం చేసుకుంది. రూ. కోట్ల బడ్జెట్‌ కేటాయించి ఊరూరా పోటీలు నిర్వహించింది. అసంపూర్తి పాఠశాల మైదానాలు, రాళ్ల నేలలు, ఎలాంటి సౌకర్యాలు కల్పించకుండా ఆటలాడించి అభాసుపాలైంది. తీరా ఎన్నికలు ముగిశాక ఆటలు, క్రీడాకారులను గాలికొదిలేసింది. ఈ ఏడాది వేసవి శిక్షణ శిబిరాలకు రూపాయి కూడా కేటాయించకుంది.

న్యూస్‌టుడే,  ఒంగోలు గ్రామీణం 

అధికారులు సొంతంగా నిర్వహిస్తున్న ఒంగోలు మినీ స్టేడియంలోని సెపక్‌ తక్రా శిబిరంలో విద్యార్థులు 


అందని  మార్గదర్శకాలు...

ఏడాదిపాటు విద్యార్థులు పుస్తకాలతో కుస్తీ పడతారు. చదువులతో అలిసిపోతారు. వారికి ఆటవిడుపు లభించేది.. తమకు ఇష్టమైన రంగాలపై ఆసక్తి చూపేది వేసవిలోనే. ఈ క్రమంలో ప్రభుత్వాలు ఏటా వేసవిలో ఏటా మే ఒకటో తేదీ నుంచి నెలాఖరు వరకు క్రీడా శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేస్తుంటాయి. క్రీడాకారులు, విద్యార్థులకు శిక్షణ ఇస్తుంటాయి. ఎన్నికల కోడ్‌ రీత్యా ఈ ఏడాది మే 15 నుంచి జూన్‌ 15వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారులు ప్రకటించారు. గడువు దాటినా శాప్‌ నుంచి ఇంకా ఎటువంటి మార్గదర్శకాలు రాలేదు. ఈ ఏడాది ఇప్పటికీ ప్రారంభానికి నోచుకోలేదు. దీంతో జిల్లాలోని అధికారులు, శిక్షకులు అయోమయంలో ఉన్నారు. తాజా పరిస్థితి చూస్తే ఈ ఏడాది వేసవి శిక్షణ తరగతులు లేనట్లేనని క్రీడా శాఖ జిల్లా అధికారులు చెబుతున్నారు. 

ఎంతో  ఉపయుక్తమైనప్పటికీ...

 శిబిరాల్లో పాల్గొనే శిక్షకుడికి గౌరవ వేతనం రూ.2 వేలు, క్రీడా సామగ్రికి రూ.6 వేల నుంచి రూ.8 వేలు, మైదానం నిర్వహణ ఖర్చు కింద మరో రూ.వెయ్యి నిధులను ప్రభుత్వాలు కేటాయిస్తాయి. ఎంపిక చేసిన మైదానాల్లో బాల్‌ బ్యాడ్మింటన్, బాక్సింగ్, ఫుట్‌బాల్, హాకీ, ఖో-ఖో, కబడ్డీ, స్కేటింగ్, తైక్వాండో, టెన్నీకాయిట్, వాలీబాల్‌ తదితర విభాగాల్లో శిక్షణ ఇచ్చేవారు. నెల రోజుల పాటు విద్యార్థులకు అందించే ఈ శిక్షణ క్రీడాకారులకు ఎంతో ఉపయుక్తంగా ఉండేది. ఉదయం, సాయంత్రం శిక్షణకు వచ్చే విద్యార్థులకు అల్పాహారం, తాగునీటి వసతి నిమిత్తం స్థానికంగా దాతలు సహకారం తీసుకునేవారు. 

ఆ రెండు  ఏదో అలా...

ఈ క్రమంలో గత ఏడాది తరహాలోనే జిల్లాలోని 50 ప్రాంతాల్లో శిబిరాల నిర్వహణకు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ నుంచి ప్రతిపాదనలు పంపారు. కానీ మార్గదర్శకాలేవీ అందలేదు. దీంతో సార్వత్రిక ఎన్నికలను సాకుగా చూపి శిక్షణ శిబిరాలను అడ్డుకోవడంపై క్రీడా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విధి లేని పరిస్థితుల్లో శాప్‌ ఆధ్వర్యంలో జిల్లా అధికారులే గత నెల రోజులుగా ఒంగోలు దక్షిణ బైపాస్‌లోని మినీ స్టేడియంలో బాక్సింగ్, సెపక్‌ తక్రా, షటిల్‌ బ్యాడ్మింటన్‌ విభాగాల్లో; మార్కాపురంలో బాక్సింగ్, వాలీబాల్, ఫుట్‌బాల్‌ వంటి విభాగాల్లో శిక్షణ ఇస్తూ నెట్టుకొస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని