logo

ఫలితాల వేళ శాంతికి విఘాతం కలిగిస్తే చర్యలు

ఎన్నికల ఫలితాల వేళ..శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ గరుడ్‌ సుమిత్‌ సునీల్‌ హెచ్చరించారు.

Published : 22 May 2024 01:53 IST

ఎస్పీ సుమిత్‌ సునీల్‌

దర్శిలో అవగాహనా కార్యక్రమంలో మాట్లాడుతున్న జిల్లా ఎస్పీ గరుడ్‌ సుమిత్‌ సునీల్‌

దర్శి, న్యూస్‌టుడే: ఎన్నికల ఫలితాల వేళ..శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ గరుడ్‌ సుమిత్‌ సునీల్‌ హెచ్చరించారు. దర్శిలోని పీజీఎన్‌ కాంప్లెక్స్‌లో మంగళవారం ఎన్నికల లెక్కింపు అనంతరం జరిగే పరిణామాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా పలు జాగ్రత్తలు తీసుకోవటం ద్వారానే దర్శిలో అత్యధిక పోలింగ్‌ నమోదైందన్నారు. ప్రశాంతంగా ఉన్న సమయంలో కొన్ని అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నాయని, వాటిని సకాలంలో పోలీసులు అడ్డుకున్నారన్నారు. లెక్కింపు అనంతరం ఎలాంటి ఇబ్బందికర పరిస్థితి తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. 

జిల్లా వ్యాప్తంగా 26వేల మంది బైండోవర్‌

ఎన్నికల సందర్భంగా జిల్లాలో 26 వేల మందిని ముందస్తు బైండోవర్‌ చేశామని ఎస్పీ తెలిపారు. గొడవలు సృష్టించిన 35 మంది వివరాలను జిల్లా కలెక్టర్‌కు నివేదించామని ఆయన వివరించారు. వారిపై చర్యలకు అధికారులు సమాయత్తమవుతున్నారని చెప్పారు. కట్టుతప్పిన అలాంటి వారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. వీటిని దృష్టిలో పెట్టుకుని ఇకముందు ఘర్షణలకు ఆస్కారమివ్వవద్దని ఆయన హితవు పలికారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం సామాజిక మాధ్యమాల్లో అవాస్తవాలు ప్రచారం చేసినా, వాటిని ఇతర గ్రూపులకు తరలించినా కఠినంగా వ్యవహరిస్తామన్నారు. మారణాయుధాలతో పాటు విడిగా పెట్రోలు కలిగివున్నా సహించేది లేదని, ఇలాంటి వారిపై రౌడీ షీట్‌ తెరుస్తామని హెచ్చరించారు. ఫలితాల అనంతరం విజయోత్సవ కార్యక్రమాలకు అనుమతులు తీసుకోవడంతో పాటు నిబంధనలకు లోబడి వాటిని నిర్వహించుకోవాలన్నారు. అత్యుత్సాహం ప్రదర్శించి ఇబ్బందులు సృష్టిస్తే చూస్తూ ఊరుకోమన్నారు. గ్రామాల్లో చిన్నపాటి గొడవలు జరిగినా పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో దర్శి డీఎస్పీ అశోక్‌వర్ధన్‌రెడ్డి, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని