logo

కార్యాలయంలో కీచకుడు

మహిళా ఉద్యోగినులను లైంగికంగా వేధించడమే అతని పని. ఇప్పటికే కేసు నమోదైంది. ఉన్నతాధికారులు అతనిపై బదిలీ వేటు వేశారు. అయినా బుద్ధి మార్చుకోలేదు.. తీరు మారలేదు.

Published : 22 May 2024 01:56 IST

ఇప్పటికే కేసు నమోదైనా మారని తీరు

మార్కాపురం, న్యూస్‌టుడే: మహిళా ఉద్యోగినులను లైంగికంగా వేధించడమే అతని పని. ఇప్పటికే కేసు నమోదైంది. ఉన్నతాధికారులు అతనిపై బదిలీ వేటు వేశారు. అయినా బుద్ధి మార్చుకోలేదు.. తీరు మారలేదు. అక్కడా ఓ మహిళా ఉద్యోగినిపై కన్నేశాడు. తన కోరిక తీర్చాలంటూ వేధింపులకు గురిచేశాడు. అధికారులు తెలిపిన మేరకు ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. మార్కాపురం డివిజనల్‌ పంచాయతీ కార్యాలయంలో శ్రీనివాసులు సీనియర్‌ సహాయకుడిగా విధులు నిర్వహిస్తున్నారు. అదే కార్యాలయంలోని మహిళా ఉద్యోగిని ఆరు నెలలుగా లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడు. ఈ విషయమై ఆమె పలుమార్లు హెచ్చరించినప్పటికీ అతనిలో మార్పు లేకపోయింది. విసిగి వేసారిన ఆమె తొలుత డీఎల్పీవోకు ఫిర్యాదు చేసింది. ఎటువంటి స్పందన లేకపోవడంతో జిల్లా పంచాయతీ అధికారిణి ఉషారాణికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు అందించింది. స్పందించిన ఆమె అక్కడి అధికారులు, సిబ్బందిని ఒంగోలు పిలిపించి మంగళవారం వివరాలు సేకరించారు. 

ఒంగోలులోనూ అదే బుద్ధి: సదరు సీనియర్‌ సహాయకుడు శ్రీనివాసులు ఒంగోలు డీపీవో కార్యాలయంలో పని చేసే సమయంలోనూ లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్నారు. కార్యాలయంలో పని చేసే మహిళా ఉద్యోగులతో అసభ్యంగా మాట్లాడటంతో పాటు లైంగికంగా వేధింపులకు గురిచేశారు. ఈ విషయమై అప్పట్లో ఒంగోలు రెండో పట్టణ పోలీసు స్టేషన్‌లో కేసు కూడా నమోదైంది. అయినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో అధికారులు అతన్ని ఏడాది కిందట మార్కాపురం డివిజనల్‌ పంచాయతీ కార్యాలయానికి బదిలీ చేశారు. మారింది స్థానమే తప్ప తన బుద్ధి కాదని శ్రీనివాసులు ఇక్కడ కూడా అదే తీరున ప్రవర్తించసాగాడు. మహిళా ఉద్యోగులతో అసభ్యంగా మాట్లాడుతూ.. నిత్యం లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారు. తొలుత ఎవరికీ చెప్పుకోలేక మనోవేదనకు గురైన మహిళా ఉద్యోగులు.. చివరికి ధైర్యం చేసి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతం విచారణ చేపట్టారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని