logo

జిల్లాలో రక్తం లేదు

రక్తం అవసరమైన బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌ మాసం నుంచి కొరత ఏర్పడింది. అత్యవసరమైన రోగులు, ప్రమాద బాధితులకు అవసరమైన గ్రూపు రక్తం సమకూర్చుకోవడం కష్టంగా మారింది.

Published : 22 May 2024 02:07 IST

అందుబాటులో లేని దాతలు
ఇప్పటికే ఖాళీ అయిన నిల్వలు
రోగులు, క్షతగాత్రులకు గడ్డు పరిస్థితులు

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: రక్తం అవసరమైన బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌ మాసం నుంచి కొరత ఏర్పడింది. అత్యవసరమైన రోగులు, ప్రమాద బాధితులకు అవసరమైన గ్రూపు రక్తం సమకూర్చుకోవడం కష్టంగా మారింది. దీనివల్ల అత్యవసరం కాని శస్త్రచికిత్సలను వాయిదా వేసుకోవాల్సి వస్తోందంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. ఒంగోలు సర్వజన ఆసుపత్రిలో రోజుకు అన్ని విభాగాలు కలిపి సరాసరిన పది శస్త్రచికిత్సలు చేస్తుంటారు. వీటిలో రక్తం అవసరమయ్యే కేసులు సుమారు నాలుగు వరకు ఉంటాయి. అత్యవసరమైన వారికి బంధువుల నుంచి రక్తం సేకరించి బ్లడ్‌ బ్యాంకులో ఉన్నవి సర్దుబాటు చేస్తున్నారు. అయినప్పటికీ ఉన్న నిల్వలు సరిపోవడం లేదు.


రోజుకు వంద యూనిట్లు అవసరం...

ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో రోజువారీ వచ్చే అత్యవసర శస్త్రచికిత్సలు, తలసేమియా, హెచ్‌ఐవీ, క్యాన్సర్‌ రోగులకు వంద యూనిట్లు అవసరమని అంచనా. ఒంగోలు నగరంలో రెడ్‌క్రాస్‌ సొసైటీ, జీజీహెచ్‌లో ప్రభుత్వ బ్లడ్‌ బ్యాంకులు నడుస్తుండగా, ప్రైవేట్‌గా కిమ్స్, నవ్య, న్యూవిజన్‌ పేరుతో ప్రైవేట్‌ బ్లడ్‌ బ్యాంకులు నిర్వహిస్తున్నారు. ఎక్కడ రక్తనిల్వలు కావాలన్నా దాతలు, రక్తదాన శిబిరాలే ఆధారం. ఏవైనా సంస్థల ఉద్యోగులు ప్రత్యేకమైన సందర్భాల్లో రక్తదానం చేస్తుంటారు. పిలిస్తే స్వచ్ఛందంగా వచ్చి రక్తం ఇచ్చే దాతలు జిల్లాలో తక్కువ మందే ఉన్నారు. రక్త నిల్వలు ఎప్పటికప్పుడు తగినంత ఉంచడం కోసం కలెక్టర్‌ గత ఏడాది స్టెప్, ఉన్నత విద్యాశాఖ, కళాశాలల ప్రిన్సిపల్స్‌తో సమావేశం ఏర్పాటు చేసి ప్రత్యేక శిబిరాల నిర్వహణకు ప్రణాళిక రూపొందించారు. కళాశాలల్లో క్యాంపులు నిర్వహిస్తే కొరత ఉండదు. వేసవి సెలవులు కావడంతో విద్యార్థులు అందుబాటులో లేరు. దీంతో రెండు నెలలుగా సమస్య తీవ్రంగా ఉంది. 


నెల్లూరు వెళ్లాల్సి వచ్చింది...

కొత్తపట్నానికి చెందిన గర్భిణిని పురుడు కోసం అత్యవసరంగా ఒంగోలు జీజీహెచ్‌కి తీసుకొచ్చారు. రక్తహీనతతో తప్పనిసరిగా రెండు యూనిట్ల రక్తం ఎక్కించాలని వైద్యులు సూచించారు. ఆమెది బి నెగెటివ్‌ వర్గం కావడంతో అక్కడి బ్లడ్‌ బ్యాంకులో అందుబాటులో లేకపోయింది. సమీప బంధువుల్లోనూ ఆ వర్గం వారు లభ్యం కాలేదు. విధి లేని పరిస్థితుల్లో గర్భిణి బంధువులు నెల్లూరు వెళ్లి అక్కడ ఎక్కువ ధరకు కొనుగోలు చేసి తీసుకొచ్చారు.


గుంటూరుకు  పరుగులు...

ఇటీవల చీమకుర్తి వద్ద రహదారిపై ద్విచక్ర వాహన ప్రమాదం చోటుచేసుకుంది. అందులో ఒకరికి కాలు విరిగింది. శస్త్రచికిత్స చేయాల్సి రావడంతో రెండు యూనిట్ల ఓ పాజిటివ్‌ రక్తం అవసరమైంది. సమయానికి అందుబాటులో లేకపోవడంతో బాధిత కుటుంబ సభ్యులు హుటాహుటిన గుంటూరు వెళ్లి తీసుకొచ్చారు. 


అల్లాడుతున్న రోగులు, బాధితులు...

రెడ్‌క్రాస్‌ సొసైటీ బ్లడ్‌ బ్యాంకులో ఖాళీగా రక్త నిల్వ ఫ్రీజర్‌

జిల్లాలో తలసేమియా రోగులు 150 మంది, హెచ్‌ఐవీతో బాధపడుతూ ప్రతినెలా రక్తం అవసరమైన బాధితులు 25 మంది, క్యాన్సర్‌ రోగులు 60 మంది వరకు ఉన్నారు. వీరికి రెడ్‌క్రాస్‌ ద్వారా ప్రాసెసింగ్‌ ఛార్జీ మాత్రమే వసూలు చేసి రక్తం అందజేస్తున్నారు. మిగిలిన వారికి బంధువులెవరైనా రక్తం ఇస్తే రూ.1,150 చొప్పున, ఇవ్వకపోతే రూ.1,550 చొప్పున వసూలు చేస్తారు. ప్రైవేట్‌ బ్లడ్‌ బ్యాంకుల్లో డిమాండ్‌ను బట్టి వసూలు చేస్తారు. రక్తం సేకరించాక 35 రోజులు మాత్రమే నిల్వ ఉంటుంది. అనంతరం పనికిరాకుండా పోతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో రోగులకు లభ్యం కాకపోవడంతో వారంతా అల్లాడుతున్నారు. రెడ్‌క్రాస్‌ బ్లడ్‌ బ్యాంకు నిల్వ సామర్థ్యం 300 యూనిట్లు. ఇక్కడ గత రెండు నెలల నుంచి 40 శాతం మాత్రమే అందుబాటులో ఉంటోంది. కొన్ని సందర్భాల్లో ఒకటీ రెండు యూనిట్లకు మించి ఉండటం లేదు. మొత్తం మీద రోజువారీ వినియోగంలో 40 శాతం కొరత ఉన్నట్లు వైద్యులు, నిర్వాహకులు చెబుతున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని