logo

స్పందన లేని గణం.. కుంగిపోతున్న జనం

పశ్చిమ ప్రకాశంలో ఏళ్లు గడుస్తున్నా రెవెన్యూ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో బాధితులకు కుంగిపోతున్నారు. కాళ్లరిగేలా తిరుగుతున్నా స్పందించకపోవడంతో కొంతమంది ఆత్యాయత్యా యత్నాలకు పాల్పడుతుండటం పరిస్థితి  తీవ్రతకు అద్దం పడుతోంది.

Updated : 22 May 2024 05:30 IST

ఒక్క సమస్య తీర్చితే ఒట్టు
‘కాగితాల్లో’నే వేల అర్జీల పరిష్కారం
చుక్కలు చూపిస్తున్న  అధికారులు
బాధితుల ఆత్మహత్యా యత్నాలు 

  • తన భూమిని అక్రమంగా వేరొకరి పేరుపై ఆన్‌లైన్‌ చేసి పట్టాదారు పాసు పుస్తకం జారీ చేశారంటూ పెద్దారవీడుకు చెందిన ఓ బాధితుడు ఉప కలెక్టర్‌ కార్యాలయానికి వచ్చి వాపోయారు. యంత్రాంగం స్పందించకపోవడంతో స్పందన జరుగుతున్న సమయంలోనే  ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యకు యత్నించారు. ఇప్పటికీ ఆయన సమస్యను అధికారులు పరిష్కరించలేదు.

  • అయిదేళ్ల కిందట పుల్లలచెరువు మండలంలోని చాపలమడుగుకు చెందిన ఓ వ్యక్తి తన రెవెన్యూ సమస్యను అధికారులు పరిష్కరించడం లేదని మనస్తాపానికి గురై ఆర్డీవో   కార్యాలయ ఆవరణలోనే పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. 

మార్కాపురం, న్యూస్‌టుడే: పశ్చిమ ప్రకాశంలో ఏళ్లు గడుస్తున్నా రెవెన్యూ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో బాధితులకు కుంగిపోతున్నారు. కాళ్లరిగేలా తిరుగుతున్నా స్పందించకపోవడంతో కొంతమంది ఆత్యాయత్యా యత్నాలకు పాల్పడుతుండటం పరిస్థితి  తీవ్రతకు అద్దం పడుతోంది. విసిగి వేసారి ఇలాంటి యత్నాలు చేయాల్సి వస్తోందని బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఒకే సమస్య కోసం పదే పదే తహసీల్దారు, ఉప కలెక్టర్, జిల్లా కలెక్టర్‌ కార్యాలయాల్లో జరిగే స్పందనకు హాజరై తీవ్ర నిరాశకు గురవుతున్నారు. వివాదంలో ఉంది తామేం చేయలేమంటూ అధికారులు తప్పించుకుంటున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు.

స్పందనలో దరఖాస్తులు స్వీకరిస్తున్న ఉప కలెక్టర్‌ రాహుల్‌మీనా (పాత చిత్రం) 

ఎనిమిది వేలకు పైగా పరిష్కరించేశాం.. 

మార్కాపురం ఉప కలెక్టర్‌ కార్యాలయ, రెవెన్యూ డివిజన్‌ పరిధిలో 2021 ఏడాది జనవరి నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 12వ తేదీ వరకు వేలాది అర్జీలందించారు. మార్కాపురం, తర్లుపాడు, పెద్దారవీడు, పెద్దదోర్నాల, త్రిపురాంతకం, యర్రగొండపాలెం, పుల్లలచెరువు, కంభం, అర్థవీడు, బేస్తవారపేట, రాచర్ల, కొమరోలు, గిద్దలూరు మండలాల నుంచి రెవెన్యూ (భూ సమస్యల)పైనే  అధికంగా దరఖాస్తులందాయి. ఆయా మండలాల నుంచి ఇప్పటి వరకు సుమారు 10,565 వరకు అర్జీలొచ్చాయి. అందులో 490 పెండింగ్‌లోనే ఉన్నాయి. ఏకంగా  8,332 దరఖాస్తులను పరిష్కరించేసినట్లు కాగితాల్లో అధికారులు నమోదు చేయించడం విశేషం.

అంతా ఓ ప్రహసనం

తమ సమస్య పరిష్కారం గురించి బాధితులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న తరుణంలో ఉన్నతాధికారులు తప్పించుకునే ధోరణిలో వ్యవహరిస్తున్నారు. మీ సమస్య పరిష్కారమైంది, వెళ్లి సంబంధిత తహసీల్దార్‌ కార్యాలయంలో సంప్రదించాలని ఉప కలెక్టర్‌ కార్యాలయంలోని సిబ్బంది చెబుతున్నారు. దీంతో ఎంతో ఉత్సాహంగా అక్కడికి వెళ్లిన వారికి నిరాశే ఎదురవుతోంది. ఎలాంటి పరిష్కారం చూపకపోవడంతో వారు డీలా పడిపోతున్నారు. అయితే వీటిని పరిష్కరించినట్లు కాగితాల్లో నమోదు చేసేసుకుంటున్నారు. ఇదంతా ఓ ప్రహసనంలా సాగుతోంది.


ఎన్నోసార్లు కలిసినా ఫలితం లేదు
- షేక్‌ నబీ రసూల్, రైతు, పెద్దారవీడు

పెద్దారవీడు గ్రామ ఇలాకాలో మా పూర్వీకుల భూమి 6.70 ఎకరాలు ఉంది. ఇందులో 2.50 ఎకరాల భూమిని గ్రామానికి చెందిన ఓ గ్రామ రెవెన్యూ సహాయకుడు అక్రమంగా తన పేరుపై ఆన్‌లైన్‌ చేసుకున్నాడు. ఆ భూమిని అక్రమార్కుడు నుంచి స్వాధీనం చేసుకుని, తన తల్లి వలాంబీ పేరుపై ఆన్‌లైన్‌ చేసి పాసు పుస్తకాలు జారీ చేయాలని అయిదేళ్ల నుంచి పదుల సార్లు అధికారులకు నివేదించాం. రైతు సంఘం ఆధ్వర్యంలో ఆందోళనలు చేశాం. జిల్లా కలెక్టర్, జాయింట్‌ కలెక్టర్, ఉప కలెక్టర్‌తో పాటు అనేకమంది అధికారులకు స్పందనలో వినతిపత్రాలు అందజేసినా పరిష్కారం చూపలేదు. అధికారులు కిందిస్థాయి సిబ్బందికే వత్తాసు పలుకుతుండటం ఆవేదన కలిగిస్తోంది.


భార్య పేరున ఉన్న భూమిని  వేరొకరికి ఆన్‌లైన్‌ చేశారు
- భూమిరెడ్డి వెంకటరెడ్డి, రైతు, గజ్జలకొండ, మార్కాపురం మండలం

గజ్జలకొండలో మొత్తం 4.20 ఎకరాల భూమి నా భార్య బసవమ్మకు తండ్రి నుంచి  వారసత్వంగా వచ్చిôది. అయితే అధికారులు ఇతరుల వద్ద ముడుపులు తీసుకుని బంధువులకు భూమిని ఆన్‌లైన్‌ చేశారు. దీనిపై ఏడాది నుంచి రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా స్పందన లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు