logo

యమలోక.. రహదారి..!

తర్లుపాడు, మార్కాపురం రహదారి సింగిల్‌ రోడ్డు కావడంతోపాటూ 10 మీటర్లకు ఒక్క మోకాళ్లలోతు గుంతలు ఉండటంతో అధిక సంఖ్యలో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.

Published : 26 May 2024 01:28 IST

మూడు వారాల్లో గాల్లో కలిసిన రెండు ప్రాణాలు
ఏళ్లుగా విస్తరణకు నోచుకోని వైనం

తర్లుపాడు, మార్కాపురం రహదారి సింగిల్‌ రోడ్డు కావడంతోపాటూ 10 మీటర్లకు ఒక్క మోకాళ్లలోతు గుంతలు ఉండటంతో అధిక సంఖ్యలో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. శిథిలావస్థకు చేరిన రహదారిలో వాహన రద్దీ ఎక్కువ కావడం, రోడ్డుకు ఇరువైపులా బరంచులు లేకపోవడం, గుంతల్లో వాహనాన్ని డ్రైవర్‌ వేగాన్ని అదుపు చేయలేక నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. పాలకులుగానీ, అధికారులు గానీ ఈ అయిదేళ్లలో గుంతలు పూడ్చడానికి తట్టెడు కంకర కూడా వేయకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.  

న్యూస్‌టుడే, తర్లుపాడు

కంభం, గిద్దలూరు, కర్నూలు, నంద్యాల, కడప వంటి ముఖ్య పట్టణాల నుంచి మార్కాపురం పట్టణానికి వచ్చే వాహనదారులు వయా తర్లుపాడు మీదుగా రావడానికి ఆసక్తి చూపిస్తారు. అయితే గత తెదేపా ప్రభుత్వంలో బొడిచెర్ల వరకు రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేశారు. కానీ అక్కడి నుంచి వయా తర్లుపాడు మీదుగా మార్కాపురం పట్టణం వరకు ఉన్న రహదారి విస్తరణ చేయకపోగా ప్రస్తుత ప్రభుత్వంలో మోకాళ్లలోతు గుంతలను కూడా పూడ్చలేదు. దీంతో తర్లుపాడు, మార్కాపురం రహదారి నిత్యం రక్తమోడుతుంది. కేవలం 10 కిలో మీటర్ల రోడ్డును అభివృద్ధి చేయకపోవడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతూ యమలోకానికి రహదారిగా మారింది.  

నిన్నటి వరకు ఉన్న గిద్దలూరు, యర్రగొండపాలెం, మార్కాపురం నియోజకవర్గాల ఎమ్మెల్యేలు మార్కాపురం పట్టణంలో ఉండేవారే. కానీ కంభం, మార్కాపురం వయా తర్లుపాడు మీదుగా ఉన్న రోడ్డును అభివృద్ధి చేసేందుకు ఏ ఒక్క ఎమ్మెల్యే చొరవ చూపలేదు. అనంతపురం, అమరావతి జాతీయ రహదారిలో నిత్యం వాహన రద్దీ ఎక్కువగా ఉండటంతో సొంత వాహనదారులు వయా తర్లుపాడు మీదుగా మార్కాపురం పట్టణానికి చేరుకుంటారు. అయితే ఈ రహదారి కూడా శిథిలావప్థకు చేరడంతో రోడ్డు ప్రమాదాలు పెరిగి అమాయక ప్రజలు ప్రాణాలు వదిలేస్తున్నారు.

నెరవేరని డబుల్‌ రోడ్డు హామీ

తర్లుపాడు దగ్గరలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన కంభం వాసి

కంభం, మార్కాపురం వయా తర్లుపాడు రోడ్డును 2023 జూన్‌ నెలాఖరు నాటికి  రహదారి విస్తరణ పనులు పూర్తి చేస్తానని వైకాపా ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి హామీ ఇచ్చారు. తర్లుపాడు మండలం సీతానాగులవరం గ్రామంలో గడప గడపకు వైకాపా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేను ఆ గ్రామస్థులు ఈ రహదారి విస్తరణపై హామీ కోరారు. అప్పట్లో ఇచ్చిన హామీ నేట¨కీ నెరవేరలేదు సరికదా గుంతల్లో తట్టెగు మట్టి కూడా వేయలేకపోయారు. కనీసం రానున్న ప్రభుత్వంలోనైనా ఈ సమస్యకు పరిస్కారం వస్తుందేమో చూడాలి.


రూ.30కోట్లతో ప్రతిపాదనలు

బోడిచర్ల వద్ద గుళ్లకమ్మ వాగుపై బిడ్జితో కలిపి తర్లుపాడు మీదుగా మార్కాపురం పూలసుబ్బయ్యకాలనీ వరకు ఆర్‌ అండ్‌ బీ పరిధిలో రోడ్డు విస్తరణ కోసం ఏడాది కిందట రూ.30కోట్ల అంచనా వ్యయంతో ప్రభుత్వానికి  అనుమతి కోసం పంపాం. అనుమతి మంజూరైన వెంటనే పనులు ప్రారంభిస్తాం.

ఆనందరరావు, డీఈ, కంభం


విస్తరించకుంటే  ప్రమాదమే

ఈ రహదారి విస్తరణకు నోచుకోలేదు. కేవలం మూడు వారాల్లో నాలుగు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. అందులో ఇద్దరు వ్యక్తులు ప్రమాదంలో మృతి చెందగా, ఆరుగురు తీవ్ర గాయాలపాలై ఆసుపత్రుల్లో ఉండాల్సి వచ్చింది.  హామీ ఇచ్చినట్టుగా మార్కాపురం జిల్లా కేంద్రం అయితే వాహన రద్దీ మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటికే పట్టణీకీకరణలో భాగంగా తర్లుపాడు మండలంలోని సీతానాగులవరం గ్రామం కలిసిపోయింది. ఇక మిగిలింది సీతానాగులవరం నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న తర్లుపాడు మాత్రమే. అది కూడా పట్టణంలో కలిసిపోతే ఈ రోడ్డును విస్తరించకుంటే మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. 

మీరావలి, ద్విచక్ర వాహనదారుడు, తుమ్మలచెరువు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని