logo

పాత కక్షతో కారుకు నిప్పు

సింగరాయకొండలో తెదేపా నాయకుడు చిగురిపాటి గిరికి చెందిన కారు దహనం ఘటన పాతకక్షల నేపథ్యంలోనే చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు.

Published : 26 May 2024 01:32 IST

వివరాలు వెల్లడిస్తున్న ఏఎస్పీ(క్రైమ్స్‌) శ్రీధర్‌రావు.. చిత్రంలో ఒంగోలు డీఎస్పీ కిషోర్‌బాబు

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: సింగరాయకొండలో తెదేపా నాయకుడు చిగురిపాటి గిరికి చెందిన కారు దహనం ఘటన పాతకక్షల నేపథ్యంలోనే చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. ఒంగోలులోని జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో అదనపు ఎస్పీ(క్రైమ్స్‌) శ్రీధర్‌రావు ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. సింగరాయకొండ మండలం మూలగుంటపాడు విద్యానగర్‌లోని చిగురుపాటి శేషగిరి అలియాస్‌ గిరికి చెందిన కారును ఈ నెల 24వ తేదీ అర్ధరాత్రి సమయంలో ఇద్దరు యువకులు పెట్రోల్‌ పోసి నిప్పు అంటించారు. కారు యజమాని శేషగిరి వెంటనే సింగరాయకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్పీ గరుడ్‌ సుమిత్‌ సునీల్‌ ఆదేశాల మేరకు ఏఎస్పీ(క్రైమ్స్‌) శ్రీధర్‌రావు పర్యవేక్షణలో ఒంగోలు డీఎస్పీ కిషోర్‌బాబు ఆరు ప్రత్యేక బృందాలను దర్యాప్తునకు ఏర్పాటు చేశారు.

భయభ్రాంతులకు గురిచేయాలనే..: కారు యజమాని చిగురుపాటి శేషగిరికి, అదే గ్రామానికి చెందిన కనసాని ఈశ్వర్‌రెడ్డికి మధ్య పాత విభేదాలున్నాయి. ఈశ్వర్‌రెడ్డి సింగరాయకొండలో లాడ్జితో పాటు బెంగళూరులో హాస్టళ్లు నిర్వహిస్తుంటారు. 2018లో ఈశ్వర్‌రెడ్డికీ, అశోక్‌ అనే వ్యక్తికి మధ్య తలెత్తిన భూవివాదంలో శేషగిరి మధ్యవర్తిగా వ్యవహరించారు. సదరు ఒప్పంద పత్రాలను తన వద్దే ఉంచుకున్నారు. దీంతో అతనిపై కక్ష పెంచుకుని కారును తగులబెట్టడం ద్వారా భయభ్రాంతులకు గురిచేయాలని భావించారు. ఇందుకు తన వద్ద పనిచేసే బాలుడిని వినియోగించుకున్నాడు. అతను తన స్నేహితుడైన పాలేటి అభిషేక్‌ అలియాస్‌ టింకూను ఆశ్రయించాడు. టింకూది జరుగుమల్లి మండలం నర్శింగోలు. ప్రస్తుతం హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నాడు. వీరికి మూడు సీసాల పెట్రోల్‌తో పాటు రూ.ఏడు వేల నగదును ఈశ్వర్‌రెడ్డి సమకూర్చి కారును దహనం చేయాలని పురమాయించారు. వీరిద్దరూ 24వ తేదీ అర్ధరాత్రి ద్విచక్ర వాహనంపై వెళ్లి కారుపై పెట్రోలు పోసి నిప్పంటిచారు. అదే సమయంలో స్థానికులు చూసి కేకలు వేయటంతో అక్కడి నుంచి పారిపోయారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ప్రధాన నిందితుడు ఈశ్వర్‌రెడ్డి, బాలుడు, అతని స్నేహితుడు అభిషేక్‌ అలియాస్‌ టింకూలను అదుపులోకి తీసుకున్నారు. విలేకరుల సమావేశంలో ఒంగోలు డీఎస్పీ కిషోర్‌బాబు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని