logo

కోడేమైనా వైకాపా నేతల చుట్టమా!

ఎన్నికల కోడ్‌ అమలును వైకాపా నేతలు ఆది నుంచీ పరిహాసం చేస్తున్నారు.

Published : 26 May 2024 01:35 IST

అనంతవరంలో రహదారి నిర్మాణానికి పోసిన కంకర డస్ట్‌

టంగుటూరు, న్యూస్‌టుడే: ఎన్నికల కోడ్‌ అమలును వైకాపా నేతలు ఆది నుంచీ పరిహాసం చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలంటూ అనేక అడ్డదారులు తొక్కారు. ఓటర్లకు అభ్యర్థులు, నేతలు ఉద్యోగులు, సిబ్బందికి విచ్చలవిడిగా తాయిలాలు పంచారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు పంపకాలకు బరితెగించారు. ఎన్నికల రోజూ అదే తీరు ప్రదర్శించారు. కొన్నిచోట్ల నాయకులు ఏకంగా పోలింగ్‌ బూత్‌లలోకి వెళ్లారు. ఓటింగ్‌ ప్రక్రియ ముగిసిన తర్వాత కూడా అదే తీరు ప్రదర్శిస్తున్నారు. నియమావళి అమలుకు నిలువునా తూట్లు పొడుస్తున్నారు.

కంకర డస్ట్‌ను చదును చేసిన దృశ్యం

సచివాలయం చెంతనే అయినా...: వాస్తవానికి ఎన్నికల కోడ్‌ జూన్‌ 4 వరకు అమలులో ఉంటుంది. ఈ క్రమంలో నూతనంగా ఎక్కడా ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టడానికి వీలు లేదు. వైకాపా నేతలు మాత్రం ఇవేమీ పట్టించుకోవడం లేదు. టంగుటూరు మండలం అనంతవరంలో రోడ్డు పనులను యథేచ్ఛగా చేస్తున్నారు. ఆ గ్రామ ఎస్టీ కాలనీ నుంచి రొయ్యల చెరువుల వరకు కి.మీ దూరం పొడవున మట్టి రోడ్డుంది. ఈ మార్గంలో కొంత మేర గతంలో సీసీ రోడ్డు వేసి వదిలేశారు. మిగిలిన భాగాన్ని ఇప్పుడు నిర్మించే పనిలో పడ్డారు. ఇప్పటికే డస్ట్‌ తోలి చదును పనులు కొంతమేర పూర్తి చేశారు. ఈ పనులు గ్రామ సచివాలయానికి కూత వేటు దూరంలోనే చేస్తున్నప్పటికీ ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదు. ఈ విషయంపై పంచాయతీరాజ్‌ ఏఈ శ్రీహరిని ‘న్యూస్‌టుడే’  ప్రశ్నించింది. ఆయన మాట్లాడుతూ.. ఫిబ్రవరిలో చేపట్టిన పనులకు మెరక పనులు చేస్తున్నారని తొలుత చెప్పారు. వివాదం తలెత్తడంతో ఎన్నికల కోడ్‌ పూర్తయ్యే వరకు పనులు నిలిపివేయాలని గ్రామ సర్పంచికి సూచించినట్లు తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని