logo

బిందెలు X బిల్లులు

మనిషి బతకాలంటే నీళ్లు అవసరం. సులభంగా పొందడం ప్రజల ప్రాథమిక హక్కు. ఆ బాధ్యతల నిర్వహణలో వైకాపా ప్రభుత్వం విఫలమైంది.

Published : 26 May 2024 01:39 IST

గొంతులెండుతున్న గ్రామాలు
చెల్లించాల్సింది  రూ. 22 కోట్లు
పర్యవేక్షణ లేని తాగునీటి పథకాలు

తాగునీటి సరఫరా కోరుతూ ఒంగోలులో ఆందోళన (పాత చిత్రం)

మనిషి బతకాలంటే నీళ్లు అవసరం. సులభంగా పొందడం ప్రజల ప్రాథమిక హక్కు. ఆ బాధ్యతల నిర్వహణలో వైకాపా ప్రభుత్వం విఫలమైంది. నీళ్ల కోసం రోజుల తరబడి పడిగాపులు పడుతున్నా పూర్తిస్థాయిలో బిల్లులు చెల్లించడంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. పశ్చిమ ప్రకాశంలో నీటి సమస్య తీవ్రత అధికం. ఈ నేపథ్యంలో ఆ ప్రాంత వాసులకు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయడమే దిక్కు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాలుగేళ్లుగా ట్యాంకర్ల గుత్తేదారులకు కోట్లాది రూపాయల మేర బిల్లులు పెండింగ్‌ పెడుతూనే ఉంది. సదరు గుత్తేదారుల ఆందోళనతో 2023 మార్చి నెల వరకు సార్వత్రిక ఎన్నికలకు ముందు చెల్లించారు. ఆ తర్వాత నుంచి సుమారు 14 నెలల కాలానికి జిల్లా వ్యాప్తంగా ఇంకా రూ.22 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌ ఉన్నాయి.

న్యూస్‌టుడే, ఒంగోలు గ్రామీణం

126 ఆవాస ప్రాంతాలకు ట్యాంకర్లే దిక్కు...

ఈ ఏడాది ఫిబ్రవరిలోనే వేసవి దృష్ట్యా పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఇప్పటికే పలు చోట్ల తాగునీటి బోర్లు ఎండిపోయాయి. దీంతో పశ్చిమ ప్రకాశంలోని ఎక్కువ గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తి ట్యాంకర్ల ద్వారా సరఫరా కొనసాగుతోంది. నీటి వనరుల లభ్యత లేక కొన్ని ఆవాస ప్రాంతాల్లోని రక్షిత మంచినీటి పథకాలు నిరుపయోగంగా మారాయి. గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు ప్రభుత్వానికి నివేదికలు పంపుతున్నా.. నిధుల విడుదలలో మాత్రం ఎడతెగని జాప్యం చోటుచేసుకుంటోంది. దీంతో క్షేత్రస్థాయిలో ట్యాంకర్లతో నీటి సరఫరా అరకొరగానే సాగుతోంది.

  • దర్శి, మార్కాపురం, యర్రగొండపాలెం నియోజకవర్గాల పరిధిలోని 11 మండలాలకు చెందిన 126 గ్రామాల్లో ప్రస్తుతం ట్యాంకర్ల ద్వారా రోజుకు సుమారు వెయ్యి ట్రిప్పులు చొప్పున సరఫరా చేస్తున్నారు. అందుకు సరాసరిన ట్రిప్పునకు రూ.400 చొప్పున నిధులు ఖర్చు చేస్తున్నారు.
  • పశ్చిమ ప్రకాశంలో గుత్తేదారుల ఆందోళనతో 2019 నుంచి 2023 మార్చి వరకు పెండింగ్‌ ఉన్న రూ.134 కోట్ల మేర బకాయిలను విడతల వారీగా చెల్లించారు.
  • 2023 ఏప్రిల్‌ నుంచి ఇప్పటివరకు జిల్లాలో సుమారు రూ.22 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌ ఉంది.

సీపీడబ్ల్యూ పథకాలకూ గండం...

ఇనమనమెళ్లూరులో పిచ్చి మొక్కలతో నిండిన ఫిల్టర్‌బెడ్‌ 

సమృద్ధిగా ఉన్న నీటి వనరుల నుంచి గ్రామాలకు సురక్షితమైన నీరు అందించాలన్న ఉద్దేశంతో సమగ్ర రక్షిత మంచి నీటి పథకాలను అమల్లోకి తీసుకొచ్చారు. నిర్వహణకు నిధుల విడుదల అంతా జడ్పీ నుంచి కేటాయిస్తారు. అయితే వాటి పర్యవేక్షణ గ్రామీణ నీటిసరఫరా విభాగం అధికారులది. సదరు గుత్తేదారులకు బిల్లులు పెండింగ్‌ ఉండటంతో పథకాల నిర్వహణ గురించి అంతగా పట్టించుకోవడం లేదు. మరోపక్క పనిచేస్తున్న సిబ్బందికి నెలల తరబడి గుత్తేదారులు వేతనాలు ఇవ్వడం లేదు. దీంతో సదరు పథకాల నిర్వహణ మొక్కుబడిగా సాగుతోంది. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అయిదేళ్ల నుంచి తరచూ బిల్లుల పెండింగ్‌ ఉంటోంది. కొందరు గుత్తేదారులు కోర్టుకెళ్లి బిల్లులు తెచ్చుకున్నారు.

  • జిల్లా ప్రజా పరిషత్‌ యాజమాన్య పరిధిలో మొత్తం 50 సీపీడబ్ల్యూ పథకాలున్నాయి. 
  • నిర్వహణకు ఏటా సుమారు రూ.30 కోట్ల నిధులు అవసరం. అందుకు ఆర్థిక సంఘం నిధులనే కేటాయిస్తారు.
  • 2023-24 ఆర్థిక సంవత్సరం ముగిసినప్పటికీ 15వ ఆర్థిక సంఘం నిధుల కింద జడ్పీకు మొదటి విడతగా రూ.11 కోట్లు విడుదలయ్యాయి. రెండో విడత కింద మరో రూ.11 కోట్ల నిధులు ఇంకా జమ కాలేదు.
  • జిల్లా వ్యాప్తంగా సీపీడబ్ల్యూ పథకాలకు సంబంధించి గుత్తేదారులకు రూ.5 కోట్ల మేర బిల్లులు చెల్లించాల్సి ఉంది. విద్యుత్తు బకాయిల కింద మరో రూ.134 కోట్లు అదనం. 
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని