logo

రహదారిని ఆక్రమించి.. కంచె వేసి

బేస్తవారపేట పంచాయతీ లోని రెడ్డినగర్‌లో ఓ గృహ యజమాని తన ఇంటి ముందు స్థలాన్ని ఆక్రమించి ఏకంగా ఫెన్సింగ్‌ వేయడం చర్చనీయాంశమైంది.

Published : 27 May 2024 02:23 IST

కాలువను పూడ్చేసి నిర్మాణం
ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు

వడ్డెర బజార్‌కు వెళ్లే దారిలో ఓ గృహ యజమాని తన ఇంటి ముందు రోడ్డును ఆక్రమించి ఫెన్సింగ్‌ వేసిన దృశ్యం

బేస్తవారపేట, న్యూస్‌టుడే : బేస్తవారపేట పంచాయతీ లోని రెడ్డినగర్‌లో ఓ గృహ యజమాని తన ఇంటి ముందు స్థలాన్ని ఆక్రమించి ఏకంగా ఫెన్సింగ్‌ వేయడం చర్చనీయాంశమైంది.  వడ్డెర బజార్‌కు వెళ్లే దారిలో ఓ ఇంటి యజమాని తన నివాస గృహం ముందు ఉన్న ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి సొంత మంచినీటి బోరు ఏర్పాటు చేసుకున్నారు. దాన్ని కాపాడుకునేందుకు ఇంటి ముందు ఉన్న పక్కా కాలువపై సిమెంట్ కాంక్రీట్ వేసి రోడ్డు ముందర కొంతమేర స్థలాన్ని ఆక్రమించి చుట్టూ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేశారు. ఆ తతంగం చేసే క్రమంలో కాలువ పూడిపోయినా ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో వడ్డెర బజార్‌ నుంచి మురుగు పారేందుకు అవకాశం లేకపోవడంతో మురుగంతా ఎక్కడికక్కడ స్తంభించి పోయి రహదారిపై పారుతుండటంతో పాటు దుర్గంధం వెదజల్లుతోందని స్థానికులు వాపోతున్నారు. కాలువ పూడ్చివేతకు గురికావడంతో ఇటీవల కురిసిన వర్షానికి సైతం వర్షపు నీరంతా ముందుకు వెళ్లే అవకాశం లేక రహదారిపై నిలిచిపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రహదారి స్థలాన్ని ఆక్రమించి ఫెన్సింగ్‌ వేయడంతో వడ్డెర బజార్‌కు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడుతున్నామని వాహనచోదకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు వినతి పత్రాన్ని అందజేసినప్పటికీ వారు తాత్కాలిక చర్యలతో మమ అనిపించారే తప్ప పూర్తి స్థాయిలో ఆక్రమణ తొలగించేందుకు చర్యలు తీసుకోలేదని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలను తొలగించి ఆక్రమణలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయంపై ఈవోపీఆర్డీ రామాంజనేయులును వివరణ కోరగా పంచాయతీ కార్యదర్శితో కలిసి ఆ ప్రాంతాన్ని పరిశీలించి ప్రభుత్వ స్థలం ఆక్రమణకు గురైతే ఆక్రమణలకు తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని, పూడ్చివేతకు గురైన కాలువను పూడికతీత తీయించి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని  తెలిపారు. 

కాలువ పూడ్చివేతకు గురికావడంతో వడ్డెర బజార్‌లో నిలిచిన నీరు 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని