logo

కళ్లెదుటే ఎండుతున్న బత్తాయి తోటలు

బత్తాయి తోటలు అంటే ఒకప్పుడు కాసులు కురిపించే పంట. అలాంటిది నేడు తోటలు కనుమరుగై పోతున్నాయి. తీవ్రమైన ఎండలతో నీటి తడులు అందక చెట్లు ఎండిపోతున్నాయి. దీనికితోడు చీడ పీడలు తోటలను సర్వ నాశనం చేస్తున్నాయి.

Published : 27 May 2024 02:28 IST

పంటను కాపాడుకోలేక  రైతుల విలవిల
న్యూస్‌టుడే, కనిగిరి 

కనిగిరి మండలం పేరంగుడిపల్లి వద్ద ఎండిపోయిన బత్తాయి చెట్లు 

బత్తాయి తోటలు అంటే ఒకప్పుడు కాసులు కురిపించే పంట. అలాంటిది నేడు తోటలు కనుమరుగై పోతున్నాయి. తీవ్రమైన ఎండలతో నీటి తడులు అందక చెట్లు ఎండిపోతున్నాయి. దీనికితోడు చీడ పీడలు తోటలను సర్వ నాశనం చేస్తున్నాయి. ఏళ్ల తరబడి కంటికి రెప్పలా చూసుకుంటూ పెంచిన పండ్లతోటలు కళ్లెదుటే ఎండిపోతుంటే దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు కొట్టుమిట్టాడుతున్నారు. జిల్లాలో బత్తాయి సాగు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

జిల్లాలో కనిగిరి, మార్కాపురం, గిద్దలూరు, త్రిపురాంతకం, తాళ్లూరు, కంభం, కొండపి, ఒంగోలు, సంతనూతలపాడు, దర్శి ప్రాంతాల్లో 1,520 హెక్టార్లలో బత్తాయి సాగవుతోంది. ఎండలు మండుతున్నా తోటలన్నీ మంచి కాపు మీద ఉన్నాయి. ప్రతి ఏటా ఏప్రిల్, మే, జూన్‌ నెలల్లో వచ్చే పంటతోనే రైతులకు కాస్త డబ్బులు చేతికి అందుతాయి. ప్రస్తుతం నీటి ఎద్దడి అధికం కావడం, భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో తోటలు నిలువునా ఎండి పోతున్నాయి. పక్వానికి వచ్చిన కాయలు సైతం చెట్టుపైనే ఎండి పోతున్నాయి. వీటిని కాపాడుకునేందుకు అన్నదాతలు అప్పులు చేసి బోర్లు వేసినా నీటి జాడ కనిపించడం లేదు. కనిగిరి, వెలిగండ్ల, పామూరు, పీసీపల్లి మండలాల్లో 700 అడుగులకు పైగా బోర్లు వేసినా నీళ్లు పడడం లేదని రైతులు వాపోతున్నారు. చాలామంది రైతులు చేసేదేమీ లేక తోటలను వదిలేస్తున్న పరిస్థితి. 

వెలిగండ్లమండలం కంకణంపాడులో బత్తాయి కాయలు ఇలా..

తప్పని తెగుళ్ల బెడద 

బత్తాయి తోటలు సాధారణంగా ఇతర పంటలకంటే కాస్త మొండి రకం. సాగు కూడా సులభం. కొంచెం నీరు ఎక్కువైనా, తక్కువైనా తట్టుకుని బతకగలవు. అందుకే ఎక్కువ మొత్తంలో సాగు చేయడానికి రైతులు ఆసక్తి చూపుతారు. అయితే చీడపీడలు మాత్రం ఎక్కువ. సాగుదారులు రూ.వేలల్లో ఖర్చుచేసి రసాయన మందులను పిచికారీ చేసినా తెగుళ్లు నయం కాకపోవడంతో చెట్లను తొలగించేస్తున్నారు. దీంతో తోటలు కనుమరుగు అవుతున్నాయి. జిల్లా బత్తాయికి జాతీయ మార్కెట్‌లో మంచి పేరుంది. అధికంగా బంగ్లాదేశ్, శ్రీలంకతో పాటు మనదేశంలోని కోల్‌కతా, కర్ణాటక, దిల్లీ, మహారాష్ట్రలకు అధికంగా ఎగుమతి అవుతాయి. భూగర్భ జలాలు అడుగంటి పోవడం వల్ల కాయ సైజు తగ్గింది. నాణ్యత కాస్త తగ్గడంతో వ్యాపారులు కొనుగోలుకు అంత ఆసక్తి చూపడం లేదు. టన్ను రూ.50 వేలు పలకాల్సిన బత్తాయి, రూ. 30 వేలకు మించి ధర పలకడం లేదు. మొత్తం మీద ఓ పక్క నీటి తడులు అందక, బెట్టకు వచ్చి ఎండిపోతుంటే, మరోపక్క రేట్లు లేక, తెగుళ్ల బెడదతో రైతన్న తీవ్రంగా నష్ట పోతున్నాడు. ప్రభుత్వం ఆదుకుంటేనే తాము నష్టాల నుంచి బయటపడతామని రైతులు చెబుతున్నారు. 

కనిగిరి సమీపంలోని ఓ తోటలో నీళ్లు పడక వదిలేసిన బోరు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని