logo

తగ్గిన ధరలు.. నిలిచిన కోతలు

హనుమంతునిపాడు మండలంలో నిమ్మ దిగుబడులకు గిట్టుబాటు ధర లేకపోగా కోతలు నిలిచిపోయాయి. వారం రోజులుగా కిలో రూ.60 నుంచి రూ.30లకు పడిపోవడంతో నిమ్మ రైతులు కోతలు నిలిపి వేశారు.

Published : 27 May 2024 02:31 IST

కిలో నిమ్మ రూ.30కి పడిపోవడమే కారణం  
భారీగా నష్టపోయిన కౌలు రైతులు
న్యూస్‌టుడే, హనుమంతునిపాడు

ఎగుమతులు లేక కమీషన్‌ దుకాణాల్లో నిలిచిన నిమ్మకాయలు

నుమంతునిపాడు మండలంలో నిమ్మ దిగుబడులకు గిట్టుబాటు ధర లేకపోగా కోతలు నిలిచిపోయాయి. వారం రోజులుగా కిలో రూ.60 నుంచి రూ.30లకు పడిపోవడంతో నిమ్మ రైతులు కోతలు నిలిపి వేశారు. అకాల వర్షాలు ఇప్పటికే కొంతమేర పంటను దెబ్బతీశాయి. ఇప్పుడు గూడూరు, కృష్ణా జిల్లాల నుంచి అధికంగా రాష్ట్రీయ మార్కెట్‌కు నిమ్మ కాయలు వస్తుండడంతో ధరలు పడిపోయాయి. చెన్నై, అహ్మదాబాద్, బెంగళూరు మార్కెట్లకు ఎగుమతులు మందగించాయి. కనిగిరి కమీషన్‌ మార్కెట్‌కు రోజుకు పది లారీల సరుకు వచ్చేది. ప్రస్తుతం రెండు మూడు లారీలకు మించి రావడం లేదు. కనిగిరి ప్రాంతం నుంచి ఒంగోలు, నంద్యాల, మార్కాపురం స్థానిక మార్కెట్లకు వెళ్తున్న రెండోరకం నిమ్మకు రూ.5లకు మించి ధర రాకపోగా రైతులు కోతలు నిలిపివేశారు. ధరలు ఆశాజనకంగా లేకపోవడంతో కోత కూలీలు, పార్శిల్‌ ఖర్చులు కూడా దక్కడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పది రోజులుగా కోతలు నిలిపి వేయండంతో తోటల్లోనే నాణ్యమైన కాయలు చెట్ల కింద కుప్పలుగా పడిపోయాయి. కూలీలకు పనులులేక ఇక్కట్లు పడుతున్నారు. కనీస ధర కూడా దక్కకపోవడంతో రూ.లక్షలు పెట్టి తోటలు తీసుకున్న కౌలు రైతులు భారీగా నష్టపోయారు. మే నెలలో కిలో రూ.వందకు తగ్గకుండా ధర వస్తుందని ఆశించిన రైతులకు ఈ ఏడాది నిరాశే మిగిలింది. ఎండలు మండుతున్నా అకాల వర్షంతో ధర రాలేదని రైతులు వాపోతున్నారు.

హెచ్‌ఎంపాడులోని తోటల్లో కోతలు నిలిపివేయడంతో నేలరాలిన  నిమ్మకాయలు 


ప్రభుత్వమే ఆదుకోవాలి
-వనుకూరి రామిరెడ్డి, నిమ్మ రైతు, వెంగపల్లి

గతంలో మాదిరిగా నిమ్మకాయలను మార్కెట్‌ కమిటీల ద్వారా కొనుగోలు చేసి ఆదుకోవాలి. కనిగిరిలో కోల్డ్‌ స్టోరేజీ నిర్మిస్తే రైతులు పంట ఉత్పత్తులను నిల్వ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. మార్కెట్‌లో ధరలు పెరిగినప్పుడు విక్రయించి కనీసం పెట్టుబడులైనా దక్కించుకునేందుకు వీలుంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని