logo

గుల్ల చేసి... కొల్లగొడుతున్నారు!

గత అయిదేళ్లుగా యథేచ్ఛగా సహజ వనరులను కొల్లగొట్టిన అధికార పార్టీ నాయకులు నేటికీ ఆ దందా సాగిస్తున్నారు. ఇసుక అక్రమ తవ్వకాలపై ఇటీవల సుప్రీం కోర్టు వెలువరించిన మార్గదర్శకాలను సైతం ధిక్కరించి అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు.

Published : 27 May 2024 02:47 IST

ఆగని ఇసుక, మట్టి మాఫియా దందా
రూపు కోల్పోతున్న జలవనరులు
న్యూస్‌టుడే - వెలిగండ్ల

త అయిదేళ్లుగా యథేచ్ఛగా సహజ వనరులను కొల్లగొట్టిన అధికార పార్టీ నాయకులు నేటికీ ఆ దందా సాగిస్తున్నారు. ఇసుక అక్రమ తవ్వకాలపై ఇటీవల సుప్రీం కోర్టు వెలువరించిన మార్గదర్శకాలను సైతం ధిక్కరించి అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. మట్టినీ మింగేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ కారణంగా జలవనరులకు ముప్పు వాటిల్లుతున్నా... సంబంధిత అధికారులు పట్టించుకుంటున్న దాఖలాలు లేవు.

మారెళ్ల చెరువులో మట్టి తోడేయడంతో ఏర్పడిన గుంత

అడ్డగోలుగా రవాణా...

కనిగిరి పెద్ద చెరువు, నాగుల చెరువు, మోపాడు జలాశయం, మారెళ్ల చెరువు, పీసీపల్లి చెరువు, పందువ, ఎన్‌ గొల్లపల్లి చెరువు తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఇసుక తవ్వకాలు సాగుతున్నాయి. ప్రతి రోజూ రాత్రి మొదలు పెట్టి తెల్లవారు జాము వరకు యథేచ్ఛగా ట్రాక్టర్లతో రవాణా సాగిస్తున్నారు. పాలేరు, బట్టుపల్లి, మన్నేరు వాగులో సైతం అడ్డగోలు వ్యవహారం సాగుతోంది. ట్రక్కు ఇసుక రూ.5 వేలు చొప్పున... నిత్యం వందలాది ట్రాక్టర్ల ఇసుకను కనిగిరి పరిసరాలతో పాటు, పొరుగు జిల్లా నెల్లూరులోని కొన్ని ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లోనే మొత్తం దందా సాగుతున్నట్లు ప్రచారం జరగుతోంది.

తవ్వకాలతో కనిగిరి పెద్ద చెరువులో బయటకొచ్చిన చెట్ల వేర్లు 

యథేచ్ఛగా విక్రయాలు...

అయ్యన్నకోట, ఎన్‌.గొల్లపల్లితో పాటు కనిగిరి ప్రాంతంలోని అన్ని ప్రధాన చెరువులు, జలాశయాల్లో మట్టిని సైతం తోడేస్తున్నారు. నియోజకవర్గం పరిధిలో రోజుకు 500కు పైగా ట్రిప్పుల మట్టిని అక్రమంగా రవాణా చేస్తున్నట్లు అంచనా. ఒక్క నాగుల చెరువు, పెద్ద చెరువులోనే రెండు వందల ఎకరాల్లో మట్టి తవ్వకాలు సాగిస్తున్నారంటే... పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. లే అవుట్‌ల చదును, ఇతరత్రా అవసరాలకు ట్రాక్టరు మట్టిని రూ.800 చొప్పున విక్రయిస్తున్నారు. అక్రమార్కులు ఇలా సహజ వనరులను కొల్లగొట్టి... రూ.లక్షలు లూటీ చేస్తున్నా పట్టించుకున్నవారు కరవయ్యారు. సమాచారం ఇచ్చినా, అధికార పార్టీ నాయకులకు భయపడి... దందాను అడ్డుకునేందుకు అధికారులు ముందుకు రావడం లేదని కొందరు స్థానికులు ఆరోపిస్తున్నారు. 


అడ్డుకట్ట వేస్తాం...
- రంగారావు, కనిగిరి మున్సిపాలిటీ కమిషనర్‌

చెరువులు, ఇతర జల వనరుల్లో ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట వేస్తాం. ఎక్కడైనా తవ్వకాలు జరుపుతున్నట్లు సమాచారం ఇస్తే... వెంటనే దాడులు నిర్వహించి చర్యలు తీసుకుంటాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని